నియోజకవర్గం : అసెంబ్లీ

కంటోన్మెంట్

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
హైదరాబాద్
మొత్తం ఓటర్లు :
236963
పురుషులు :
119814
స్త్రీలు :
117142
ప్రస్తుత ఎమ్మెల్యే :
జి. సాయన్న
ప్రస్తుత ఎంపీ :
చామకూర మల్లారెడ్డి

ఓట‌ర్లు

నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు: 2,36,963
పురుషులు: 1,19,814
స్త్రీలు: 1,17,142
ఇతరులు: 07

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

రిజర్వేషన్‌: ఎస్సీ
మండలాలు: సికింద్రాబాద్‌, మారేడుపల్లి, తిరుమలగిరి
లోక్‌సభ నియోజకవర్గం: మల్కాజిగిరి 
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 జి.సాయన్న టీఆర్‌ఎస్ సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ 37568
2014 జి.సాయన్న టీడీపీ గజ్జెల నాగేష్‌ టీఆర్‌ఎస్‌ 3275
2009 డాక్టర్‌ పి.శంకర్‌రావు కాంగ్రెస్‌ జి.సాయన్న టీడీపీ 4183
2004 జి.సాయన్న టీడీపీ రావులు అంజయ్య టీఆర్‌ఎస్‌ 15032
1999 జి.సాయన్న టీడీపీ డి.బి.దేవేందర్‌ కాంగ్రెస్‌ 29941
1994 జి.సాయన్న టీడీపీ డి.నర్సింగ్‌రావు కాంగ్రెస్‌ 3636
1989 డి.నర్సింగ్‌రావు కాంగ్రెస్‌ ఎన్‌.ఎ.కృష్ణ టీడీపీ 22799
1985 సర్వే సత్యనారాయణ టీడీపీ బి.మశ్చిందర్‌రావు కాంగ్రెస్‌ 6906
1983 ఎన్‌.ఏ.కృష్ణ ఇండిపెండెంట్‌ బి.మశ్చిందర్‌రావు కాంగ్రెస్‌ 9039
1978 బి.మశ్చిందర్‌రావు జెఎన్‌పి ముత్తుస్వామి కాంగ్రెస్‌ 366
1972 వి.మంకమ్మ కాంగ్రెస్‌ బి.ఎం.నరసింహ ఎస్‌టీఎస్‌ 7704
1967 వీ.ఆర్‌.రావు కాంగ్రెస్‌ దేవరాజన్‌ ఇండిపెండెంట్‌ 11085
1962 బి.వి.గురుమూర్తి కాంగ్రెస్‌ పి.జగన్నాథం ఇండిపెండెంట్‌ 10239
1957 బి.వి.గురుమూర్తి కాంగ్రెస్‌ పి.జగన్నాథం పిఎస్‌పి 10006

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

ఈ నియోజకవర్గంలో అత్యధిక శాతం రక్షణ శాఖ స్థావరాలు, సంస్థలు, కార్యాలయాలు ఉన్నాయి. అలాగే సికింద్రాబాద్‌ సివిల్‌ కోర్టులు, దక్షిణమధ్యరైల్వే పరిపాలన కేంద్రమైన రైల్‌ నిలయం, రైల్వే జనరల్‌ మేనేజర్‌ నివాసం, ఇతర అధికారుల నివాసాలు, క్వార్టర్లు, జూబ్లీ బస్‌స్టేషన్‌, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌, కేంద్రీయ విద్యాలయ పాఠశాలలు, తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం, జీహెచ్‌ఎంసీ ఉత్తర మండల కార్యాలయం ఉన్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో డబుల్‌ బెడ్‌‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. రసూల్‌పురా సిల్వర్‌ కంపెనీ, మడ్‌ఫోర్టు శ్రీరామ్‌నగర్‌, గాంధీనగర్‌, ఓల్డ్‌ మారేడుపల్లిలలో డబుల్‌బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణ పనులు సాగుతున్నాయి. జీహెచ్‌ఎంసీలో మాదిరిగా 5 రూపాయిలకే భోజన కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మారేడుపల్లిలో 2కోట్ల 10 లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీ హాలు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పలు కాలనీలు, బస్తీల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, సిమెంట్‌ రోడ్ల నిర్మాణం, మంచినీటి పైప్‌లైన్ల నిర్మాణం పనులు సాగుతున్నాయి. బొల్లారంలోని కంటోన్మెంట్‌ ఆసుపత్రి ప్రారంభమైంది.

