అందమైన ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతం.. సుస్వాగతం..

పర్యాటక స్వర్గధామం ... ’ కృష్ణా ’

  • చారిత్రక, సాంస్కృతిక, పురావస్తు, ఆధ్మాత్మిక , పర్యాటక ప్రదేశాలెన్నో
  • విజయవాడ చుట్టూ పర్యాటకం కేంద్రీకృతం
  • కల్చరల్‌ విలేజ్‌గా .. కూచిపూడి
  • హ్యాండీక్రాఫ్ట్స్‌ విలేజ్‌లుగా కొండపల్లి, పెడన, మచిలీపట్నం
  • సువిశాల కృష్ణానదీ తీరం.. సహజసిద్ధ ద్వీప సోయగం
  • కొల్లేటి అందాలకు పర్యాటకుల ఫిదా
  • తీరం వెంబడి... ఆధ్మాత్మిక ఘుబాళింపులు
  • కళలు, కళాఖండాలకు పెట్టింది పేరు

చారిత్రక... సాంస్కృతిక... పురావస్తు.. ఆధ్యాత్మికతల మేళవింపుతో ’పర్యాటక స్వర్గధామం’గా కృష్ణాజిల్లా భాసిల్లుతోంది. కళల కాణాచి.. కళాఖండాల ఖిల్లా.. ప్రకృతి రమణీయతకు నెలవు.. పర్యాటకుల మనసులను దూదిపింజను చేసే అనుభూతుల సమాహారం కృష్ణాజిల్లా. జిల్లాలో ప్రధానమైన నగరం విజయవాడతో సహా నలుమూలలా విభిన్న పర్యాటక ప్రాంతాలు పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నాయి. పవిత్ర కృష్ణానది పరివాహక ప్రాంతం వెంబడి 8,727 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కృష్ణా జిల్లా విస్తరించి ఉంది. కృష్ణానది దేశంలోనే మూడవ అతి పెద్దదైన నది. మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో పుట్టి అక్కడి నుంచి పారుతూ కృష్ణాజిల్లాలో హంసలదీవి దగ్గర సముద్రంలో కలుస్తుంది. కృష్ణానది తీరం ఆధ్యాత్మిక క్షేత్రాలకు, సహజసిద్ధ పర్యాటక ప్రాంతాలకు నెలవు. ఒక పక్క కృష్ణానది, మరోవైపు కొండలు, కాలువలతో విస్తరించిన విజయవాడ నగరం పర్యాటకంగా వెలుగొందుతోంది. కృష్ణానదిలో సహజ సిద్ధంగా ఏర్పడిన భవానీ ఐల్యాండ్‌ , నాగాయలంక దీవులు పర్యాటకులకు స్వాగతం పలుకుతున్నాయి. చారిత్రక వైభవాన్ని చాటిచెప్పే కొండపల్లి కోట, గాంధీహిల్‌, విక్టోరియా మ్యూజియం, మచిలీపట్నం కోట వంటివి పర్యాటకులకు నాటి చారిత్రక వైభవాన్ని చాటి చెబుతాయి. కళలు, హస్త కళాఖండాలకు కృష్ణాజిల్లా పెట్టింది పేరు. కొండపల్లి బొమ్మలు, కలంకారీ వస్ర్తాలు, రోల్డ్‌గోల్డ్‌ ఆభరణాలకు ప్రసిద్ధి. తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చాటిన కూచిపూడి నృత్యంతో పాటు పులి వేషం , డప్పు నృత్యాలు జిల్లాకు ప్రత్యేకమైన కళలు. నోరూరించే బందరు లడ్డు, హల్వా వంటి స్వీట్లతో పాటు రాగండి, చందువా చేపల ఘుమఘుమలు జిల్లా ప్రత్యేక వంటకాలు. గ్రామీణ పర్యాటకం జిల్లాలో పరిఢవిల్లుతోంది. కృష్ణాజిల్లా పర్యాటక విశేషాలలోకి వెళితే... మరిన్ని విశేషాలు

విజయనగరం