Bookmark and Share


Bookmark and Share
Font Size: Decrease Font Size Increase Font Size

స్వయం పాలన కోసం సుదీర్ఘ ఆరాటం
- డాక్టర్ రమేశ్ చెన్నమనేని

1948 సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమోచన దినమా? లేక ఇండియన్ యూనియన్‌లో విలీన దినం మాత్రమేనా? ఈ రోజుకు మనం ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వాలి. సెప్టెంబర్ 17వ తేదీకి నేటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తో ఏమైనా ప్రాసంగికత ఉందా? ఈ విషయమై ఎన్నో వివాదాస్పదమైన ప్రశ్నలు, ప్రకటనలు వెలువడుతున్నాయి.

అయితే తెలంగాణ ప్రజల విముక్తిలో ఈ సెప్టెంబర్ 17 కీలక పాత్ర పోషించిందనే అభిప్రాయంపై దాదాపు ఏకాభిప్రాయం వ్యక్తమవడం అభినందనీయం. ఈ రోజు నేపథ్యాన్ని, ఆ తరువాత పరిణామాలను తెలుసుకోవడం నేటి రాజకీయ అవసరం. ఏ సామాజిక ఆర్థిక, రాజకీయ సమస్యలు హైదరాబాద్ విముక్తి కోసం తెలంగాణ ప్రజలను పురికొల్పాయి? ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తరువాత ఈ ఎజెండా ఏమైంది?

ఈ అసంపూర్తి ఎజెండాకు నేటి తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటానికి సంబంధం ఏమిటి? అనే అంశాలపై స్పష్టమైన అవగాహనకు రావలసి ఉంది. తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం, ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పోలీస్ యాక్షన్ నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ విముక్తికి దారి తీశాయని గుర్తించడం ప్రధానం.

తెలంగాణ సాయుధ పోరాటం సందర్భంగా విముక్తమైన మూడు వేల గ్రామాలలో ప్రధానమైన సామాజిక - ఆర్థిక ఎజెండా అమలైంది. పది లక్షల ఎకరాలు భూమి లేని పేదలకు పంచారు. వెట్టి చాకిరి నిర్మూలన జరిగింది. కనీస వేతనం అమలైంది. నీరు, అడవి వంటి ఉమ్మడి వనరులు పేదలకు అందుబాటులోకి వచ్చాయి. గ్రామ సమాజాల సమాన భాగస్వామ్యంతో ప్రజాస్వామ్య బద్ధంగా స్థానిక స్వపరిపాలన నెలకొన్నది.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం- అసంపూ ర్తి ఎజెండా: హైదరాబాద్ విముక్తి, ఇండియన్ యూనియన్‌లో విలీనం తరువాత తెలంగాణ ప్రజలకు రెండు ప్రధాన సమస్యలు ముందుకు వచ్చాయి. నిజాంను కూలదోసినప్పటికీ, భారత ప్రభు త్వం ఆయనను హైదరాబాద్ రాష్ట్రానికి రాజ్‌ప్రముఖ్‌గా నియమించింది. ఈ చర్య పాలక కులీనవర్గం నిర్ణయ ప్రకియపై రాజకీయంగా ప్రభావం చూపింది.

సుదీర్ఘ ప్రతిఘటన, సాయుధ పోరాటం వల్ల అనేక వేల మంది నాయకులు ఇంకా జైళ్ళలోనే మగ్గుతున్నారు. వారిపై కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోలేదు. దీని వల్ల పౌర ప్రభుత్వ నిర్వహణ సరిగా సాగలేదు. 1952 ఎన్నికల తరువాత హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి బూర్గుల రామకృష్ణారావు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు.

తిరుగుబాటు- పోలీస్ యాక్షన్ అనంతర కాలంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక జీవనం సుస్థిర పడే దశలో రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ వివాదం ముందుకు వచ్చింది. ఫజల్ అలీ కమిషన్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉండాలనే నివేదిక ఇచ్చింది. అయితే తెలంగాణ శక్తులు ఇంకా సుస్థిరపడనందువల్ల, కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్ర భావ న వల్ల, నెహ్రూ భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానం వల్ల, ఆంధ్రకు కొత్త రాజధాని కోసం అన్వేషణలో నీలం సంజీవరెడ్డి నిర్వహించిన పాత్ర వల్ల ఆంధ్రలో తెలంగాణను విలీనం చేయాలన్న శక్తులదిపై చేయి అయింది.