పెండింగ్ ప్రాజెక్టులు

కేంద్ర రక్షణ శాఖ పరిధిలో ఉండడంతో కంటోన్మెంట్‌లో పలు సమస్యలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహకారం లోపించడంతో అనేక దీర్ఘకాలిక ప్రాజెక్టులు పెండింగులోనే ఉన్నాయి. దశాబ్దాలుగా ఊరిస్తున్న భూ బదలాయింపు జరగడం లేదు. ఫలితంగా నందమూరినగర్‌, మడ్‌ఫోర్టు, చిన్నకమేళా, పెద్ద కమేళా, నెహ్రూ సెంటినరీ బస్తీల్లో పేదలకు ఇళ్ల పట్టాలు లేక ఏ క్షణంలో మిలిటరీ అధికారులు వచ్చి ఇళ్లను నేలమట్టం చేస్తారేమోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. డాక్టర్‌ వై.ఎస్‌.హయాంలో మంజూరైన 5 విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు స్థల కొరత కారణంగానే ఏర్పాటు కాలేదు. అగ్నిమాపక దళం ఏర్పాటు కాలేదు. కొన్ని ఏరియాల్లో ఐదు, ఆరు రోజులకోసారి నీటి సరఫరా జరుగుతోంది. బొల్లారంలో ప్రారంభమైన కంటోన్మెంట్‌ జనరల్‌ ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి రాలేదు. రామన్నకుంట చెరువు ప్రక్షాళన పనులు ఇంకా పూర్తి కాలేదు. జీఎస్‌టీ అమలులోకి రావడంతో ఆకాట్రాయ్‌ రద్దయినప్పటికీ, టోల్‌ట్యాక్స్‌ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. బోర్డు ఖజానాను నింపే ప్రధాన రాబడి వనరు కావడంతో టోల్‌ట్యాక్స్‌ రద్దుకు రక్షణ శాఖ విముఖంగా ఉన్నది. అన్ని వార్డుల్లో డిస్పెన్సరీలు లేకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్య సదుపాయం సక్రమంగా అందడం లేదు. కాలనీలు, బస్తీల్లో పారిశుధ్య నిర్వహణ అంతంత మాత్రమే. తిరుమలగిరి చెరువు మురికికాసారంగా మారడంతో చుట్టుపక్కల ఉన్న కాలనీలు, బస్తీల ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం.

ముఖ్య ప్రాంతాలు

సెయింట్‌ మేరీస్‌ చర్చి, సికింద్రాబాద్‌ గణపతి దేవాలయం, మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం, సెయింట్‌ ఆన్స్‌, సెయింట్‌ మేరీస్‌, సెయింట్‌ ప్యాట్రిక్స్‌, మహబూబ్‌ కళాశాల తదితర విద్యాసంస్థలు ఉన్నాయి. హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం, బోయినపల్లి వ్యవసాయ మార్కెట్‌, అయ్యప్పస్వామి ఆలయం ఉన్నాయి.

ఇతర ముఖ్యాంశాలు

ట్యాంక్‌బండ్‌కు ఇవతల గుడారాలు ఏర్పాటు చేసుకుని సైనికులు శిక్షణ తీసుకున్న ప్రాంతం. ఒకప్పుడు బ్రిటిష్‌ సైనికులు సైనికాధికారులతో ఉన్న కంటోన్మెంట్‌లో కాలక్రమేణా సాధారణ పౌరుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఫలితంగా 300కు పైగా కాలనీలు, పెద్ద సంఖ్యలో బస్తీలు వెలిసాయి. రంగారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌ తదితర జిల్లాలకు చెందిన ప్రజలు చాలా ఏళ్లుగా ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. బ్రిటిష్‌ సైన్యం వెళ్లిపోయి, దేశానికి స్వాతంత్య్రం వచ్చినా ఇక్కడి ప్రజలకు మాత్రం ఇంకా పూర్తి స్వాతంత్య్రం రాలేదని చెబుతుంటారు. కంటోన్మెంట్‌ ఏరియా కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉండడం, ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన మొదలు దీర్ఘకాలిక ప్రాజెక్టుల వరకు రక్షణ శాఖ దయాదాక్షణ్యాలపై ఆధార పడడమే అందుకు కారణం. ఆర్మీకి చెందిన ఉన్నతాధికారి అధ్యక్షునిగా ఉండే కంటోన్మెంట్‌ బోర్డు పాలకమండలిలో 8 వార్డుల నుంచి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన సభ్యులు ఉంటారు. అయితే వారికి సమాన సంఖ్యలో మిలిటరీ నామినేటెడ్‌ సభ్యులూ ఉంటారు. ఏదైనా ప్రతిపాదన విషయమై ఓటింగ్‌ జరిగితే ఆర్మీ అధికారుల మాటనే చెల్లుతుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా కేంద్ర రక్షణ శాఖ నిధులు మంజూరు చేయకపోవడం, సర్వీసు చార్జీలు సక్రమంగా చెల్లించకపోవడం, సైనిక స్థావరాలు, సైనిక కార్యాలయాలు, సంస్థల భద్రత పేరిట నిత్యం ఆంక్షలతో బెదిరింపులకు గురి చేస్తుండటంతో కంటోన్మెంట్‌ వాసుల బాధలు వర్ణనాతీతం.

వీడియోస్

ADVT