నియోజకవర్గం : అసెంబ్లీ

జడ్చర్ల

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
మహబూబ్‌నగర్
మొత్తం ఓటర్లు :
189915
పురుషులు :
96249
స్త్రీలు :
93652
ప్రస్తుత ఎమ్మెల్యే :
చర్లకోల లక్ష్మారెడ్డి
ప్రస్తుత ఎంపీ :
ఏ.పి. జితేందర్ రెడ్డి

ఓట‌ర్లు

ఓటర్ల వివరాలు:
మొత్తం: 1,89,915 
పురుషులు: 96,249  
స్త్రీలు: 93,652
ఇతరులు: 14 
జడ్చర్ల నియోజకవర్గంలో లంబాడీల (గిరిజనులు) ఓట్లు అధికం. ఈ నియోజకవర్గంలోని బాలానగర్‌, రాజాపూర్‌, జడ్చర్ల మండలాల్లో ఈ సామాజికవర్గం కేంద్రీకృతమై ఉంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఈ వర్గానికి 35వేల పైచిలుకు ఓట్లు నమోదై ఉన్నాయి. వీరి తర్వాత ఎస్సీ ఓటర్లు 30 వేల వరకు ఉన్నారు. బీసీ సామాజికవర్గాల ఓట్లు 95 వేల వరకు ఉంటాయి. ఇందులో ప్రధానంగా ముదిరాజ్‌ సామాజికవర్గానికి చెందిన ఓట్లు 25 వేల వరకు ఉండగా, ఆ తర్వాత గొల్ల, కురుమల ఓట్లు 22 వేల వరకు ఉంటాయి. ఆ తర్వాత వరుసగా గౌడ్‌ సామాజికవర్గం 15 వేలు, మున్నూరు కాపు సామాజికవర్గం 12వేలు, ముస్లీం ఓటర్లు 10 వేలు ఉంటారని అంచనా. రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ ఇతర ఉన్నత సామాజికవర్గాల ఓట్లు దాదాపు 20వేల వరకు ఉంటాయని అంచనా. పూర్తి గ్రామీణ నేపథ్యం కలిగిన ఈ నియోజకవర్గంలో ఏ సామాజికవర్గం కూడా గంపగుత్తగా ఒకే పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదు. అన్ని సామాజికవర్గాల్లో ప్రధానపార్టీలకు ఓటుబ్యాంకు ఉండడం ఇక్కడి ప్రత్యేక పరిస్థితిని తెలియజేస్తోంది. లంబాడీలు, ఎస్సీలు ముదిరాజ్‌, యాదవ, ముస్లిం, మున్నూరుకాపు సామాజికవర్గాల ఓటు బ్యాంకు ఎటుమొగ్గితే అటు వైపే ఫలితం వస్తుండడం ఇక్కడి ప్రత్యేకతను తెలియజేస్తోందని రాజకీయవిశ్లేషకులు చెబుతున్నారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: జనరల్‌
నియోజకవర్గంలోని మండలాలు: జడ్చర్ల, నవాబ్‌పేట, రాజాపూర్‌, బాలానగర్‌, మిడ్జిల్‌, ఉర్కొండపేట (ఇది కొత్తగా ఏర్పాటయిన మండలం. జిల్లాల విభజనతో దీన్ని నాగర్‌కర్నూల్‌ జిల్లాకు కేటాయించారు.)
లోక్‌సభ నియోజకవర్గ పరిధి: మహబూబ్‌నగర్‌
 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 డా. సి. లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్ మల్లురవి కాంగ్రెస్ 45080
2014 డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌ డాక్లర్‌ మల్లురవి కాంగ్రెస్‌ 14734
2009 ఎం.చంద్రశేఖర్‌ టీడీపీ డాక్టర్‌ మల్లురవి కాంగ్రెస్‌ 13537
2008 డాక్టర్‌ మల్లురవి కాంగ్రెస్‌ ఎం.చంద్రశేఖర్‌ టీడీపీ 2106
2004 డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌ ఎం.చంద్రశేఖర్‌ టీడీపీ 18382
1999 ఎం.చంద్రశేఖర్‌ టీడీపీ ఎండీ అల్లాజీ కాంగ్రెస్‌ 24642
1996 ఎం.చంద్రశేఖర్‌ టీడీపీ జి.సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ 47735
1994 ఎం.సత్యనారాయణ టీడీపీ పెద్దనర్సప్ప కాంగ్రెస్‌ 53379
1989 సుధాకర్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎం.కృష్ణారెడ్డి టీడీపీ 1051
1985 ఎం.కృష్ణారెడ్డి టీడీపీ ఎన్‌.నర్సప్ప కాంగ్రెస్‌ 14155
1983 ఎం.కృష్ణారెడ్డి ఇండి ఎన్‌.నర్సప్ప కాంగ్రెస్‌ 5818
1978 నర్సప్ప కాంగ్రెస్‌ రఘునందన్‌రెడ్డి జనతాపార్టీ 17740
1972 నరసప్ప కాంగ్రెస్‌ జి.విశ్వనాథం స్వతంత్ర 9820
1967 ఎల్‌.ఎన్‌.రెడ్డి స్వతంత్ర ఎం.రాందేవ్‌రెడ్డి కాంగ్రెస్‌ 4670
1962 కేశవులు స్వతంత్ర కె.జనార్థన్‌రెడ్డి కాంగ్రెస్‌ 4830

