బాబోయ్‌ ఆగస్టు.. ముంచుకొస్తున్న ప్రమాదం..!

ABN , First Publish Date - 2020-08-01T20:31:01+05:30 IST

ఈ ఏడాది మార్చి నెలలో ఒకటి... ఏప్రిల్‌లో 79... మే నెలలో 206... జూన్‌లో 1320... జూలైలో 9346... ఇవన్నీ ఆయా నెలల్లో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులు. నెలవారీ కేసుల పెరుగుదల ఈ క్రమంలో వుంటే మరి

బాబోయ్‌ ఆగస్టు.. ముంచుకొస్తున్న ప్రమాదం..!

తిరుపతి(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది మార్చి నెలలో ఒకటి... ఏప్రిల్‌లో 79... మే నెలలో 206... జూన్‌లో 1320... జూలైలో 9346... ఇవన్నీ ఆయా నెలల్లో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసులు. నెలవారీ కేసుల పెరుగుదల ఈ క్రమంలో వుంటే మరి ఆగస్టులో....? ఈ ప్రశ్నే జిల్లా వాసులకు దడ పుట్టిస్తోంది. కళ్లెంలేని గుర్రంలా వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా తిరుపతి నగరం అల్లకల్లోలం అవుతోంది. జిల్లాలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను గుర్తు చేసుకుంటే మాత్రం భయం వెన్నులో పాకుతుంది. ఇప్పటికీ దాపరికంగా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం, వైరస్‌ను తేలిగ్గా తీసుకుంటున్న రాజకీయ నేతలు,  వైరస్‌ కన్నా వరలక్ష్మీ వ్రతమే ముఖ్యమని నమ్మి రోడ్లను ముంచెత్తిన జనం...ఈ తీరు మారకపోతే మాత్రం ఆగస్టు నెల చిత్తూరు జిల్లాను మరో ఇటలీ చేయడం ఖాయం. 


జూలైలోనే 9346 కేసులు 

ఈ ఏడాది మార్చి నెల 24వ తేదీన జిల్లాలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆ నెలకంతా కలిపి జిల్లాలో గుర్తించింది ఆ ఒక్కటే. అది కూడా శ్రీకాళహస్తిలో లండన్‌ మూలాలతో. తర్వాత ఏప్రిల్‌లో ఢిల్లీ మూలాలతో పలమనేరు, నగరి, ఏర్పేడు, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి తదితర మండలాల్లో మొత్తం 79 కేసులను గుర్తించారు. ఆపై మే నెలలో ఆ సంఖ్య 206కు చేరింది. అటు తర్వాత జూన్‌లో వాటికి ఆరు రెట్లకు పైగా పెరిగి 1320 కేసులు నమోదయ్యాయి. ఇక ప్రస్తుత జూలై నెల సంగతి చెప్పక్కరే లేదు. 31వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ నమోదైన కేసుల సంఖ్య 9346. గత నెలతో పోలిస్తే 8 రెట్లకుపైగా కేసులు పెరిగాయి.


ముంచుకొస్తున్న ప్రమాదం

మార్చిలో మొదలైన కరోనా వైరస్‌ వ్యాప్తి నెల నెలా గడిచే కొద్దీ జిల్లానంతటినీ కమ్ముకుంటూ వచ్చింది. జూలై చివరి వారం వచ్చేసరికి 66 మండలాలకూ పాకింది. నెలాఖరు నాటికి 11 వేల మందికి పైగా వైరస్‌ సోకింది. కొవిడ్‌ టెస్టుల్లో తేలినవే ఇవి. టెస్టులు చేసుకోని వారిలో మరెంత మందికి వైరస్‌ సోకిందో అంతుబట్టని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆగస్టు నెల గురించి అధికార యంత్రాంగం చేస్తున్న హెచ్చరికలు జిల్లావాసుల్లో భయాందోళనలు పెంచుతున్నాయి. ఆగస్టులో వైరస్‌ వ్యాప్తి మరింత పుంజుకుంటుందని, పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా వుంటుందని స్వయంగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులే హెచ్చరిస్తున్నారు. పరిస్థితి చేయి దాటిపోకుండా చూడడం కోసం జిల్లా యంత్రాంగం కొన్ని ప్రైవేటు ఆస్పత్రులను ఒప్పించి కొవిడ్‌ వైద్యం అందించేందుకు సన్నద్ధం చేసింది. తిరుపతిలో పలు ఆస్పత్రులు వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చాయి. అయితే వాటిలో పడకల సంఖ్య కేవలం 251 వుండగా వెంటిలేటర్‌ సదుపాయం వున్న పడకల సంఖ్య అయితే 33 మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టులో కేసులను తట్టుకునేందుకు వీలుగా బాధితులను వీలైన మేరకు హోమ్‌ క్వారంటైన్‌, హోమ్‌ ఐసొలేషన్‌లలో వుంచడానికే యంత్రాంగం ప్రాధాన్యమిస్తోంది. తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్ళలోనే వుండాలని, వైద్యులు సూచించిన మేరకు మందులు, ఆహారం తీసుకోవాలని సూచిస్తోంది. ఇబ్బంది తలెత్తితే ఆస్పత్రికి రావాలని లేదా అంబులెన్సుకు కాల్‌ చేయాలని సూచిస్తోంది. ప్రజలు జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం ప్రమాదం ముంచుకువస్తుంది.


