కన్నీటి పంట!

ABN , First Publish Date - 2020-04-28T09:54:36+05:30 IST

టమోటా రైతుకు కన్నీటి పంట పండింది. కరోనా ప్రభావంతో ఆరుగాల కష్టం

కన్నీటి పంట!

టమోటా రైతు కష్టం వృథా..

దిగుబడి బాగున్నా.. అమ్ముకోలేని దుస్థితి..

పడిపోయిన ధరలు..

15 కిలోలా బాక్సు రూ.50

పంటను పశువులకు వదిలేస్తున్న వైనం..


గార్లదిన్నె/అనంతపురం రూరల్‌, ఏప్రిల్‌ 27: టమోటా రైతుకు కన్నీటి పంట పండింది. కరోనా ప్రభావంతో ఆరుగాల కష్టం వ్యర్థమవుతోంది. పంట దిగుబడి బాగున్నా.. అమ్ముకుందామంటే మార్కెట్‌ లేదు. ధరాలేదు. చేసేదిలేక అన్నదాత ఆరుగాలం శ్రమించి పండించిన పంటను పశువులకు వదిలేస్తున్నాడు.


దిగుబడి బాగున్నా ఫలితం శూన్యం..

జిల్లాలో ఈ ఏడాది టమోటా సాగు పెరిగింది. దిగుబడి కూడా బాగా వచ్చింది. పంటను అమ్ముకుని, అప్పుల ఊబి నుంచి బయటపడదామని రైతు ఆశించాడు. ఇంతలోనే కరోనా మహమ్మారి వారి ఆశలను ఆవిరి చేసింది. జిల్లాలో రాప్తాడు, ముదిగుబ్బ, కళ్యాదుర్గం, అనంతపురంరూరల్‌, గార్లదిన్నె, కదిరి, బుక్కపట్నం తదితర ప్రాంతాల్లో టమోటా ఎక్కువగా సాగైంది. ఇక్కడి నుంచి బెంగుళూరు, హైదరాబాద్‌, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాలకు పంటను ఎగుమతి చేసేవారు. లాక్‌డౌన్‌ కారణంగా టమోటా మార్కెట్లు మూతపడ్డాయి. దీంతో రైతులు ఆశించిన మేర దిగుబడి వచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. పండించిన పంటను ఎలా అమ్ముకోవాలో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు పడిపోయారు.


పశువుల మేతకు ఇచ్చేస్తున్న వైనం..

పంటను విక్రయించుకునేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చాయి. అయినా టమోటా రైతుకు ఒనగూరిందేమీ లేదు. ధరల పతనంతో పంటను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావట్లేదు. దీంతో చేసేదిలేక పంటను పశువులకు వదిలేస్తున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను ఇలా వదిలేసుకోవాల్సి వస్తుండటంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.


హైదరాబాద్‌ తరలించినా..:సూర్యనారాయణ, రైతు, ఎం. కొత్తపల్లి, గార్లదిన్నె మండలం

మూడెకరాల్లో టమోటా సాగు చేశా. లాక్‌డౌన్‌తో పంటను కొనటానికి వ్యాపారులు ముందుకు రాలేదు. సొంతంగా 350 బాక్స్‌లు తీసుకుని వ్యాన్‌లో హైదారాబాద్‌ మార్కెట్‌కు తీసుకెళ్లా. మండీలో మూడు రోజులైనా బండి అన్‌లోడ్‌ చేయలేదు. దీంతో వ్యాన్‌ బాడుగ, కూలీలు, రవాణా ఖర్చు మొత్తం రూ.40వేలైంది. టమోటాలో సుమారు రూ.5 లక్షల నష్టం వాటిల్లింది. మిగిలిన పంటను గొర్రెలకు ఇచ్చేశా.


ఏటా నష్టాలే:మధుసూదన్‌రెడ్డి, రైతు, తిమ్మంపేట, గార్లదిన్నె మండలం

వ్యవసాయంలో ఏటా నష్టాలే మిగులుతున్నాయి. ఈ ఏడాది రెండెకరాల్లో టమోటా సాగుచేశా. లాక్‌డౌన్‌తో వ్యాపారులు రావట్లేదు. సొంతంగా మార్కెట్‌కు తీసుకెళ్తే బాక్స్‌ రూ.60కి మించి పలకట్లేదు. హైదారాబాద్‌కు తరలించాలంటే బాక్స్‌కు రూ.60 రవాణా ఖర్చు వస్తోంది. కూలీలు, రవాణా ఖర్చలు కూడా దక్కట్లేదు. ఇలా ఏటా నష్టాలే చవిచూస్తున్నా.


నారూ నష్టమే..టమోటా నారుకు తగ్గిన డిమాండ్‌ సగానికి పడిపోయిన ధర 

కళ్యాణదుర్గం: లాక్‌డౌన్‌ ప్రభావం టమోటా నారుపైనా పడింది. దీంతో నర్సరీల నిర్వాహకులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏటా టమోటా నారుకు డిమాండ్‌ బాగా ఉండేది. ఇదే తరహాలోనే ఈ ఏడాది కూడా ఉంటుందనే నమ్మకంతో విస్తారంగా నర్సరీల్లో టమోటా నారు పోశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రైతులు పంట సాగుకు ముందుకురాకపోవటంతో ధర సగానికి పడిపోయింది. గతంలో నారు రూ.40పైసలకు విక్రయించేవారు. ప్రస్తుతం రూ.20పైసలకు కూడా కొనుగోలు చేసేవారు లేరు. దీంతో పరిరక్షణ భారమై, పడేయాల్సిన దుస్థితి నెలకొందని నర్సరీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కళ్యాణదుర్గం ప్రాంతంలో సుమారు 400 నర్సరీలున్నాయి. ఈ ఏడాది టమోటా రెట్టింపు విస్తీర్ణంలో సాగవుతుందని ఆశించారు. లాక్‌డౌన్‌ దృష్ట్యా రైతులు టమోటా సాగు చేసేందుకు ఆసక్తి చూపట్లేదు. ఈ క్రమంలో నర్సరీ యజమానులకు కోలుకోలేని దెబ్బ పడింది. వేలాది రూపాయలు వెచ్చించి, నారు పోశారు. నాటు దశకు చేరుకుంది. నెలన్నర దాటుతున్నా కొనేవారు లేరు. దీంతో పడేయాల్సి వస్తోంది. ఫలితంగా నర్సరీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు.

Updated Date - 2020-04-28T09:54:36+05:30 IST