నియోజకవర్గం : అసెంబ్లీ

కొత్తగూడెం

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
ఖమ్మం
మొత్తం ఓటర్లు :
205523
పురుషులు :
100801
స్త్రీలు :
104683
ప్రస్తుత ఎమ్మెల్యే :
వనమా వేంకటేశ్వర రావు
ప్రస్తుత ఎంపీ :
పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు :205523
పురుషులు :100801
స్త్రీలు :104683
ఇతరులు :39

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌ : జనరల్‌
నియోజకర్గంలో ఏ ఏ మండలాలులన్నాయి:
కొత్తగూడెం పట్టణం, కొత్తగూడెం మండలం, పాల్వంచ పట్టణం, పాల్వంచ మండలం, లక్ష్మిదేవిపల్లి, ,చుంచుపల్లి, సుజాతనగర్‌.
ఏ లోకసభ నియోజకవర్గంలో ఉంది: ఖమ్మం 
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 వనమా వెంకటేశ్వర రావు కాంగ్రెస్ జలగం వెంకట్రావ్ టీఆర్‌ఎస్ 4120
2014 జలగం వెంకటరావు టీఆర్‌ఎస్‌ వనమా వెంకటేశ్వరరావు వైఎస్‌ఆర్‌సీపీ 16521
2009 కూనంనేని సాంబశివరావు సీపీఐ వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ 2004
2004 వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ కోనేరు నాగేశ్వరరావు టీడీపీ 27772
1999 వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ అయాచితం నాగవాణి టీడీపీ 16714
1994 కోనేరు నాగేశ్వరరావు టీడీపీ వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ 20987
1989 వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌ కోనేరు నాగేశ్వరరావు టీడీపీ 247
1985 కోనేరు నాగేశ్వరరావు టీడీపీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ 10166
1983 కోనేరు నాగేశ్వరరావు స్వంతంత్ర చేకూరి కాశయ్య కాంగ్రెస్ 8885
1978 చేకూరి కాశయ్య జనతా వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ 10648

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

కొత్తగూడెం పట్టణానికి ప్రముఖ శస్త్ర వైద్యనిపుణులు, బాలోత్సవ్‌ కన్వీనర్‌ డాక్టర్‌ వాసిరెడ్డి రమేష్‌బాబు. 25 సంవత్సరాలపాటు కొత్తగూడెం పట్టణంలో మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో బాలోత్సవ్‌ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి విద్యార్థులు, తల్లిదండ్రులను ప్రజల మెప్పులను పొందారు. ప్రస్తుతం ఆయన కొత్తగూడెం పట్టణంలో ప్రముఖ వైద్య నిపుణులుగా సేవలందిస్తున్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తూ సేవలందించారు. రాజకీయాలకతీతంగా ఉంటూ ప్రజలతో ఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.
 
 కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రముఖ వివేకవర్ధని విద్యా సంస్థల అధిపతి లయన్‌ ఎంవీ. చౌదరి పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు తక్కువ ఫీజుతో సహాయ సహకారాలు అందజేస్తున్నారు. గత 30 ఏళ్ల నుంచి విద్యాసంస్థలు నెలకొల్పి ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు చదువులు చదివేందుకు ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి అవకాశం కల్పించారు. ప్రస్తుతం లయన్స్‌ క్లబ్‌ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్నారు.
 
 
ప్రముఖ వైద్యనిపుణులు ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ విజేందర్‌రావు. రోటరీ క్లబ్‌ గవర్నర్‌గా పనిచేసి విశిష్ట సేవలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కొత్తగూడెంలో ఆర్థోపెడిక్‌ డాక్టర్‌గా పలువురికి వైద్య సేవలందిస్తున్నారు. కొత్తగూడెంలోని రైటర్‌ బస్తీలో లింబ్‌ సెంటర్‌ను ప్రారంభించి ఎందరో వికలాంగులకు, అభాగ్యులకు కృత్రిమ అవయవాలను తయారుచేసి అందజేస్తున్నారు. ట్రై సైకిళ్లను కూడా అందజేసి పలువురి మన్ననలు పొందారు. ఇతను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తున్నారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రభుత్వరంగ సంస్థలైన సింగరేణి, కేటీపీఎస్‌, ఎన్‌ఎండీసీలు ఉన్నాయి. సింగరేణి సంస్థ ప్రధాన కార్యాలయం కొత్తగూడెం పట్టణంలో సింగరేణి పరిపాలన కోసం ఏర్పాటు చేశారు. కొత్తగూడెం ఏరియాలో రుద్రంపూర్‌ ప్రాంతంలో జీకేఓసీ ప్రాజెక్ట్‌తోపాటు 7, 5వ ఇంక్లైన్‌లు భూగర్భ గనులు పనిచేస్తున్నాయి. దీని కింద రోజుకు 20వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి లభిస్తోంది.
 
