సారీ..బాడీ మారిపోయింది

ABN , First Publish Date - 2020-05-13T10:08:14+05:30 IST

మద్యం మత్తులో వైద్య సిబ్బంది చేసిన తప్పు ఓ బాధితుడి బంధువులను తీవ్రంగా బాధించింది.

సారీ..బాడీ మారిపోయింది

పాజిటివ్‌కి బదులు నెగెటివ్‌ బాడీకి ఖననం


కర్నూలు, మే 12 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో వైద్య సిబ్బంది చేసిన తప్పు ఓ బాధితుడి బంధువులను తీవ్రంగా బాధించింది. కర్నూలు నగరానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కరోనా అనుమానితులుగా గత వారం చివర్లో జీజీహెచ్‌లో చేరారు. రిపోర్టులు రాకముందే ఆ ముగ్గురిలో ఇద్దరు శనివారం, ఒకరు ఆదివారం చనిపోయారు. సోమవారం సాయంత్రానికి వచ్చిన రిపోర్టుల్లో ఇద్దరికి పాజిటివ్‌, ఒకరికి నెగెటివ్‌ తేలింది. నెగెటివ్‌గా తేల్చిన మృతదేహానికి చెందిన బంధువుల్ని అధికారులు పిలిపించారు.


మృతదేహాన్ని ఇస్తే తీసుకెళ్లి అంత్యక్రియలు చేసుకొంటామని వారు కోరారు. అయితే, ఇదిగో అదిగో.. అంటూ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సిబ్బంది, అధికారులు కాలయాపన చేశారు. చివరకు ‘సారీ..బాడీ మారిపోయింది’ అని అసలు విషయం బయటపెట్టారు. పాజిటివ్‌కు బదులు నెగెటివ్‌ బాడీని పూడ్చిపెట్టామని చెప్పారు. దీంతో ఆగ్రహించిన ఆ మృతుడి కుమారుడు ఆందోళనకు దిగారు. దీనిపై విచారణకు కలెక్టర్‌ వీరపాండియన్‌.. త్రిసభ్య కమిటీని నియమించారు. సిబ్బంది కారణంగా మృతదేహాలు మారిపోవడం కర్నూలులో ఇది మూడోసారి. 

Read more