నిధులకు ‘నీళ్లు’

ABN , First Publish Date - 2020-12-13T08:55:33+05:30 IST

రాష్ట్రంలో జల వనరుల శాఖ పరిధిలోని ప్రాజెక్టుల నిర్మాణ వేగాన్ని పెంచామని చెబుతున్న వైసీపీ సర్కారు.. నిధుల విడుదలలో

నిధులకు ‘నీళ్లు’

పొంతనలేని బడ్జెట్‌ కేటాయింపులు.. ఖర్చులు

మొత్తం కేటాయించిన నిధులు 14,739 కోట్లు

డిసెంబరు నాటికి కేవలం 3,307 కోట్లే ఖర్చు

జలవనరుల శాఖ నిధులపై సర్కారు నిర్లిప్తత

ఆర్థిక సంవత్సరానికి మరో మూడు నెలలే గడువు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో జల వనరుల శాఖ పరిధిలోని ప్రాజెక్టుల నిర్మాణ వేగాన్ని పెంచామని చెబుతున్న వైసీపీ సర్కారు.. నిధుల విడుదలలో మాత్రం నిర్లిప్తత కనబరుస్తోంది. ఆర్థిక శాఖ గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జల వనరుల శాఖ పద్దు కింద 2020-21 బడ్జెట్‌లో కేటాయింపులన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. కీలకమైన పోలవరం ప్రాజెక్టుతో సహా.. ఇతర ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు ఊసేలేకుండా పొయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో మూడు నెలల కాలమే ఉండడంతో.. ఇక నిధుల విడుదల విషయాన్ని మరిచిపోవాల్సిందేనని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం.. రాయలసీమ దుర్భిక్ష నివారణ, పల్నాడు దుర్భిక్ష నివారణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, కొల్లేరు భారజల నివారణ పథకం వంటి వాటికి ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేసి రూ.90,000 కోట్ల మేర బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు ఇస్తున్న ప్రాధాన్యం.. జిల్లాల్లోని సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంపై లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


జల వనరుల శాఖకు 2020-21 వార్షిక బడ్జెట్‌లో రూ.11805.74 కోట్లు, అదనపు నిధులు రూ.2,933.75 కోట్లు(మొత్తం రూ.14,739.49 కోట్లు) కేటాయించారు. కానీ.. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు మాత్రం చేయడం లేదు. కేటాయించిన మొత్తంలో కేవలం రూ.7,439.68 కోట్లను(50ు) మాత్రమే మంజూరు చేసినట్టు ఆర్థిక శాఖ వెల్లడించింది. దీనిలోనూ రూ.3307.614 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.ఇక, ఈ ఆర్థిక సంవత్సరం కేవలం మూడు నెలలే ఉండడంతో జలవనరుల శాఖ పరిధిలోని ప్రాజెక్టులకు రూ.11431.876 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే.. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేకపోవడంతో.. 2020-21నాటి బడ్జెట్‌ కేటాయింపులన్నీ కాగితాలకే పరిమితమవుతున్నట్లు కనిపిస్తోంది.


మిగతా కేటాయింపులూ ఇంతే!

జల వనరుల శాఖ సెక్రటేరియేట్‌కు రూ.811.51 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది నవంబరు నాటికి రూ.549.11 కోట్లు మంజూరు చేయగా దీనిలో రూ.489.77 కోట్లు ఖర్చు చేశారు. ఇక, మిగిలిన రూ.321.74 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. మరి ఇప్పుడున్న పరిస్థితిలో నిధులు విడుదల చేస్తారా?  లేదా? అనేది సందేహంగా మారింది. మరోవైపు పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబరునాటికి పూర్తి చేస్తామని అసెంబ్లీలో ఇటీవల సీఎం జగన్‌ ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు 2020-21 బడ్జెట్‌లో రూ.4804.98 కోట్లు కేటాయించారు. అదనంగా మరో 111.25 కోట్లు కలుపుకొని ఈ నిధుల కేటాయింపు రూ.4916.23 కోట్లకు చేరింది. అయితే.. ఇందులో రూ.3804.52 కోట్లకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. వీటిలో ఇప్పటి వరకు.. రూ.576.55 కోట్లు మాత్రమే ఖర్చయ్యాయి. మరో రూ.4,339.64 కోట్ల మేర నిధులు వ్యయం కాకుండా మిగిలిపోయాయి. కర్నూలు ఇరిగేషన్‌ సర్కిల్‌ పరిధిలో సాగునీటి పథకాల కోసం రూ.457 కోట్లు కేటాయించినా.. ఇప్పటి వరకు నామమాత్రంగా రూ.35.80 కోట్లు మాత్రమే ఖర్చ చేశారు.


గోదావరి డెల్టాకు రూ.67.61 కోట్లు కేటాయించారు. ఖర్చు చేసింది మాత్రం రూ.6.24 కోట్లు  మాత్రమే. కృష్ణా డెల్టా సిస్టమ్‌కు రూ.422.32 కోట్లు కేటాయించి.. రూ.10.98 కోట్లను మించి ఖర్చు చేయలేదు. కడప ఇరిగేషన్‌ సర్కిల్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ సర్కిల్‌ పరిధిలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.1614.81 కోట్లు కేటాయించి.. రూ.495.08 కోట్లు వ్యయం చేసేందుకు ఆర్థిక శాఖ సమ్మతి తెలిపింది. అయితే.. ఈ నిధులను మించి రూ.802.67 కోట్లు జల వనరుల శాఖ వ్యయం చేసింది. కడప సర్కిల్‌లో మరో రూ.812.15 కోట్లు వ్యయం చేయాల్సి ఉందని జల వనరుల శాఖ చెబుతోంది. అయితే, నిధులు ఇస్తారా? లేదా? అనేది అనుమానమేనని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

Updated Date - 2020-12-13T08:55:33+05:30 IST