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

నియోజకవర్గంలో ముఖ్యమైన ప్రాజెక్టులు ఏమీలేవు. అయితే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. మిడ్జిల్‌, ఉర్కొండపేట మండలాలకు సంబంధించి ఇక్కడ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి ప్రధాన కాల్వ ద్వారా సాగునీటి వనరు ఏర్పాటయింది. నియోజకవర్గంలోని పోలేపల్లిలో 200 ఎకరాల్లో సెజ్‌, అదేవిధంగా 800 ఎకరాల్లో టీఎస్‌ ఐఐసీ పారిశ్రామిక వాడలు ఉన్నాయి. సెజ్‌లో ప్రఖ్యాత బహుళజాతి సంస్థలకు చెందిన హెటిరో, అరబిందో, శిల్ప, మైలాన్‌ ఫార్మాలతో పాటు సెజ్‌ వెలుపల ఉన్న పారిశ్రామిక వాడలో ఎల్‌అండ్‌టీ సంస్థ ఉద్యోగుల శిక్షణ కేంద్రం, బ్యాటరీల తయారీ సంస్థ తదితర కంపెనీలున్నాయి. బాలానగర్‌, రాజాపూర్‌ మండలాల్లో కెమికల్‌ కంపెనీలు, స్పాంజ్‌ ఐరన్‌ పరిశ్రమలు ఉన్నాయి. ఇంకా కాటన్‌ స్పిన్నింగ్‌, జిన్నింగ్‌ మిల్లులున్నాయి. వీటితో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా 50 వరకు రైస్‌మిల్లులున్నాయి. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైన బాదేపల్లి వ్యవసాయమార్కెట్‌యార్డు ఈ నియోజకవర్గానికే కాకుండా మహబూబ్‌నగర్‌ జిల్లాకు తలమానికంగా నిలుస్తోంది.

అభివృద్ధి ప‌థ‌కాలు

నియోజకవర్గమంతటికీ సాగునీరందించే ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పూర్తికావచ్చింది. ఈ రిజర్వాయర్‌కు నీరిచ్చే టన్నెల్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లో మాదిరిగానే మిషన్‌భగీరథ, మిషన్‌ కాకతీయ పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు దాదాపుగా బీటీ రోడ్లు వేశారు. జడ్చర్ల పట్టణంలో సుందీకరణ, సెంట్రల్‌ లైటింగ్‌, రోడ్ల విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. అదేవిధంగా పట్టణంలోని నల్లకుంట, నల్లచెరువులను రెండింటినీ మినీ ట్యాంకుబండ్‌లుగా తీర్చిదిద్దే పనులు కొనసాగుతున్నాయి. జడ్చర్లలోని 30 పడకల సివిల్‌ ఆసుపత్రిని ఇటీవలే వంద పడకల ఆసుపత్రిగా మార్చారు. అదేవిధంగా రైతుబజార్‌ని ఏర్పాటు చేశారు. బాలానగర్‌లో పీహెచ్‌సీని 30 పడకల ఆసుపత్రిగా మార్చారు. జడ్చర్లలో మహిళా డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేశారు.

పెండింగ్ ప్రాజెక్టులు

నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా నెలకొన్న సమస్యలు సాగునీటి ఎద్దడి, ప్రజలకు ఉపాధి లేకపోవడంతో వలసలు పోవడం. ఈ రెండింటికీ ఉమ్మడి నివారణగా నియోజకవర్గ వ్యాప్తంగా సాగునీటిని అందించేందుకు గాను పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇక్కడ ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ని 17 టీఎంసీల సామర్థ్యంతో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి భూసేకరణ పూర్తయితే పనులు వేగిరం చేసేందుకు వీలుగా టెండర్లు కూడా ఖరారు చేశారు. ప్రధానమైన సమస్యలు పరిష్కరించకపోవడంతో ప్రజలు ఉపాధి కోసం పట్టణాల బాట పట్టాల్సి వస్తోంది.

ముఖ్య ప్రాంతాలు

జడ్చర్లలోని లక్ష్మీచెన్నకేశవాలయం, ఉర్కొండలోని అభయాంజనేయస్వామి ఆలయం, మీనాంబరం వాగు, శివగిరిక్షేత్రం, పరసవేది ఆలయం, గొల్లత్తగుడి, ఫత్తేపూర్‌ మైసమ్మ ఆలయం.
ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు:  ప్రత్యేక ఆర్థిక మండలి, టీఎస్‌ఐఐసీ పారిశ్రామికవాడ.

ఇతర ముఖ్యాంశాలు

హైదరాబాద్‌- బెంగళూరు ప్రధాన రహదారిపై ఉండే ఈ నియోజకవర్గం హైదరాబాద్‌కు సమీపంలో ఉండడంతో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. సెజ్‌తో పాటు టీఎస్‌ఐఐసీ పారిశ్రామికవాడను ఇక్కడ ఏర్పాటు చేయడంతో పలు పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటవుతున్నాయి. ఈ నియోజకవర్గ వ్యాప్తంగా రియల్‌ ఎస్టేట్‌ హవా కొనసాగుతోంది. ప్రఖ్యాత రియల్‌ సంస్థలు ఇక్కడ లే అవుట్‌లను ఏర్పాటు చేశాయి. ఇక్కడి ఆర్టీసీ బస్టాండ్‌ రెండు తెలుగురాష్ట్రాల మధ్య అనుసంధానకర్తగా ఉంటుంది. ఇక్కడి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఏ ప్రాంతానికైనా బస్సు సౌకర్యం కలదు. గ్రామీణ నియోజకవర్గమైనప్పటికీ పట్టణ సంస్కృతికి నిదర్శనంగా నిలిచే రియల్‌ఎస్టేట్‌, పరిశ్రమలు ఇక్కడ నెలకొనడం ఇక్కడి ప్రత్యేకత.

వీడియోస్

ADVT