DISCLAIMER
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక వ్యవస్థలున్న దేశాలలో అగ్రస్థానం మనదే. తమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే పరిపాలకులుగా వ్యవహరించే ఈ అత్యుత్తమ వ్యవస్థలో అత్యంత ముఖ్య ఘట్టం ఎన్నికలు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి వరకూ జరిగే ఈ ఎన్నికలు అడుగడుగునా ప్రజల మనోభావాలనే ప్రతిబింబిస్తాయి. మెరుగైన పాలన, ప్రజల ప్రయోజనాలే తమ లక్ష్యమని చెప్పుకుంటూ ఏర్పాటైన ఎన్నో రాజకీయపార్టీలు ఈ ఎన్నికల్లో పోటీ కోసం తమ అభ్యర్థులను బరిలోకి దించుతాయి. అయితే, వందలు, వేల సంఖ్యలో ఉన్న ఈ అభ్యర్థులలో కొందరిని తమ ప్రతినిధులుగా ఎన్నుకునే క్రమంలో... ఆ అభ్యర్థుల వ్యక్తిగత, సామాజిక నేపథ్యం ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. గతంతో పోల్చి చూస్తే ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల సంఖ్య, అభ్యర్థుల సంఖ్య ఊహించనంతగా పెరిగిపోయింది. అదే సమయంలో ఓటర్లను డబ్బు, మద్యం, కానుకలతో మభ్యపెట్టే నేరపూరిత రాజకీయాలు కూడా పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోవడం సవాల్‌గా మారుతోంది. ఆయా స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల నేపథ్యం... వారు పోటీలో ఉన్న నియోజకవర్గాల్లోని స్థితిగతులు... స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఆ అభ్యర్థులు వ్యవహరించగలరా? అనేవి తెలుసుకున్నప్పుడే ఓటర్లు తమకు తగిన అభ్యర్థిని ఎన్నుకోగలుగుతారు. ఈ ప్రక్రియలో ఓటర్లకు తోడ్పాటునందించేందుకు ఈ 'ప్రజాతంత్రం'తో డిజిటల్ రూపంలో మీ ముందుకు వచ్చింది ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.

అటు పార్లమెంట్‌, ఇటు తెలుగు రాష్ట్రాల శాసనసభలు ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టేశాయి. అందులో తెలంగాణ రాష్ట్రం ఒకడుగు ముందుకేసింది. ఎన్నికల్లో పోటీకి, ఎన్నికల నిర్వహణకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఎన్నికల సంఘం నుంచి కసరత్తు ప్రారంభమైంది. అయితే, అన్నిటికన్నా కీలకమైనది ఓటు హక్కును ఉపయోగించుకునే ఓటరు నిర్ణయం... మన ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టంగా నిలిపేది ఈ నిర్ణయమే. ఈ నిర్ణయం తీసుకోవడంలో ఓటరుకు సహకరించడమే ఈ ప్రజాతంత్రం ముఖ్య లక్ష్యం. తమ అభ్యర్థులు, నియోజకవర్గాలపై ఓటర్లకు సంపూర్ణ అవగాహన కల్పించడం కోసం చట్టసభల్లో ఆయా ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలల్లోని పరిస్థితులు, ప్రజాప్రతినిధుల పనితీరు, వారి గెలుపోటములను ప్రభావితం చేసే అంశాలు, గత ఓటింగ్‌కు సంబంధించిన గణాంకాల పట్టికలు, మరికొన్ని ముఖ్యమైన వివరాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఈ సమాచార సేకరణ కోసం ఎన్నో విభాగాలు నెలకొల్పి, ఎందరో సిబ్బందిని వినియోగించాము. సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఈ ప్రక్రియలో లోపాలకు ఆస్కారం లేకుండా సమాచారాన్ని మీకు చిత్తశుద్ధితో అందించాము. అయినప్పటికీ ఎంతో విస్తృతమైన ఈ సమాచారంలో ఎక్కడైనా మీరు దోషాలను గుర్తించినట్లయితే వాటిని సరిచేసేందుకు మేం సిద్ధం. prajatantram@andhrajyothy.com మెయిల్ ద్వారా వాటిని మాదృష్టికి తీసుకురావలసిందిగా కోరుతున్నాము. మీరు పంపిన అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలించి ఈ ఎన్నికల సమాచారాన్ని మరింత సమగ్రంగా అందించేందుకు సర్వదా సిద్ధంగా ఉన్నాము.