ఈ చరిత్రను పరిశీలిస్తే తెలంగాణ ప్రజలు, నాయకులు రాజకీయ అధికార స్థానాలలో లేరని స్పష్టమవుతుంది. నిజాం ఫ్యూడల్ పాలనలో కొద్ది మందితో కూడిన కులీన వర్గం భూమి, వనరులపై పట్టు కలిగి ఉండేది. 1948లో ఇండియన్ యూనియన్‌లో కలిసి, 1952లో మొదటి ఎన్నికల తరువాత ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అధికారానికి వచ్చారు.

ఈ ఎన్నికైన కులీన వర్గం తమ అధికారాన్ని సుస్థిరం చేసుకునేలోగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో హైదరాబాద్ రాష్ట్ర నాయకులకు గొంతు నులమడం క్రమపద్ధతిలో సాగింది. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి తెలంగా ణ చేతిలో అధికారం లేకుండా పోయింది.

పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన తరువాత ఐదు దశాబ్దాలలో తెలంగాణ ప్రాంతానికి అధికారం లేకుండా చేయడం పథకం ప్రకారం సాగింది. ఆంధ్రప్రదేశ్ మొద టి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి మొదలుకొని ఆంధ్ర నాయకత్వం తెలంగాణ నాయకులను అణచివేస్తూనే ఉన్నారు.రాజకీయాలలో నెలకొన్న ఈ అసమాన పోటీ వల్ల తెలంగాణ ప్రాంతం తీవ్రంగా నష్టపోయింది.

దీని వల్ల సంభవించిన పరిణామాలు- 1. రాజకీయాధికారం సీమాంధ్ర రాజకీయ కుటుంబాల వైపు మొగ్గింది. వ్యాపార ప్రయోజనాలు వారి రాజకీ య, ఆర్థిక ఎజెండాను తీర్చిదిద్దాయి. 2. తెలంగాణ తిరుగుబాటు, సాయుధ పోరాటం ముందుకు తెచ్చిన ఎజెండా అమలు చేయడానికి అవసరమైన పాల నా వ్యవస్థ ఏర్పడలేదు. 3. తెలంగాణ గొంతు నొక్కడంతో ఈ ప్రాంత శక్తులు సుస్థిరపడలేదు.

నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలు తమను తాము విముక్తి చేసుకొని తమదైన సామాజిక- ఆర్థిక రాజకీయ ఎజెండాను రూపొందించుకున్నప్పటికీ, ఆంధ్రతో విలీనం వల్ల అణచివేతకు గురై తమ ఆకాంక్షలను నెరవేర్చుకోలేక పోయారు. చరిత్రాత్మక తెలంగాణ పోరాటంలో, గత అరవై ఏళ్ళలో సాగిన ఇతర పోరాటాల్లో వెల్లడైన సామాజిక- ఆర్థిక రాజకీయ ఆకాంక్షలు ప్రస్తుత తెలంగాణ ఉద్యమంలో కనిపించడం ఆసక్తిదాయకం.

తెలంగాణలో ఆరు దశాబ్దాలకు పూర్వం ఫ్యూడల్ శక్తులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగి తనదైన ఆర్థిక, సామాజిక ఎజెండాను ముందుకు తెచ్చింది. ఐదు దశాబ్దాల కింద ఈ వామపక్ష శక్తులు భూ సంస్కరణల కోసం పోరాడాయి. నాలుగు దశాబ్దాల కింద విద్యార్థి ఉద్యమం ప్రత్యేక తెలంగాణ బావుటా ఎగురవేసింది. మూడు దశాబ్దాల కింద తెలంగాణ దేశంలోనే చెప్పుకోదగిన పౌర హక్కుల ఉద్యమానికి కేంద్ర బిందువైంది.

భూస్వామ్యానికి వ్యతిరేకంగా మార్క్సిస్టు లెనినిస్టు రైతు కూలీ ఉద్యమానికి వేదికైంది. ఎమర్జెన్సీ తరువాత 1970 దశకంలో మహిళా, దళిత, ఆదివాసీ ఉద్యమాలు సాగా యి. ఈ ఉద్యమాల లక్షణాలన్నీ మేళవించుకున్న నేటి తెలంగాణ ఉద్యమం విశిష్టతను సంతరించుకున్నది. ఈ భిన్న శక్తులు తెలంగాణ ఇవ్వాలని ముక్తకంఠంతో కోరడాన్ని బట్టి ఉద్యమం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.