సింగరేణి ప్రధాన కార్యాలయం ఉండటం వల్ల సింగరేణి డైరెక్టర్లు, సీజీఎం, జీఎంలు, ప్రధాన కార్యాలయం నుంచే పరిపాలన చేస్తుంటారు. సింగరేణి అతిథి గృహం కూడా డైరెక్టర్ల నివాసయోగ్యమైన క్వార్టర్లు ఉండటం వల్ల నెలకోసారి సమీక్ష సమావేశాలు జరుగుతుంటాయి. అదేవిధంగా కేటీపీఎస్‌ కర్మాగారం తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద కర్మాగారం. ప్రస్తుతం ఈ కర్మాగారాలను ఆరు స్టేజీల్లో విద్యుత్‌ ఉత్పత్తిచేస్తుంది. రోజుకు 1720మెగా వాట్లు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుంది.
 
ఇతర రాష్ట్రాల్లోని సిమెంట్‌ ఫ్యాక్టరీలతోపాటు ఇతర సంస్థలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. 7వ దశ నిర్మాణం వేగవంతంగా కొనసాగుతుంది. త్వరలో దీని నిర్మాణం పూర్తయి 800 మెగావాట్ల విద్యుత్‌ చేపట్టేందుకు కూడా ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. కేటీపీఎస్‌లో నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. ఈ ప్రాంతంలో చదువుకున్న వ్యక్తులకు ఉద్యోగావకాశాలు కూడా అందజేసింది. పాల్వంచలో స్పాంజ్‌ ఐరన్‌ ఉత్తర భారత దేశంలోనే తొలి ఉక్కు కర్మాగారంగా నెలకొంది. మొదట్లో లాభాల బాటలో కొనసాగిన ఈ కర్మాగారం వ్యాపార పోటీని తట్టుకోలేక నష్టాల బారీన పడింది.
 
అనంతరం 2010లో స్పాంజ్‌ ఐరన్‌ను నవరత్న కంపెనీ ఎన్‌ఎండీసీలో విలీనం చేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎండీసీ స్పాంజ్‌ ఐరన్‌ యూనిట్‌ను అభివృద్ధి చేసే దిశలో ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఈ కర్మాగారం అభివృద్ధి చెందితే స్థానిక నిరుద్యోగ, యువతీ, యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
తొలుత కిన్నెరసాని ప్రాజెక్ట్‌ను విద్యుత్‌ ఉత్పత్తి కోసమే నిర్మించారు. అనంతరం 10వేల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్ట్‌గా రూపొందించారు.
 
కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల ప్రజలకు దాహార్తి తీర్చేందుకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. సుజాతనగర్‌ మండలంలో సింగభూపాలెం ప్రాజెక్ట్‌ ద్వారా రైతులకు 4వేల ఎకరాలకు సాగునీరందిస్తుంది. దీనికి రూ.30కోట్లు ఇప్పటికే మరమ్మతులు ప్రారంభించారు. రానున్న సీజన్‌లో ఈ ప్రాజెక్ట్‌ కింద రెండు పంటలు పండించేందుకు ఎమ్మెల్యే జలగం కృషి చేస్తున్నారు. పాల్వంచలో రాళ్లవాగు ప్రాజెక్ట్‌, ఎర్రసాని చెరువుల మరమ్మతులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేసింది.

అభివృద్ధి ప‌థ‌కాలు

కొత్తగూడెం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే జలగం వెంకటరావు శ్రీకారం చుట్టారు. మిషన్‌ కాకతీయ పనుల కింద చెరువుల మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. కిన్నెరసాని మంచినీటి పథకానికి కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలకు ప్రత్యామ్నాయంగా పనులు చేపట్టారు. నియోజకవర్గంలో ఆయా మండలాల్లో, పట్టణాల్లో రహదారుల విస్తరణ పనులు జరుగుతున్నాయి.
 
