ఆలయాల జోలికి వస్తే ఊరుకోం

ABN , First Publish Date - 2020-09-12T09:13:26+05:30 IST

ఆలయాల జోలికి వస్తే ఊరుకోం

ఆలయాల జోలికి వస్తే ఊరుకోం

  • బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు 
  • ఆలయాల భద్రతకు చర్యలు తీసుకోవాలి: పురందేశ్వరి
  • అంతర్వేది ఘటనను నిరసిస్తూ బీజేపీ, జనసేన ధర్నాలు

ఒంగోలు కలెక్టరేట్‌, రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 11: అంతర్వేది ఘటనను ప్రభుత్వం ఆషామాషీగా తీసుకుంటోందని, సీబీఐ విచారణకు ఆదేశించాం కదా అని చేతులు దులిపేసుకోవడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అంతర్వేది ఘటనకు నిరసనగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద శుక్రవారం బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా సోము విలేకరులతో మాట్లాడారు. ఇకపై హిందూ దేవాలయాలు, భూముల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి మద్దతిస్తోందో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.


చర్చిలపై రాళ్లు రువ్వితే 30 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని, హిందూ దేవాలయాలపై వరుసదాడులు జరుగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని విమర్శించారు. కాగా,  దేవాలయాల భద్రతకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జాతీయ నేత దగ్గుబాటి పురందీశ్వరి డిమాండ్‌ చేశారు. ఒంగోలు కలెక్టరేట్‌ వద్ద బీజేపీ నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. అంతర్వేదితో పాటు అనేక ప్రాంతాల్లోని ఆలయాలపై దాడులు జరిగాయని, వీటన్నింటిపై సమగ్ర విచారణ చేసి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఆలయాలకు చెందిన వేల కోట్ల విలువ చేసే భూములు అన్యాక్రాంతమయ్యాయని, ఆ భూములన్నింటినీ స్వాధీనం చేసుకొని పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-09-12T09:13:26+05:30 IST