నియోజకవర్గం : అసెంబ్లీ

జగిత్యాల

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
కరీంనగర్
మొత్తం ఓటర్లు :
194413
పురుషులు :
94347
స్త్రీలు :
100051
ప్రస్తుత ఎమ్మెల్యే :
డాక్టర్ సంజయ్ కుమార్
ప్రస్తుత ఎంపీ :
బి.వినోద్

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 1,94,413
పురుషులు: 94,347
స్త్రీలు: 1,00,051
ఇతరులు: 15
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: ఎక్కువగా బీసీ కులస్థులు ఉంటారు. ఇందులో మున్నూరుకాపు కులస్థులు ఎక్కువగా ఉంటారు. రెడ్డి సామాజిక వర్గం కూడా ఎక్కువగానే ఉంది. జగిత్యాలలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ప్రభావం చూపుతారు. ప్రతి ఎన్నికల్లో వీరి ఓట్లే కీలకంగా మారుతుంటాయి.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలోని ఏ ఏ మండలాలు ఉన్నాయి: జగిత్యాల అర్బన్‌, జగిత్యాల రూరల్‌, రాయికల్‌, సారంగాపూర్‌, బీర్‌పూర్‌ 
ఏ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉంది: నిజామాబాద్‌ 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 డాక్టర్ సంజయ్‌కుమార్ టీఆర్ఎస్ టి.జీవన్ రెడ్డి కాంగ్రెస్ 61185
2014 టి.జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌ ఎల్‌.రమణ టీడీపీ 8600
2009 ఎల్‌.రమణ టీడీపీ జీవన్‌ రెడ్డి కాంగ్రెస్ 30800
2004 టి.జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌ ఎల్‌.రమణ టీడీపీ 11600
1999 టి.జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌ ఎల్‌.రమణ టీడీపీ 8800
1996 టి.జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌ బండారి వేణుగోపాల్‌ టీడీపీ 54200
1994 ఎల్‌.రమణ టీడీపీ జీవన్‌ రెడ్డి కాంగ్రెస్ 4500
1989 టి.జీవన్‌ రెడ్డి కాంగ్రెస్‌ రాజేశం గౌడ్‌ టీడీపీ 32300
1985 జి.రాజేశం గౌడ్‌ టీడీపీ జీవన్‌ రెడ్డి కాంగ్రెస్ 15200
1983 టి.జీవన్‌ రెడ్డి టీడీపీ రత్నాకర్‌ రావు కాంగ్రెస్ 13400

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

ఎ) బీఎస్‌ రాములు: ఈయన జగిత్యాల పట్టణానికి చెందినవారు. ప్రముఖ రచయిత, బడుగు బలహీన సామాజిక వర్గాలపై అనేక రచనలు చేశారు. హాస్టల్‌ వార్డెన్‌గా పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం బీసీ కమిషన్‌ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
బి) జైశెట్టి రమణయ్య: జగిత్యాలకు చెందిన ఈయన రిటైర్డ్‌ రీడర్‌. తెలంగాణ చరిత్రపై అనేక రచనలు చేశారు. శాతవాహనుల రాజధాని కోటిలింగాల చరిత్రను వెలుగులోకి తీసుకువచ్చారు.
సి) తురగ వినయ్‌కృష్ణారెడ్డి: రాయికల్‌ మండలం మైతాపూర్‌కు చెందిన వ్యక్తి. గ్రూప్‌-1 ద్వారా ఆర్డీవోగా ఎన్నికయ్యారు. ప్రమోషన్‌ ద్వారా ఇటీవలే జనగామ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఎ) జగిత్యాల మండలం పొలాసలో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉంది. ఇక్కడి శాస్త్రవేత్తలు రూపొందించిన వరి వంగడాలు మంచి ప్రాముఖ్యత పొందాయి. జగిత్యాల సన్నాలు, పొలాస సన్నాల వరి రకాలు వివిధ రాష్ట్రాల్లో ప్రాధాన్యత పొందాయి.
బి) సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండలాల సరిహద్దులో రోళ్లవాగు ప్రాజెక్ట్‌ ఉంది. రూ.60 కోట్లతో దీనిని నిర్మిస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన ప్రాజెక్ట్‌ ఇది. గుట్టల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ప్రాజెక్ట్‌ ద్వారా 30 గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందుతుంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

