ADVT
ఆ పిల్ల ఎదురొస్తే.. గుండెకాయ గోలెట్టేస్తది!
ఊర్లో చెరువు.. చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లిన రామలక్ష్మి. పక్కనే రాగి బక్కెట్టు, బిందె. చేస్తున్న పని మధ్యలో ఆపి ఎవరో పిలిస్తే పైకి లేచినట్టు నిలుచున్న రామలక్ష్మి. అది కూడా మామూలుగా కాదు... పైటను గట్టిగా నడుములో దోపి, ఓ కాలు బండమీద పెట్టి, పావడాను మోకాలి పైకెత్తి, కుడి మోకాలి మీద ఓ చెయ్యి, నడుం మీద ఎడమ చెయ్యి వేసుకుని దూరంగా చూస్తున్న ఆమె చూపులు ఆ ఊరి కుర్రాళ్ల గుండెకాయల్లో గోలెట్టించేస్తుంటాయి... చిట్టిబాబుకయితే మరీనూ.. ఆమె ఎదురుపడితే అతనికి పండగే. ఆమెకే కాదు.. ఆ ఊరికే 18 ఏళ్ల వయసొచ్చినట్టు సంబరపడిపోతాడు. ఇంతకీ ఎవరా రామలక్ష్మి. ఎవరా చిట్టిబాబు.. వీరిద్దరి మధ్య కథేంటి? అనేగా మీ ఆత్రుత. తెలుసుకోవాలంటే ‘రంగస్థలం’ సినిమా చూడాల్సిందే. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, మోహన్‌ నిర్మాతలు. దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రంలో సమంత పాత్రను పరిచయం చేసే టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ టీజర్‌లో సమంత తల నిండా నూనె పెట్టుకుని గట్టిగా జడ అల్లుకుని కనకాంబరాలు పెట్టుకుని కాసింత బిగుసుకుపోయి సైకిల్‌ నడుపుతూ, తలమీద చెరకు గడలు పెట్టుకుని నడుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘‘ఓహోహోహో... ఏం వయ్యారం ఏం వయ్యారం.. ఏ మాటకామాట సెప్పుకోవాలి కానీండి.. ఈ పిల్ల ఎదురొస్తుంటే మా ఊరికే పద్దెనిమిది సంవత్సరాల వయసొచ్చినట్టుంటుందండీ. ఈ సిట్టిగాడి గుండెకాయని గోలెట్టేసిందీ ఈ పిల్లేనండీ. పేరు.. రామలక్ష్మీ అండీ.. ఊరు.. ’’ అంటూ రామ్‌చరణ్‌ చెప్పిన వాయిస్‌ ఓవర్‌ వినిపిస్తుంది. ఆ వెంటనే ‘రంగా రంగా రంగస్థలానా... అంటూ గట్టిగా వినిపించే నేపథ్య సంగీతం మరింత స్పెషల్‌ అట్రాక్షన్‌గా ఉంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తయిన ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరి 13న తొలి పాటను విడుదల చేయనున్నారు.

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.