కొత్తగా వెల్ల వేసిన డాబా పిట్టగోడ మీద వెల్లకిలా పడుకుని ఆకాశాన్ని నిరాటంకంగా అనుభూతి చెందుతున్నాను... ప్రతి రెండు నక్షత్రాల మధ్య దూరాన్ని లెక్క కట్టుకుంటూ. 'అక్కా! ఇదే నెల?' నా చెల్లెలు. ఇదెప్పుడొచ్చిందో పైకి.
'వెన్నెల' తన్మయంగా చెప్పాను.
'ఒసే...య్.. ఇక్కణ్నుంచి తోసేస్తాన్నిన్ను. తెలుగు నెలల్లో ఇదే నెలా అని?'
'అబ్బా! ఏమిటే నీ గోల? కార్తీకం. అసలిక్కడికెందుకొచ్చావ్?' ఇది అన్నంత పనీ చెయ్యగలదు. జాగ్రత్తగా పిట్టగోడ దిగి డాబా మెట్ల మీద కూర్చోబోతుంటే విరగబడి నవ్వుతోంది ఎందుకో. 'ఏవిటే వెర్రి నవ్వూ నువ్వూనూ?'
'ఏం లేదు. నీ బట్టల్నిండా వెన్నెల...'
అబ్బా. సున్నం అంటింది. అవును, వెన్నెల పిండారబోసినట్టుంది అంటాం కదా, సున్నమేసినట్టుంది అని కూడా అనొచ్చు ఇకనుంచి. నా అద్భుతమైన ఆలోచనని పంచుకుందామంటే 'అక్కా, శనగపిండి తెల్లగా ఉండదు కాబట్టి బియ్యప్పిండి అనుకుందాం. అయినా అసలు పిండి ఎందుకారబోస్తాం? పురుగు పడితే కదా. మరి వెన్నెలకి పురుగు పట్టినట్టా?' అని గతంలో ఒకసారి మా చెల్లి నాకు విరక్తి తెప్పించిన విషయం గుర్తొచ్చి ఊరుకున్నా.
'మరయితే శరదృతువన్న మాట!' వదలకుండా పక్కన వచ్చి కూచుంది. ఫర్లేదే, దీనికీ కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. 'ఊ. బావుంటుంది కదా. నాకు భలే ఇష్టం వెన్నెలంటే.'
'అబ్బ ఛా. ఎవరికుండదు ఇష్టం? నీకు ఉండటం ఏదో గొప్పయినట్టు...'
ఒక్కమాట సవ్యంగా రాదు దీని దగ్గరనుంచి. ఏదో కాసేపు ఆనందపడనివ్వొచ్చుగా. 'నువ్వు పక్కనుంటే ఆ ఇష్టం కాస్తా కష్టమవుతుందే.. నే కిందకెళుతున్నా. ఒక్కదానివే ఊరేగు..' ఒక దణ్ణం పెట్టి తులసికోట దగ్గర ప్రమిదలో నూనె పొయ్యడానికెళ్లిపోయా.
పంచవర్ష ప్రణాళికలని పెద్ద గొప్పగా చెబుతారెందుకు? ఐదు వసంతాలనీ సంవత్సరాలనీ లెక్కపెట్టే బదులు పది వెన్నెల మాసాలనుకోవడం మనసుకి చల్లగా ఉంటుంది కదా. కింద ఇంట్లో సన్నాయి మేళం. పెరట్లో వెన్నెల పందిరి కింద పెళ్లి మండపం. మళ్లీ కొత్త సున్నాలు వెలవెలబోయేలా కొత్త పెళ్లికూతురి తలంబ్రాల చీరలాంటి స్వచ్ఛమైన తెల్లటి వెన్నెల... సిగ్గుల మొగ్గలారబోసుకున్నట్టు.
'ఏమ్మా, కనిపించిందా అరుంధతి?'
పురోహితుడు నా సమాధానం వస్తే పని కానిచ్చి వెళ్లొచ్చని తొందరపడుతున్నాడు. కొత్త చేతిలో ఇమిడిపోయిన చిటికెన వేలు సన్నగా వణుకుతోంది. మరి కొంగుముడి కూడా కంపిస్తుందేమో తెలీదు. 'కనపడినట్టే ఉంద'ని తల ఊపితే కిందకు రాలిన పసుపు రవ్వల్లాంటి త లంబ్రాల వెన్నెల.
'వెళ్లొస్తానమ్మా!'
అప్పగింతలయ్యాక కారెక్కుతూ ఎవర్ని ఉద్దేశించి అన్నానో కూడా చెప్పలేను. ఇంజన్ స్టార్ట్ అయి కదలబోతుంటే మనసాగక అద్దం దించి మళ్లీ ఓసారి చెయ్యూపుతుంటే తిరిగి ఊపుతున్నవాళ్లలో చెల్లి కనపడలేదు.
'అదెక్కడమ్మా?' నా ప్రశ్న హడావుడిలో ఎవరికీ వినపడనట్టుంది. అనుమానమేసి పైకి చూస్తే డాబా పిట్టగోడ మీద అటుతిరిగి కూర్చుని వెక్కివెక్కి ఏడుస్తోంది వెర్రిగా పిచ్చి తల్లి. ఉన్నట్టుండి నా కళ్లనిండా ఆత్మీయపు కన్నీటి వెన్నెల.
- స్వాతికుమారి
swathikumari.wordpress.com