నియోజకవర్గం : అసెంబ్లీ

పెద్దపల్లి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
కరీంనగర్
మొత్తం ఓటర్లు :
218289
పురుషులు :
109669
స్త్రీలు :
108599
ప్రస్తుత ఎమ్మెల్యే :
దాసరి మనోహర్‌ రెడ్డి
ప్రస్తుత ఎంపీ :

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,18,289
పురుషులు: 1,09,669
స్త్రీలు: 1,08,599
ఇతరులు: 21
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: నియోజకవర్గంలో హిందువులు 90 శాతం మంది ఉన్నారు. బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు గెలుపోటములను ప్రభావితం చేస్తారు. నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరగగా, 1994లో తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ వర్గానికి చెందిన బిరుదు రాజమల్లు గెలుపొందారు. ఇక్కడి నుంచి ఆయా పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే టిక్కెట్లు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలో గల మండలాలు: పెద్దపల్లి, సుల్తానాబాద్‌, ఎలిగేడు, జూలపల్లి, ఓదెల, కాల్వశ్రీరాంపూర్‌
ఏ లోక్‌సభ పరిధిలో ఉంది: పెద్దపల్లి 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 దాసరి మనోహర్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌ విజయరమణారావు కాంగ్రెస్‌ 8466
2014 దాసరి మనోహర్‌ రెడ్డి టిఆర్‌ఎస్‌ టి భానుప్రసాద రావు కాంగ్రెస్‌ 62677
2009 సీహెచ్‌ విజయ రమణారావు టీడీపీ గీట్ల ముకుందరెడ్డి కాంగ్రెస్‌ 40837
2004 గీట్ల ముకుంద రెడ్డి టిఆర్‌ఎస్‌ బిరుదు రాజమల్లు జనతా 35933
1999 గుజ్జుల రామకృష్ణారెడ్డి బీజేపీ గీట్ల ముకుంద రెడ్డి కాంగ్రెస్‌ 45986
1994 బిరుదు రాజమల్లు టీడీపీ గీట్ల ముకుందరెడ్డి కాంగ్రెస్‌ 29933
1989 గీట్ల ముకుందరెడ్డి కాంగ్రెస్‌ బిరుదు రాజమల్లు టీడీపీ 44825
1985 కల్వ రాంచంద్రా రెడ్డి టీడీపీ గీట్ల ముకుందరెడ్డి కాంగ్రెస్‌ 18501
1983 గీట్ల ముకుంద రెడ్డి (ఉ.ఎ కాంగ్రెస్‌ వి రమణయ్య టిడిపి 19908

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

ఈ నియోజకవర్గం నుంచి ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన ఐఏఎస్‌ అధికారి వెంకట్రామిరెడ్డి సిద్ధిపేట జిల్లా కలెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆయన తన స్వగ్రామంలో ప్రత్యేకించి 100కు పైగా డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్లను సైతం మంజూరు చేయించుకున్నారు. అలాగే ప్రముఖ సినీ డైరెక్టర్‌ సంపత్‌ నంది ఇదే మండలానికి చెందినవారు. పలు హిట్‌ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించగా, సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్‌ డైరెక్టర్లలో ఆయన ఒకరుగా ఉండడం విశేషం.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఈ నియోజవర్గంలో ప్రాజెక్టులు ఏమీ లేకపోయినా మానేరు నదిపై మూడు చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలను చేపడుతున్నారు. రైస్‌ ఇండస్ట్రీ ఉన్నది. మిర్యాలగూడ తర్వాత అత్యధిక రైసుమిల్లులు 200కు పైగా ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గంలో మిషన్‌ కాకతీయ పథకం కింద చెరువుల అభివృద్ధి, మిషన్‌ భగీరథ పనులు, మానేరు వాగుపై చెక్‌ డ్యామ్‌ల నిర్మాణాలు, పెద్దపల్లి జిల్లా కేంద్రం కావడంతో సుమారు 39 కోట్లతో జిల్లా కలెక్టరేట్‌ సముదాయం, రోడ్లు, చిన్న చిన్న వంతెనలు, మినీ ట్యాంకు బండ్‌ నిర్మాణాలు జరుగుతున్నాయి. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు 3 కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పెద్దపల్లి పట్టణ అభివృద్ధి కోసం 25 కోట్లు మంజూరు కాగా ఆ పనులను చేపట్టాల్సి ఉన్నది. పెద్దపల్లి, సుల్తానాబాదుల్లో విద్యుత్తు టవర్ల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గ కేంద్రమైన పెద్దపల్లిలో ఆర్‌టీసీ బస్సు డిపో ఏర్పాటు చేయాలని గత కొంత కాలంగా ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. దీనికి అడుగు ముందుకు పడడం లేదు. జిల్లా కేంద్రం కావడంతో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాల్సి ఉన్నది. కూనారం రహదారిలో రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నా ఆ పని కావడం లేదు. పట్టణంలోని పలు వీధుల్లో 30 ఏళ్ల క్రితం నిర్మించిన మురికి కాలువలు ఉన్నాయి. అవి శిథిలావస్థకు చేరడంతో పారిశుధ్య సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సీసీ రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడం గమనార్హం. 16 సంవత్సరాల క్రితమే ఎలిగేడు మండలంగా ఏర్పాటైనా ఇంతవరకు పోలీసు స్టేషన్‌ ఏర్పాటు కాలేదు. ప్రభుత్వ కార్యాలయాలు లేవు. ధూళికట్టలో గల చారిత్ర బౌద్ధ స్థూపం అభివృద్ధికి నోచుకోవడం లేదు.

ముఖ్య ప్రాంతాలు

నియోజకవర్గంలో ధూలికట్ట బౌద్ధ స్థూపం చారిత్రక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఓదెల మండల కేంద్రంలో శ్రీమల్లికార్జున స్వామి దేవస్థానం ఉంది. ఈ ఆలయానికి నిత్యం భక్తులు వస్తుంటారు.

ఇతర ముఖ్యాంశాలు

నియోజకవర్గం పారిశ్రామిక, వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందుతున్నది. ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వరి పంట పండిస్తున్నందు వల్లనే ఇక్కడ 200కు పైగా రైసు మిల్లులు ఉన్నాయి. మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన మల్లోజున వేణుగోపాల్‌ రావు పెద్దపల్లి పట్టణానికి చెందిన వారు కావడం విశేషం.

వీడియోస్

ADVT