జగిత్యాల పట్టణంలో రూ.50 కోట్లతో సుందరీకరణ పనులు సాగుతున్నాయి. హైదరాబాద్‌ తర్వాత జగిత్యాలకే 4100 డబుల్‌ బెడ్‌ రూంలు మంజూరు కాగా పనులు సాగుతున్నాయి. రాయికల్‌ మండలంలోని బోర్నపెల్లి, ఆదిలాబాద్‌ జిల్లా చిన్న బెల్లాల మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మాణ పనులు సాగుతున్నాయి. రూ.60 కోట్లతో చేపడుతున్న రోళ్లవాగు పనులు వేగవంతంగా సాగుతున్నాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

జగిత్యాల నియోజకవర్గంలో అతి పెద్ద పట్టణం జగిత్యాల. లక్షా 10 వేల వరకు జనాభా ఉంటుంది. పట్టణ నడిబొడ్డు నుంచి జాతీయ రహదారి-63 వెళ్తుంది. ఇరుకుగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతాయి. రోడ్డు వెడల్పు చేయాలని 30 ఏళ్లుగా ప్రజలు కోరుతున్నా రోడ్డు వెడల్పు జరగడం లేదు. జగిత్యాల పట్టణానికి తాగునీటి సమస్య ఉంది. 10 సంవత్సరాల క్రితం రూ.10 కోట్లతో ఫిల్టర్‌బెడ్‌ పనులు చేపట్టినా ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో ప్రతి ఏటా తాగునీటి ఇబ్బంది ఏర్పడుతోంది.

ముఖ్య ప్రాంతాలు

ఎ) జగిత్యాల పట్టణంలో చారిత్రకమైన ఖిల్లా ఉంది. క్రీ.శ.1747లో ఎలుగందుల కోటకు అధిపతిగా ఉన్న ముబారిజుల్‌ ముల్క్‌ జఫరుద్దౌలా మిర్జా ఇబ్రహీం ఖాన్‌ ధంసా అనునతడు జగిత్యాలలో సువిశాలమైన, పటిష్టమైన శతృ దుర్భేద్యంగా ఫ్రెంచి ఇంజనీర్ల సహకారంతో జగిత్యాల ఖిల్లాను నిర్మించాడు. ఇది నక్షత్రాకారంలో ఉండటంతో ఆకట్టుకుంటోంది.
బి) జగిత్యాల అనగానే పట్టణ నడి బొడ్డున ఉన్న టవర్‌ గుర్తొస్తుంది. దీనికి చారిత్రక నేపథ్యం ఉంది. నిజాం పరిపాలన సాగుతున్న తరుణంలో చల్‌గల్‌ పరిగణకు ముత్తేదారుగా రాజా జువ్వాడి వెంకట ధర్మజగపతి రావు వ్యవహరిస్తుండేవాడు. హైదరాబాద్‌ సంస్థానంలోని ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ సూచనల మేరకు ధర్మజగపతి రావు జగిత్యాల పట్టణంలో నిజాం పాలన 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి గుర్తింపుగా పట్టణ నడిబొడ్డున 1937లో రూ.10 వేలతో టవర్‌ నిర్మించాడు.

ఇతర ముఖ్యాంశాలు

రాజకీయంగా చైతన్యం గల నియోజకవర్గం జగిత్యాల. ఇక్కడ గెలుపొందిన జీవన్‌ రెడ్డి ప్రస్తుత సీఎల్పీ ఉపనేతగా కొనసాగుతున్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన ఎల్‌.రమణ తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఉన్నారు. నిజామాబాద్‌ ఎంపీ కవిత ఈ నియోజకవర్గం పరిధిలోనే ఉంటారు. జగిత్యాలపై గులాబీ జెండా ఎగురవేసేందుకు ఎంపీ కవిత ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

వీడియోస్

ADVT