నియోజకవర్గం : అసెంబ్లీ

ధర్మపురి

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
కరీంనగర్
మొత్తం ఓటర్లు :
202661
పురుషులు :
99775
స్త్రీలు :
102883
ప్రస్తుత ఎమ్మెల్యే :
కొప్పుల ఈశ్వర్
ప్రస్తుత ఎంపీ :
బాల్క సుమన్

ఓట‌ర్లు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 2,02,661
పురుషులు: 99,775
స్త్రీలు: 1,02,883
ఇతరులు: 03

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 కొప్పుల ఈశ్వర్ టీఆర్‌ఎస్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కాంగ్రెస్‌ 441
2014 కొప్పుల ఈశ్వర్ టీఆర్‌ఎస్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కాంగ్రెస్‌ 18679
2010 కొప్పుల ఈశ్వర్ టీఆర్‌ఎస్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కాంగ్రెస్‌ 58
2009 కొప్పుల ఈశ్వర్ టీఆర్‌ఎస్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కాంగ్రెస్‌ 1370

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

ఎ) సంగనభట్ల నర్సయ్య :  ప్రముఖ కవి, రచయిత, సాహిత్య విమర్శకులు, చరిత్ర పరిశోధకులు, నాటకరంగ ప్రముఖులు. ధర్మపురి క్షేత్ర చరిత్ర, తెలివాహ గోదావరి పుస్తకాలు రాసి, తెలుగులో చాటు కవిత్వం పేరుతో చందశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ పుస్తకాల్ని ట్రాన్స్‌లేషన్‌ చేసి, నాటక రంగంలో పౌరాణిక, సాంఘిక పాత్రలు పోషించారు. కాకతీయుల కాలం నాటి చెరువులు, కుంటల నిర్వహణపై పరిశోధనాత్మక వ్యాసం రాసి ఒక ఫ్రీలాన్స్‌ జర్నలిస్టుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి మిషన్‌ కాకతీయ అవార్డు అందుకున్నారు. ధర్మపురి ఎస్‌ఎల్‌ఎన్‌ఎస్‌ఏ కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ పొందారు.
బి) కేవీ నరేందర్‌: గొల్లపల్లి మండలంలోని చిల్వాకోడూరుకు చెందిన కేవీ నరేందర్‌ కవి, రచయితగా పలు పుస్తకాలు రాసి ముద్రించి రాష్ట్ర స్థాయిలో పలు అవార్డులు పొందారు. ప్రస్తుతం ఆయన ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఎ) నియోజకవర్గంలో ముఖ్యమైన సంస్థలు లేవు.
బి) ధర్మారం మండలంలోని మేడారంలో రూ.70 కోట్లతో నిర్మించిన మేడారం రిజర్వాయర్‌ పనులు పూర్తి అయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుబంధంగా మేడారం 6వ ప్యాకేజీ కింద అండర్‌ టన్నల్‌ నిర్మాణ పనులు, రంగదామునిపల్లె రిజర్వాయర్‌ ఉపకాలువ ప్రగతిలో ఉన్నాయి. కమలాపూర్‌ సమీపంలో సుమారు 20 కోట్ల నిధులతో చేపట్టిన బోల్‌చెరువు, బందం మరమ్మతు పనులు, కమలాపూర్‌ బృహత్తర రక్షిత మంచి నీటి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పనులు పూర్తి అయితే వేలాది ఎకరాల భూములకు సాగు నీరందుతుంది. మంచి నీటి పథకం కింద మండల ప్రజలకు తాగు నీరు అందుతుంది..

అభివృద్ధి ప‌థ‌కాలు

ధర్మపురి నియోజకవర్గ పరిధిలో గల మండలాల్లో ఆర్‌అండ్‌బీ నిధులు రూ.50 కోట్లతో రోడ్లు, బ్రిడ్జి, కల్వర్టు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ధర్మపురి పట్టణంలో రూ.2 కోట్లతో చింతామణి చెరువు సుందరీకరణ పనులు సాగుతున్నాయి. మరో 50 కోట్ల నిధులచే ఇతరత్రా పనులు కొనసాగుతున్నాయి. ధర్మపురి టెంపుల్‌ సిటీ అభివృద్ధికి రూ 50 కోట్లు, పట్టణ అభివృద్ధికి రూ 25 కోట్లు నిధులు మంజూరు అయ్యాయి. పనులు ప్రారంభించాల్సి ఉంది.

