పరిశ్రమల స్ధాపనలో మనమే ఫస్ట్

Published at: 21-11-2013 00:22 AM

73 మెగా ప్రాజెక్టులతో 1.5 కోట్ల మందికి ఉపాధి
దుగరాజపట్నం ఓడ రేవుకు త్వరలో ప్రధాని శంకుస్ధాపన
శ్రీసిటిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి వెల్లడి

శ్రీకాళహస్తి (ఆంధ్రజ్యోతి) : పరిశ్రమల స్థాపనలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ది ప్రథమ స్థానమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో ఇటలీకి చెందిన స్టీల్ పరిశ్రమ డేనిలీ 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. శ్రీసిటీ ప్రగతి వేడుకల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 1.35 లక్షల కోట్ల రూపాయల విలువైన 73 మెగా ప్రాజెక్టులకు అనుమతులు మం జూరు చేసినట్లు చెప్పారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 1.5 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. పరిశ్రమల స్థాపనలో శ్రీసిటీ సెజ్‌కు దేశ స్థాయిలో ప్రథమ బహుమతి రావటం సంతోషాన్నిస్తోందని అన్నారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయటానికి దుగరాజపట్నంలో ఓడరేవును నిర్మించటానికి కేంద్రం సన్నాహాలు చేస్తోందని చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్ త్వరలో ఈ ఓడ రేవుకు శంకుస్థాపన చేయనున్నారని ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే చిత్తూరు, ప్రకాశం, మెదక్ జిల్లాల్లో మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ క్లస్టర్ల ఏర్పాటు ద్వారా పారిశ్రామికాభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుందని అన్నారు. శ్రీసిటీలో ఉత్పత్తి ప్రారంభించిన 13 పరిశ్రమలను, నిర్మాణ దశలో ఉన్న 15 పరిశ్రమలను... మొత్తం 28 పరిశ్రమలను ఆయన లాంఛనంగా జాతికి అంకితం చేశారు.
శ్రీసిటీలో ట్రిపుల్ ఐటి..
అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న శ్రీసిటీలో ట్రిపుల్ ఐటిని ఏర్పా టు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. గతంలో అనివార్య పరిస్థితుల కారణంగా పారిశ్రామిక రంగానికి విద్యుత్ సరఫరా సక్రమంగా చేయలేకపోయామని అయితే ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. శ్రీసిటీ సెజ్‌కు పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి రావటం సంతోషాన్ని కలిగిస్తోందని, అయితే ఈ పరిశ్రమల్లో స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. స్థానికులకు ఉపాధి కల్పించేందుకు అవసరమైతే చట్ట సవరణను చేస్తామని ముఖ్యమంత్రి హామీనిచ్చారు.
స్థానికులకు ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించడంతోనే నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీసిటీ యాజమాన్యం స్థానిక పాఠశాలలను దత్తత తీసుకోవాలని సూచించారు. శ్రీకాళహస్తి సమీపంలోని మన్నవరం వద్ద బిహెచ్ఇఎల్ నిర్మిస్తున్న విద్యుత్ ఉపకరణాల తయారీ ప్రాజెక్టు పనుల మందగమనంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఈ పనులు వేగవంతం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు.

విత్తలోటుపై అరుణ్‌జైట్లీ

ముంబై: విత్తలోటును ఈ ఆర్థిక సంవత్సరంలో జిడిపిలో 4.1 శాతానికి తగ్గించే విషయంలో తనకు...

ఈ ఏడాదే బ్రేక్‌ ఈవెన్‌ ఎయిర్‌ కోస్టా సిఎఫ్‌ఒ వెల్లడి

ముంబై : ఈ ఆర్థిక సంవత్సరంలోనే బ్రేక్‌ ఈవెన్‌ (లాభ నష్టాలు లేని స్థాయి)ను సాధించాలని...

Today's e-Paper