కావలసినవి
మిగల పండిన జామపండ్లు (తొక్కతీయకుండా)- ఆరు, క్యాప్సికం - ఒక కప్పు (పెద్ద ముక్కలు), నూనె- రెండు టీస్పూన్లు, ఆవాలు- ఒక టీస్పూను, ఇంగువ-పావు టీస్పూను, పసుపు- అర టీస్పూను, టొమాటో ముక్కలు- ఒక కప్పు (పెద్ద ముక్కలు), ధనియాలపొడి- ఒక టేబుల్‌స్పూను, కారం- రెండు టీస్పూన్లు, ఆమ్చూర్ పొడి- ఒకటేబుల్ స్పూను, చక్కెర- రెండు టీస్పూన్లు, ఉప్పు-తగినంత, కూరపై చల్లడానికి- కొత్తిమీర తరుగు- రెండు టేబుల్‌స్పూన్లు.
తయారీ విధానం
జామపండ్లను పెద్ద ముక్కలుగా తరగాలి. జామపళ్ల మధ్యలో ఉండే గుజ్జు తీసి ఆ ముక్కలతో పాటు అరకప్పు నీళ్లు మిక్సీలో పోసి మెత్తటి పేస్టు చేయాలి. ఆ పేస్టును వడగట్టి గుజ్జును విడిగా తీయాలి. నాన్‌స్టిక్ పాన్‌లో నూనె వేసి చిన్నమంటపై ఆవాలను వేగించాలి. అందులోనే ఇంగువ, పసుపు, జామపండు ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి మూడు నిమిషాలు వేగించాలి. తర్వాత రెడీగా పెట్టుకున్న జామపండు గుజ్జు పేస్టు, టొమాటో ముక్కలు, ధనియాలపొడి, కారం, ఆమ్చూర్, చక్కెర, ఉప్పు, అరకప్పు నీళ్లు అందులో వేసి సన్నని మంటపై నాలుగు నిమిషాలు ఉడికించాలి. కూర అడుగంటకుండా మధ్య మధ్యలో కలపాలి. కూర చిక్కబడిన తర్వాత స్టవ్ మీద నుంచి దింపేయాలి. ఆలు,మేతి లేదా పచ్చి బటానీ- కేరట్లతో చేసిన పరాటాలతో తింటే రుచిగా ఉంటుంది.