నియోజకవర్గం : అసెంబ్లీ

వికారాబాద్‌

రాష్ట్రం :
తెలంగాణ
జిల్లా :
రంగారెడ్డి
మొత్తం ఓటర్లు :
203472
పురుషులు :
103190
స్త్రీలు :
100267
ప్రస్తుత ఎమ్మెల్యే :
మెతుకు ఆనంద్
ప్రస్తుత ఎంపీ :
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

ఓట‌ర్లు

మొత్తం ఓటర్లు: 2,03,472
పురుషులు: 1,03,190
స్త్రీలు: 1,00,267
ఇతరులు: 15
 
నియోజకవర్గంలో కీలక వర్గాలు: నియోజకవర్గంలో ఎస్సీ మాదిగలు (31 వేలు), ముదిరాజ్‌లు (20 వేలు), ముస్లీంలు (16 వేలు), యాదవులు (15 వేలు), రెడ్డి (14 వేలు) సామాజిక వర్గాల ఓటర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ఆ తరువాతి స్థానాల్లో ఎస్సీ మాల, ఎస్టీలు, గౌడ్‌, రజక, లింగాయత్‌, మున్నూరు కాపు తదితర కులాల ఓటర్లు ఉంటారు.

నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌

నియోజకవర్గం పేరు: వికారాబాద్‌
రిజర్వేషన్‌: ఎస్సీ
ఏ జిల్లాలో ఉంది: వికారాబాద్‌
నియోజకవర్గంలో ఏయే మండలాలు ఉన్నాయి: వికారాబాద్‌, ధారూరు, మర్పల్లి, మోమిన్‌పేట్‌, బంట్వారం, కోట్‌పల్లి మండలాలు. కొత్తగా ఏర్పాటైన కోట్‌పల్లి మండలంలో ఆరు గ్రామాలు మినహా మిగతా గ్రామాలన్నీ జిల్లాల మండలాల పునర్విభజన కంటే ముందు బంట్వారం మండలంలోని గ్రామాలే. కోట్‌పల్లి మండలంలోని ఆరు గ్రామాలు తాండూరు అసెంబ్లీ పరిధిలోకి వస్తే, మిగతా గ్రామాలన్నీ వికారాబాద్‌ అసెంబ్లీ పరిధిలోకి వస్తాయి.
ఏ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది: చేవెళ్ల
సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ఢి పార్టీ ఆధిక్యం
2018 మెతుకు ఆనంద్ టీఆర్ఎస్ జి.ప్రసాద్ కుమార్ కాంగ్రెస్ 3092
2014 బి.సంజీవరావు టీఆర్‌ఎస్‌ జి.ప్రసాద్‌కుమార్‌ కాంగ్రెస్‌ 9919
2009 జి.ప్రసాద్‌కుమార్‌ కాంగ్రెస్‌ డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ టీఆర్‌ఎస్‌ 4859
2008 జి.ప్రసాద్‌కుమార్‌ కాంగ్రెస్‌ బి.సంజీవరావు టీడీపీ 28465
2004 డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ టీఆర్‌ఎస్‌ ఎస్‌.మధురవేణి టీడీపీ 2001
1999 డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ టీడీపీ ఎస్‌.మధురవేణి కాంగ్రెస్‌ 203
1994 డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ టీడీపీ బి.సంజీవరావు కాంగ్రెస్‌ 28064
1989 డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ టీడీపీ తిరుమలయ్య కాంగ్రెస్‌ 3969
1985 డాక్టర్‌ ఎ.చంద్రశేఖర్‌ టీడీపీ దేవదాసు ఇండిపెండెంట్‌ 20361
1983 కేఆర్‌ కృష్ణస్వామి కాంగ్రెస్‌ దేవదాసు ఇండిపెండెంట్‌ 5004
1978 వీబీ తిరుమలయ్య కాంగ్రెస్‌ దేవదాసు జనత 12202
1972 వీబీ తిరుమలయ్య స్వతంత్ర టీఎన్‌.ఆదిలక్ష్మి కాంగ్రెస్‌ 4711

రాజ‌కీయేత‌ర ప్ర‌ముఖులు

డాక్టర్‌ మెతుకు ఆనంద్‌:  వికారాబాద్‌లో ప్రముఖ వైద్యులు. భార్యాభర్తలు ఇద్దరూ డాక్టర్లే. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు ఆనంద్‌ బావ అవుతారు. ఎస్‌ఎస్‌సీలో ఉత్తమ జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మండలాల వారీగా సన్మానించి నగదు పురస్కారాలు అందజేసి ప్రోత్సహిస్తున్నారు. గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన మందులు పంపిణీ చేస్తుంటారు. 
 
ఎన్‌.దేవదాస్‌: దళిత మేధావుల ఫోరం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ఆయన గత పదేళ్లుగా వివిధ కార్యక్రమాల్లో, సదస్సుల్లో ఈ ప్రాంతం అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావనకు తీసుకువస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో మంచి పట్టున్న ఆయన అవకాశం వస్తే ఈసారి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
 
కె.శ్రీనివాస్‌: ఉన్నత విద్యావంతులు. వికాస్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్న ఆయన తెలంగాణ ఉద్యమంలో, వికారాబాద్‌ జిల్లా కేంద్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలోనూ కీలక భూమిక పోషించారు. వికారాబాద్‌ జిల్లా ప్రాంత సమస్యలపైన పోరాడేందుకు ఏర్పాటు చేసిన వికారాబాద్‌ డిస్ట్రిక్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం బాధ్యతలను ఆయన చూసుకుంటున్నారు.