పెండింగ్ ప్రాజెక్టులు

ధర్మపురి నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. ధర్మపురి పుణ్యక్షేత్రం ఎన్‌హెచ్ 63కు ఆనుకుని ఉంది. ఈ క్షేత్రంలో నంది విగ్రహ చౌరస్తా నుంచి దేవాలయం మీదుగా గోదావరి వరకు, ఇటు బోయవాడ మీదుగా పోచమ్మ ఆలయం వరకు రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. ఏళ్ల తరబడి నుంచి ప్రజలు రోడ్ల వెడల్పు కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ఆ దిశగా పనులు జరగటం లేదు. దీంతో క్షేత్రవాసులు, నిత్యం వచ్చే భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. గోదావరి నదిలో మురికి నీరు కలవటం ఇబ్బందిగా ఉంది. అక్కపెల్లి చెరువు రిజర్వాయర్‌ నిర్మాణానికి నోచుకోవటం లేదు. ధర్మపురి పట్టణానికి తాగునీటి సమస్య ఉంది. బీర్‌పూర్‌ బృహత్తర మంచి నీటి పథకం కింద సక్రమంగా తాగునీరు అందకపోవటం, 11 సంవత్సరాల క్రితం రూ.12 కోట్లతో చేపట్టిన కమలాపూర్‌ బృహత్తర మంచి నీటి పథకం కింద పనులు పూర్తి కాలేదు. దీంతో తాగు నీటి సమస్య తీవ్రంగా ఉంది. గుంజపడుగులో ఫ్లోరైడ్‌ సమస్య, పెగడపల్లిలో జూనియర్‌ కళాశాల లేకపోవటం ఇబ్బందిగా మారింది. వెలగటూర్‌ మండలంలో క్వారీలు, క్రషర్స్‌లో బ్లాస్టింగ్‌ల వల్ల రసయానాలు బయటకు వస్తుండటంతో పరిసర గ్రామాల ప్రజలు భయందోళనలో ఉన్నారు.

ముఖ్య ప్రాంతాలు

ఎ) దక్షిణ భారతదేశంలోని 108 దివ్య పుణ్యక్షేత్రాలలో ధర్మపురి మహా క్షేత్రం ఒకటి. ఈ క్షేత్రం దక్షిణ కాశీగా పేరొందింది. పవిత్ర గోదావరి నదీ తీరాన విరాజిల్లుతున్న ఈ పుణ్య తీర్థానికి పురాణ, ఇతిహాస, సాహిత్యపర ప్రాధాన్యత కలిగి ఆధ్యాత్మిక క్షేత్రంగా విలసిల్లుతోంది. పూర్వం ధర్మవర్మ అనే మహారాజు పరిపాలించుట వలన ఈ క్షేత్రానికి ధర్మపురి అనే పేరు వచ్చింది. క్షేత్రంలో ప్రధానంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాలు, మసీదులు పక్క పక్కనే కలిగి ఆనాది నుంచి వైష్ణవ, శైవ, ముస్లీం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. ఈ ఆలయ ప్రాంగణంలో భారత దేశంలో ఎక్కడా లేని విధంగా శ్రీ యమధర్మరాజు ఆలయం ఉంది. ధర్మపురికి వచ్చిన వారులకు యమపురి ఉండదు అనే నానుడి ఉంది. ఇక్కడ బోయరాజు పూర్వకాలంలో బ్రహ్మపుష్కరిణి నిర్మించాడు.
బి) కోటిలింగాల పురాతన పుణ్యక్షేత్రంగా, ప్రస్తుతం పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది. కోటిలింగాల శాతవాహనుల తొలి రాజధాని. ఇక్కడ నాణేలు బయట పడటం వల్ల శ్రీముఖుడు పరిపాలించినట్లు తెలిసింది. గోదావరి ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌‌ను ఆనుకుని కోటేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇటీవల ఇక్కడ పర్యాటకుల కోసం శాతకర్ణి, పులేమావి అనే బోట్స్‌ ఏర్పాటు చేశారు. ఈ బోట్స్‌ ద్వారా పర్యాటకులు గోదావరి నదిలో విహరించవచ్చు.

ఇతర ముఖ్యాంశాలు

ధర్మపురి (ఎస్సీ) నియోజకవర్గం 2009లో నూతనంగా ఏర్పాటైంది. ఈ నియోజకవర్గ పరిధిలో గల మద్దుట్ల, బతికపెల్లి, తిమ్మాపూర్‌, చందోళి, కమ్మరిఖాన్‌పేట, పైడిపల్లి గ్రామాలకు చెందిన గుర్రం మాధవరెడ్డి, తాటిపర్తి జీవన్‌రెడ్డి, జువ్వాడి నారాయణరావు, జువ్వాడి రత్నాకర్‌రావు, కటారి దేవేందర్‌రావు, గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, గంగుల కమలాకర్‌ లాంటి వారు గతంలో టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున చొప్పుదండి, జగిత్యాల, మహారాజ్‌గంజ్‌, బుగ్గారం, కరీంనగర్‌, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వారిలో నారాయణరావు టీడీపీ ప్రభుత్వ హయాంలో శాసనసభ స్పీకర్‌గా, జీవన్‌రెడ్డి, రత్నాకర్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పని చేశారు. ప్రస్తుతం జీవన్‌రెడ్డి, కమలాకర్‌ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక్కడ గెలుపొందిన కొప్పుల ఈశ్వర్‌ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా కొనసాగుతున్నారు. ఈ ఎస్సీ నియోజకర్గం నుంచి పోటీ చేసిన వారందరూ స్థానికులు కాదనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి చీఫ్‌ విప్‌ ఈశ్వర్‌ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులుగా పాత వారైన లక్ష్మణ్‌కుమార్‌, కన్నం అంజయ్య, టీడీపీ అభ్యర్థిగా  జాడి బాల్‌రెడ్డి పోటీ చేస్తారని నాయకులు, కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు.

వీడియోస్

ADVT