కొవిడ్‌ పడకల సంఖ్య ఎంత?

జిల్లాలో అధికారులు చెబుతున్న కొవిడ్‌ పడకల సంఖ్య విషయం తికమకగా వుంది. అధికారులు చెబుతున్న దాని ప్రకారం 4211. స్టేట్‌ కొవిడ్‌ ఆస్పత్రిగా వున్న పద్మావతీ ఆస్పత్రిలో 450, జిల్లా కొవిడ్‌ ఆస్పత్రులైన రుయాలో 592, చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో 220, తిరుపతి ఈఎస్‌ఐ ఆస్పత్రిలో 150 చొప్పున ప్రభుత్వ, టీటీడీ ఆస్పత్రులన్నింటా కలిపి 1412 పడకలు మాత్రమే వున్నాయి. మొత్తం 1412 పడకల్లో ఐసీయూ పడకలు 237 మాత్రమే. ఐసీయూ కాని, ఆక్సిజన్‌ సదుపాయం లేని బెడ్లు 762. ఒక రుయాలో మాత్రమే ఆక్సిజన్‌ సదుపాయం వున్న బెడ్లు 376 వున్నాయి. అయితే ఈ ఆక్సిజన్‌ సదుపాయమల్లా మాస్కు మాత్రమే. స్వంతంగా శ్వాస తీసుకోగలిగే బాధితులకే ఉపయోగం. స్వంతంగా ఊపిరి తీసుకోవడం కష్టంగా వున్న వారికి ఈ సదుపాయం వల్ల ఒరిగేదేమీ వుండదు. అటువంటి వారికి వెంటిలేటర్లు అవసరం. కొవిడ్‌ ఆస్పత్రులన్నింటా కలిపి వున్న వెంటలేటర్లు 165. వీటి వాడకంపైనా జనానికి పలు అనుమానాలున్నాయి. ఎందుకంటే వెంటిలేటర్ల వాడకం, వాటి ద్వారా రికవరీ అయిన బాధితుల గురించి జిల్లా యంత్రాంగం గోప్యత పాటిస్తోంది.


ఇక పడకల విషయానికొస్తే వున్న పడకలే 1412 అయితే 4211 పడకలు ఎక్కడి నుంచీ వచ్చాయన్నది ప్రశ్న. అయితే తిరుపతిలోని పద్మావతి నిలయం కొవిడ్‌ సెంటర్‌లో 719 పడకలు, శ్రీనివాసంలో 1100 పడకలు, విష్ణు నివాసంలో 800 పడకలు కలిపి 2619 అవుతున్నాయి. వీటిని కూడా పడకల కిందే జిల్లా యంత్రాంగం లెక్కిస్తోంది. వాస్తవానికి కనీసం 50 పడకలకు ఒకరైనా వైద్యులు అందుబాటులో వుండి ఇతర వైద్య సిబ్బంది, వైద్య పరికరాలు, సదుపాయాలు అందుబాటులో వున్న వాటినే పడకలుగా లెక్కించాలి. కానీ అసలు లక్షణాలు లేని, లేదా స్వల్ప లక్షణాలు వున్న కొవిడ్‌ బాధితులను మాత్రమే ఈ సెంటర్లలో వుంచుతున్నారు. వీటిలో వైద్యులు వుండడం లేదు. ఉన్నా మొత్తం సెంటర్‌కు ఒకరిద్దరే వుంటున్నారు. లేదంటే అత్యవసరమైతే వైద్యులు ఆస్పత్రుల నుంచీ వస్తారు. లేదా ఆందోళనకరంగా వున్న బాధితుని ఆస్పత్రికైనా తరలిస్తారు. ఇక వైద్య సిబ్బంది కూడా నామమాత్రంగా వుంటున్నారు. రోజువారీ శరీర ఉష్ణోగ్రత చెక్‌ చేయడం, వేళకు మందులు ఇవ్వడం, లక్షణాల గురించి వాకబు చేస్తుండడం వీరి డ్యూటీ.  ఇలాంటి వాటిని పడకలుగా ఎలా లెక్కించాలో అర్థం కావడం లేదు. ఈ కొవిడ్‌ సెంటర్ల పకడలు కలిపినా కూడా 4211 కావు. ప్రభుత్వంతో సంబంధంలేని కుప్పంలోని ప్రైవేటు మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి 180 పడకలను ఈ జాబితాలో చేర్చారు. ఇదీ జిల్లాలో పడకల లెక్క. నిజానికి జిల్లాలో కొవిడ్‌ బాధితులకు అందుబాటులో వున్నది కేవలం 1412 మాత్రమే. వాటిలోనూ వెంటిలేటర్లతో కూడిన పడకలు 165, ఐసీయూ పడకలు 237. మిగిలిన 1010 పడకలు సాధారణమైనవే.


