తిరగబెట్టిన అచ్చెన్న గాయం

ABN , First Publish Date - 2020-06-16T09:14:55+05:30 IST

రిమాండ్‌లో భాగంగా గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆపరేషన్‌ గాయం తిరగబెట్టినట్టు సమాచారం.

తిరగబెట్టిన అచ్చెన్న గాయం

ఆగని రక్తస్రావం

అరెస్టుతో సుదీర్ఘ ప్రయాణ అలసట,

విచారణ ఒత్తిడితో సమస్య తీవ్రతరం

కోలుకోడానికి 2వారాలైనా పట్టే వీలు

నోరువిప్పని జీజీహెచ్‌..కోర్టుకు రిపోర్టు!

విడుదల చేయండి: కోర్టులో పిటిషన్‌


గుంటూరు(సంగడిగుంట)/ విజయవాడ, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి) : రిమాండ్‌లో భాగంగా గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆపరేషన్‌ గాయం తిరగబెట్టినట్టు సమాచారం. ఇన్ఫెక్షన్‌ కావడంతో రక్తస్రావం ఆగడం లేదని తెలిసింది. అయితే, ఆయన జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నందువలన వైద్యులు ఈ విషయం అధికారికంగా ప్రకటించడం లేదు. కోర్టుకు మాత్రం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదిస్తున్నట్టు తెలిసింది. ఈఎ్‌సఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో ఏసీబీ అధికారులు అదుపులో తీసుకొనేనాటికి, అచ్చెన్న పైల్స్‌కు ఆపరేషన్‌ చేయించుకొని ఇంట్లో విశ్రాంతి తీసుకొంటున్నారు.


అరెస్టుకు ముందు రోజే ఈ ఆపరేషన్‌ జరిగింది. ఆ స్థితిలో అరెస్టు చేసి.. రోజంతా ఆయనను వాహనంలో తిప్పారు.  ఆ తరువాత  కోర్టు పేపర్‌ వర్క్స్‌ పేరిట మరికొన్ని గంటలు కూర్చోబెట్టడంతో ఆయన బాగా ఇబ్బందిపడ్డారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, పైల్స్‌ ఆపరేషన్‌ వలన కలిగిన పుండు నుంచి కారుతున్న రక్తం అదుపులోకి రావడం లేదు. ఆయనకు బీపీ, షుగర్‌ ఉండటం, దానికి ఇప్పుడు ఒత్తిడి కూడా తోడవడం సమస్యను మరింత పెంచింది. ఇలానే ఉంటే పుండు తగ్గడానికి మరో రెండు వారాల పైగానే పట్టవచ్చని సమాచారం. 


అచ్చెన్నకు బెయిల్‌ ఇవ్వండి...

తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అచ్చెన్నాయుడిని విడుదల చేయాలని కోరుతూ ఆయన తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విజయవాడ ఏసీబీ న్యాయస్థానానికి సోమవారం ఆన్‌లైన్‌లో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనితోపాటుగా అచ్చెన్నాయుడు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని మరో పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్లు హైకోర్టుకు వెళ్లిన తర్వాత నంబరు కేటాయిస్తారు. తిరిగి మళ్లీ ఏసీబీ కోర్టుకు ఈ పిటిషన్లు వస్తాయి. ఆ తర్వాత దీనిపై విచారణ మొదలవుతుంది. 

Updated Date - 2020-06-16T09:14:55+05:30 IST