జాతీయ రహదారుల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్ట్‌తోపాటు సింగభూపాలెం ప్రాజెక్ట్‌ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్‌ రోడ్డులో పర్యాటక హోటల్‌ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. రైతుల కోసం కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కేంద్రం కావడంతో సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయాల నిర్మాణాలు జరుగుతున్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
 
ఐఆర్‌ బెటాలియన్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వానికి సైతం ప్రతిపాదనలు వెళ్లాయి. మైనింగ్‌ యూనివర్శిటీ మంజూరు కోసం ప్రతిపాదనలు పంపించారు. పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలోని పలు రోడ్ల అభివృద్ధికి కోట్లాది రూపాయలు నిధులు కేటాయించారు. కొత్తగూడెంలో 250 ఎకరాల ఫారెస్ట్‌ సెంట్రల్‌ పార్క్‌ నిర్మాణం జరిగి ప్రారంభం కూడా చేశారు. పాత కొత్తగూడెంలో కేజీ నుంచి పీజీ ఉచిత ఇంగ్లీషు మీడియం పాఠశాలను నెలకొల్పారు. మొత్తం మీద అభివృద్ధిలో నియోజకవర్గం అన్ని రంగాల్లో పోటీ పడుతున్నట్టు చెప్పవచ్చు.

పెండింగ్ ప్రాజెక్టులు

కొత్తగూడెం నియోజకవర్గంలో మైలారం ప్రాంతంలో రాగి గనుల పునరుద్ధరణ జరగలేదు. విమానాశ్రయానికి ప్రతిపాదనలకే పరిమితమైంది. మైనింగ్‌ యూనివర్శిటీ మంజూరు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. కిన్నెరసాని 10వేల ఎకరాల సాగుకు కాల్వలు పూర్తిస్థాయిలో జరగలేదు. కిన్నెరసాని పర్యాటక అభివృద్ధి పనులు నత్తనడకన జరుగుతున్నాయి.
 
ప్రస్తుతం జాతీయ రహదారి నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం పనులు పునాదులకే పరిమితమయ్యాయి. ఈ సమస్యలన్నింటిని పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ఆయా అధికారులతో ఎప్పటికపుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. వాటన్నింటినీ త్వరలోపూర్తి చేస్తామని హామీలిస్తున్నారు.

ముఖ్య ప్రాంతాలు

కొత్తగూడెం నియోజకవర్గంలో హేమచంద్రాపురంలోని కారుకొండ రామవరంలోని బౌద్ధ స్తూపాలకు సంబంధించిన చారిత్రాత్మక చిహ్నాలు ఉన్నాయి. పాల్వంచలోని శ్రీనివాస కాలనీలో వెంకటేశ్వరస్వామి దేవాలయం, బంగారుజాలలోని దేవాలయాలు, పాత పాల్వంచలోని గడియకట్ట చారిత్రాత్మక కట్టడాలున్నాయి. పర్యాటక కేంద్రాలైన కిన్నెరసాని దినదినాభివృద్ధి చెందుతోంది. బోట్‌ షికారు, కాటేజీల నిర్మాణం చేపడుతున్నారు. పర్యాటకులను మరింత ఆకర్శించేందుకు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు.
 
పాల్వంచలో నవభారత్‌ ఫెర్రో ఎల్లాయిస్‌, నవభారత్‌ విద్యుత్‌ కర్మాగారంలో ఎందరో యువతీ, యువకులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. సీఎస్‌ఆర్‌ పాలసీ కింద ఉచిత శిక్షణ కేంద్రాలు ఏర్పాటుచేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు.

ఇతర ముఖ్యాంశాలు

నియోజకవర్గం పారిశ్రామిక కేంద్రంగా విరాజిల్లుతుంది. పాల్వంచ - కొత్తగూడెం జంట పట్టణాలుగా విరాజిల్లే అవకాశముంది. రాష్ట్రానికే విద్యుత్‌ వెలుగులు ప్రసరించే కేటీపీఎస్‌ కర్మాగారం. రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గం కావడంతోపాటు విప్లవ పార్టీలకు పట్టుకొమ్మలా ఉంది. కొత్త అభ్యర్థులకు పార్లమెంట్‌, అసెంబ్లీలకు పంపించిన ఘనత కొత్తగూడెం నియోజకవర్గానికి ఉంది.

వీడియోస్

ADVT