గతంలో అసంపూర్తిగా మిగిలిన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక ఎజెండాను నవ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ఈ శక్తులు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత తెలంగాణ ఉద్యమానికి భవిష్యత్ ఎజెండా ను రూపుదిద్దుకునే సామాజిక, రాజకీయ స్పృహ ఉంది. తమ లక్ష్యానికి స్వీయ నిర్దేశనం చేసుకునే ధర్మబద్ధతను ప్రజల నుంచి పొందింది.

ఈ ప్రాంతంలోని భిన్న సామాజిక వర్గాల జీవితాల నుంచి పోరాటాల నుంచి తెలంగాణ ఎజెండా రూపొందింది. ఉద్యమం సంపూర్ణ ప్రాతినిధ్యాన్ని సంతరించుకోవడానికి ఉద్యమ నాయకత్వం ఈ భిన్న వర్గాల వాణిని వినిపించగలగాలి. ఆంధ్రకు చెందిన పాలక, వ్యాపార వర్గాలు తెలంగాణ వనరులను సొంతం చేసుకోవడం, ఆర్థిక పెత్తనం సాగించడం తెలంగాణ డిమాండ్ రావడానికి ప్రధాన కారణాలలో ఒకటి. ఆర్థిక అసమానతను, పెత్తందారీతనాన్ని వ్యతిరేకించడమే ప్రధానంగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అక్కడితో ఆగకుండా మరింత ముందడుగు వేసి ప్రజలందరికి వనరుల సమపంపిణీ జరిగే దిశగా మార్గ నిర్దేశం చేసుకోవాలి.

ఫ్యూడల్ వ్యవస్థకు, సాంస్కృతికాధిపత్యానికి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటం లక్ష్యాలలో మహి ళా విముక్తి కూడా ఒకటి. ఆరుట్ల కమలాదేవి, కట్కూరి సుశీల, మల్లు స్వరా జ్యం, చిట్యాల ఐలమ్మ ఇప్పటికీ ఈ పోరాటానికి ప్రతీకలు. అన్ని రకాల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ ఆదివాసీలు ప్రస్తుత ఉద్యమానికి ప్రధాన మద్దతుదారులుగా ఉన్నారు. భవిష్యత్ తెలంగాణ కొత్త ఎజెండాలో కొత్త దళిత ఎజెండా, ముస్లిం ధృక్కోణం కూడా భాగమే.

రాజకీయ ధర్మబద్ధత, స్వాభిమానం: కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు 1948 సెప్టెంబర్ 17ను గుర్తించడం రాజకీయ ధర్మబద్ధతను సూచిస్తుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఉత్స వం జరపకపోవడం తెలంగాణ ప్రజల కు ఆమోదయోగ్యంగా లేదు. ప్రభు త్వం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుని హైదరాబాద్ విముక్తి కోసం త్యాగాలు చేసిన ప్రజల పట్ల గౌరవం ప్రదర్శించాలి.

నిజాంకు వ్యతిరేకంగా పోరాడి , స్వతంత్ర భారతంలో హైదరాబాద్ విలీనానికి దోహదపడిన వారికి కనీసం పింఛన్లు ఇవ్వడం ద్వారా కనీస గౌరవాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రదర్శించ లేదు. 41 వేల మంది స్వాతంత్య్ర సమరయోధులు పింఛను కోసం కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే 4,300 మందికి మాత్రమే ఆమోదం లభించింది. ఇప్పటికీ బతికి ఉన్న సమరయోధు లు ఒక్కరొక్కరే కన్నుమూస్తున్నారు. ప్రభుత్వ నిరాసక్తత వల్ల నిరాశపడి, ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నియమించిన స్క్రీనింగ్‌కమిటీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

హోం మంత్రి చిదంబరం హామీ ఇచ్చినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయలేదు. దాదాపు మూడున్నర లక్షల మంది విద్యార్థులపై కేసులు పెట్టారు. దీని వల్ల విద్యార్థులకు ప్రజాస్వామ్య ప్రక్రియపై నమ్మకం సడలే అవకాశం ఉంది. తెలంగాణ రాదేమోననే ఆందోళనతో వందలాది మంది ఆత్మబలిదానాలకు పాల్పడడానికి కారణం, వారికి ప్రజాస్వామ్య, రాజకీయ వ్యవస్థల పట్ల విశ్వాసం తగ్గిపోవడమేనని సామాజిక వేత్తలు అంటున్న వాదనకు ప్రభుత్వ ధోరణి బలం చేకూరుస్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుర్తించాలి. తెలంగాణ ఏర్పాటు చేస్తామంటూ ఇచ్చిన హామీని అమలు పరచాలి.

- డాక్టర్ రమేశ్ చెన్నమనేని
(శాసన సభ్యులు )