మిగిలిన బాధితులెక్కడున్నట్టు?

ఒకవేళ జిల్లా యంత్రాంగం చెప్పిన లెక్కనే తీసుకున్నా పడకలు 4211 వుంటే జూలై 31 నాటికి జిల్లాలో 4833 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. అంటే పడకల సంఖ్య కంటే బాధితుల సంఖ్య ఎక్కువై పోయింది.అయితే అధికారులు చెబుతున్న దాని ప్రకారం జూలై 29వ తేదీ నాటికి 2504 పడకలు బాధితులకు కేటా యించారు. అదే నిజమైతే మరి మిగిలిన 2330 మంది బాధితులు ఎక్కడున్నట్టు? ఇవన్నీ జనాన్ని తికమక పెడుతున్నాయి.


హడావుడి డిశ్చార్జిలు

కొవిడ్‌ కేంద్రాల్లో శుక్రవారం తెల్లవారి నుంచీ డిశ్చార్జిలు భారీగా ఉన్నాయి. పాజిటివ్‌ అని చేరి అయిదారు రోజులే అయినా సరే మీకు బాగానే ఉంది బయలు దేరండి అని చెబుతున్నారు. రెండు వేలు చేతిలో పెట్టి మందులు రాసిచ్చి కొనుక్కోండి. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి అని పంపేస్తున్నారు. పదహైదు రోజులు ఉండడానికి సంచులు సర్దుకుని వచ్చిన పాజిటివ్‌ బాధితులు ఏం చేయాలో తెలియక తలగోక్కుంటున్నారు. టెస్ట్‌ చేయకుండానే పంపేయడం ఏమిటని విస్తుపోతున్నారు. ఒంట్లో వైరస్‌ ఉందో లేదో తెలియకుండానే ఇంటికి తిరిగి వెళ్తే ప్రమాదం కదా అని ఆందోళన చెందుతున్నారు. చిన్న చిన్న ఇళ్ళలో ఉండే వారు, అద్దె ఇళ్ళలో ఉండేవారు ఇంట్లో విడిగా ఉండడం ఎలాగో తెలియక ఆవేదన చెందుతున్నారు. ఇవేవీ పట్టని యంత్రాంగం మాత్రం డిశ్చార్జి చేసేసి ఇంకా ఇక్కడే ఎందుకున్నారని ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఐ.సి.ఎం.ఆర్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం పది రోజులు ఐసొలేషన్‌లో ఉండాలి. ఐసొలేషన్‌ కేంద్రానికి వచ్చిన రోజు నుంచీ కాకుండా టెస్ట్‌ రిపోర్టు వచ్చిన రోజు నుంచీ కొందరినీ, శాంపిల్‌ ఇచ్చిన రోజు నుంచీ కొందరినీ లెక్క కట్టి ఇంక ఇంటికి వెళ్లిపోవచ్చు అంటున్నారు. మరి పదిరోజులు గడిచిపోతే వైరస్‌ ఒంట్లో లేనట్లే కదా ఇంక ఇంట్లో మరో వారం ఐసొలేషన్‌ ఎందుకు అని అడిగితే,  బలహీనంగా ఉంటారు కదా.  ముందు జాగ్రత్త కోసం అంటున్నారు. నిజానికి పాజిటివ్‌ సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుండడంతో యాక్టివ్‌ పాజిటివ్‌ల సంఖ్య తక్కువగా చూపడానికే ఇలా హడావుడిగా డిశ్చార్జిలు చేసేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. 


శ్రీనివాసంలో ఉన్న బెడ్స్‌ 

గదుల్లో 830 డార్మెంటరీల్లో  280 మొత్తం 1110.

ఉన్న బాధితులు 700.    ఖాళీలు  410.


విష్ణు నివాసంలో 

బెడ్స్‌  700.  బాధితులు 

650 మంది. ఖాళీలు  50.


పద్మావతి నిలయంలో..

 బెడ్స్‌ 750.  బాధితులు 

634 మంది. ఖాళీలు  116.


స్విమ్స్‌లో..

 బెడ్స్‌  450.  బాధితులు 

327 మంది. ఖాళీలు 123.


రుయాలో..

బెడ్స్‌ 450.  బాధితులు 350 మంచి. ఖాళీలు 100.


మొత్తం 576 బెడ్స్‌ నాన్‌ సీరియస్‌ బాధితులు కోసం ఖాళీగా ఉంటే. 223 బెడ్స్‌ సీరియస్‌ బాధితులు కోసం ఖాళీగా ఉన్నాయి. 

Updated Date - 2020-08-01T20:31:01+05:30 IST