మట్టిని మింగేస్తున్నారు!

ABN , First Publish Date - 2020-12-19T06:58:18+05:30 IST

సామాన్యుడు ఎద్దుల బండి తో ఇసుక తోలుకున్నా కేసులు పెడుతున్న తరుణంలో ని బంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిలో టిప్పర్లతో వందలాది ట్రిప్పుల మట్టి తోలేస్తున్నా అధికారులు కళ్లు మూసుకున్నారు.

మట్టిని మింగేస్తున్నారు!
ప్రభుత్వ మట్టితో లేఅవుట్‌ కోసం చదును చేసిన భూమి

ప్రయివేటు లేఅవుట్‌ అభివృద్ధి కోసం ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకం

కాలువలు కబ్జా

అధికార దర్పంతో అడ్డుగోలుగా పనులు

ధ్వంసమవుతున్న ప్రకృతి సంపద

పట్టించుకోని అధికారులు

కదిరి, డిసెంబరు 18: సామాన్యుడు ఎద్దుల బండి తో ఇసుక తోలుకున్నా కేసులు పెడుతున్న తరుణంలో ని బంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిలో టిప్పర్లతో వందలాది ట్రిప్పుల మట్టి తోలేస్తున్నా అధికారులు కళ్లు మూసుకున్నారు. వివరాలు ఇలా...గాండ్లపెంట మండలం కమ తంపల్లి పొలంలో సర్వే నెం 136లో దాదాపు 34.22 ఎకరాల ప్రయివేటు పట్టా భూమి ఉంది. దీన్ని ఇటీవలే కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలు చేశా రు. వెంటనే భూమిని చదును చేయడం మొదలు పెట్టా రు. ఇందుకు అవసరమైన మట్టిని పక్కనే గుట్ట వద్ద ఉన్న డీకేటీ భూమి నుంచి  టిప్పర్లతో వందలాది లోడ్లు తరలిస్తున్నారు. ఇందుకోసం మైనింగ్‌ అధికారుల అనుమ తి కూడా తీసుకోలేదు. కదిరి- రాయచోటి ప్రధాన రహదా రిలో వందలాది లోడ్లు మట్టి తోలుతుంటే అటువైపుగా వెళ్లే రెవెన్యూ, మండల, పోలీస్‌, ఇరిగేషన్‌ అధికార్లు ఏమాత్రం పట్టించుకోలేదు. కొంతమంది అధికార్లు నోరెత్తినా వారిని అధికార దర్పంతో నోరు మూసి వేసినట్టు సమాచారం. దీంతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల అడ్డుగోలు పనులకు అడ్డు అదుపులేకుండా పోయింది. నేలను చదును చేసే క్రమంలో పక్కన ఉన్న ప్రభుత్వ భూమితో పాటు దిగువ చెరువులకు నీళ్లు వెళ్లే కాలువలు, మోరీలను కూడా అక్రమించేశారు. వారిని అడ్డుకునే వారే కరువయ్యారు.


యఽథేచ్ఛగా మట్టి రవాణా 

సర్వే నెంబర్‌ 136లో ఉన్న 34.22 ఎకరాల భూమిలో లేఅవుట్‌ వేయడానికి భూమిని చదును చేస్తున్నారు. ఈ లేఅవుట్‌లో దాదాపు 1000 ప్లాట్‌లు వేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. దానికి సంబంధించిన బ్లూప్రిం ట్‌ కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం భూమి చదును చేసే పనిలో ఉన్నారు. దీనికి వందలాది లోడ్ల మట్టి తోలుతున్నారు. మట్టి తోలు కోవడానికి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అక్రమంగా మట్టితోలుతున్న వాహనాలను గాని, మట్టి తవ్వుతున్న వాహనాలనుగాని అధికార్లు పట్టించుకోలేదు. ఈ లేఅవుట్‌ వెనుక అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి అండ ఉన్నట్లు సమాచారం. దీంట్లో టీడీపీకి చెందిన ఓ నాయకుడు కూడా భాగస్వామిగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఇక్కడ జరుగుతున్న పనులకు ఏ అధికారి అడ్డురాకుండా అధికార పార్టీ నాయకుడు తన దర్పాన్ని ఉపయోగించినట్లు తెలిసింది. అందువల్లే ఏ అధికారిగాని పనులు ఆపడానికి ముందుకు రాలేదు.


మూడు అడుగులకు కుంచించుకుపోయిన మూ డు మీటర్ల కాలువ 

గాండ్లపెంట మండలంలోని కోటపల్లి చెరువు నిండితే దిగువ ఉన్న చెరువులకు నీళ్లు పోవడానికి ఈ లేఅవుట్‌లో ఒక కాలువ ఉంది. ప్రస్తుతం నేలను చదును చేస్తుండడం తో కాలువను కూడా పూడ్చివేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు కోటపల్లి చెరువు నిండి కాలువ లేకపోవడంతో ఈ లేఅవుట్‌ మీద పొంగిపొర్లాయి. దీంతో దిగువున ఉన్న వారు ఆందోళన చెందారు. ఈనేపథ్యంలో లేఅవుట్‌ వేస్తు న్న యజమానులు వెంటనే కాలువ పూడిక తీశారు. మూ డు మీటర్ల వెడెల్పు ఉన్న కాలువ మూడు అడుగులకు పరిమితం అయింది. మరో పక్క ఇదే లేఅవుట్‌లో ఉన్న మోరీని పూర్తిగా మూసివేశారు. దీంతో వర్షపు నీళ్లు కదిరి - రాయచోటి రహదారిపైనే ప్రవహించాయి. అయినా అర్‌ అండ్‌ బీ అధికారులు పట్టించుకోలేదు. అనుమతులు లేకుండా మట్టి తోలుతున్నా, సాగునీటి కాలువలు కబ్జా చేసినా, అర్‌అండ్‌బీ మోరీలు మూసి వేసి నా అడ్డుకునే అధికారులు కరువయ్యారు. దీని వెనుక వైసీపీ నాయకుడు ఉండడమే ఇందుకు కారణంగా కని పిస్తోంది. చిన్న పాటి పనులు అక్రమంగా చేస్తే కేసులు పెట్టే అధికారులు కనీసం ఈ భూమి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం, ప్రకృతి వనరులు ధ్వంసమవుతున్నా పట్టించుకోక పోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. 


- కమతంపల్లి పొలంలో భూమి చదును చేయడం, మట్టి తోలడంపై గాండ్లపెంట తహసీల్దార్‌ బీవీ రమణను వివర ణ కోరగా తాము మట్టి తోలడానికి ఎటువంటి అనుమ తులు ఇవ్వలేదన్నారు. ఆ భూమి పూర్తిగా ప్రయివేటు పట్టా అని తెలిపారు.

- సాగునీటి కాలువ కబ్జా చేయడంపై ఇరిగేషన్‌ డీఈ రమణ మాట్లాడుతూ కాలువ కబ్జా అయినట్లు తనకు తెలిసిందని, వారికి నోటీసులు ఇచ్చామని తెలిపారు.  అయితే కాలువకు ఇబ్బంది లేకుండా పనులు చేసుకోవాలని చెప్పినట్టు తెలిపారు. మరోసారి పరిశీలిస్తానని అన్నారు.

Read more