ముఖ్యమైన సంస్థలు, ప్రాజెక్టులు

మోమిన్‌పేటలో నందివాగు, ధారూరు మండలంలో సర్పన్‌పల్లి, మర్పల్లి మండలంలో కొంశెట్‌పల్లి చిన్ననీటి పారుదల ప్రాజెక్టులు ఉన్నాయి.

అభివృద్ధి ప‌థ‌కాలు

మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, రోడ్లు, పాఠశాలల భవన నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. డబుల్‌ బెడ్‌రూం పనులు ఇటీవల కొన్నిచోట్ల ప్రారంభమయ్యాయి.

పెండింగ్ ప్రాజెక్టులు

అనంతగిరిని పర్యాటక ప్రాంతంగా పూర్తి స్థాయిలో తీర్చిదిద్దలేదు. ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ఫలితంగా జంగిల్‌ పార్కు ఇంత వరకు సాకారం కాలేదు. అనంతగిరిలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, వికారాబాద్‌ చుట్టూ రింగ్‌ రోడ్డు, స్టడీ సర్కిల్‌, ఎంఎంటీఎస్‌ వంటి డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి. వికారాబాద్‌ను ఎడ్యుకేషన్‌ హబ్‌గా చేస్తామన్న హామీ నెరవేరలేదు. గ్రామీణ విశ్వవిద్యాలయం, కోల్డ్‌ స్టోరేజ్‌, చక్కెర ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదు. వికారాబాద్‌ విద్యా కేంద్రంగా పేరొందినా ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు మాత్రం నోచుకోలేదు. అయితే ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగానే ఉన్నాయి. ఎడ్యుకేషన్‌, ఐటీ, వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు.

ముఖ్య ప్రాంతాలు

వికారాబాద్‌ పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతగిరి కొండలు తెలంగాణ ఊటీగా పేరొందాయి. ఇక్కడ కొలువుదీరిన శ్రీ అనంత పద్మనాభస్వామి స్వయంభూగా వెలిసారు. ఈ దేవాలయం వేల సంవత్సరాల కిందదని చెబుతున్నారు. మార్కండేయ మహర్షి ఇక్కడే తపస్సు చేశారు. హైదరాబాద్‌ మీదుగా ప్రవహించే మూసీ నది అనంతగిరి కొండల్లోనే జన్మించింది. ముచుకుందుడి పేరుతో ప్రశస్తి పొందిన ఈ నది కాలక్రమేణ వాడుకలో మూసీ నదిగా పేరుగాంచింది. అనంతగిరి అటవీ ప్రాంతంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి, ఏన్కతలలోని శనైశ్చరస్వామి, బండబావిలోని శ్రీఆంజనేయస్వామి, మల్లికార్జునగిరిలోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయాలు ప్రముఖమైనవి.

ఇతర ముఖ్యాంశాలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో వికారాబాద్‌ ప్రాంతం తనకంటూ ఓ ప్రత్యేకతను నిలబెట్టుకుంది. చెన్నారెడ్డి నేతృత్వంలో తొలి విడత ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వికారాబాద్‌ మలి విడత ఉద్యమంలోనూ అంతకంటే ఎక్కువ క్రియాశీలక పాత్ర పోషించింది. ఉద్యమ సమయాల్లో ఎన్నోసార్లు పతాక శీర్షికలకు ఎక్కే సంఘటనలకు వికారాబాద్‌ ప్రాంతం వేదికైంది. వికారాబాద్‌ నియోజకవర్గం నిజాం రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. గతంలో వికారాబాద్‌ అనే గ్రామం లేదు. హైదరాబాద్‌ సంస్థానాన్ని పాలించిన నిజాం ప్రభుత్వంలో 1893 నుంచి 1901 వరకు ప్రధాన మంత్రిగా సేవలందించిన నవాబ్‌ సర్‌ వికార్‌ ఉల్‌ ఉమ్రా బహదూర్‌ పేరిట వికారాబాద్‌ ఏర్పడింది. గంగారం, ఆలంపల్లి, శివారెడ్డిపేట గ్రామాలు క్రమంగా విస్తరించి వికారాబాద్‌గా ఆవిర్భవించింది.
 
నవాబ్‌ సర్‌ వికార్‌ ఉల్‌ ఉమ్రా బహదూర్‌కు వికారాబాద్‌ ప్రాంతమంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అందమైన ప్యాలెస్‌లంటే ఆయనకు ఎంతో ఇష్టం. వికారాబాద్‌ ప్రాంతంలో ఆయన ఎంతో అందమైన ప్యాలెస్‌లు నిర్మించారు. ఆయన నిర్మించిన భవనాల్లో ఒకటైన వికార్‌ మంజిల్‌లో ప్రస్తుతం ఆర్డీవో కార్యాలయం కొనసాగుతోంది. 101 దర్వాజాలు కలిగిన ప్యాలెస్‌గా ఈ భవనం పేరొందింది. వికార్‌ ఉల్‌ ఉమ్రా తన కుమారుడైన నవాబ్‌ సుల్తాన్‌ ఉల్‌ ముల్క్‌ పేరిట సుల్తాన్‌ మంజిల్‌ ప్యాలెస్‌ నిర్మించారు. ఆహ్లాదాన్ని ఆస్వాదించేందుకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వికారాబాద్‌, ధారూరు, అనంతగిరి ప్రాంతంలో తరచూ విడిది చేసేవారు.
 
అనంతగిరి కొండల్లో పర్యటించిన సమయంలో అక్కడి వాతావరణానికి ఆకర్షితుడైన వికార్‌ ఉల్‌ ఉమ్రా ఈ ప్రాంతంలో ఎంతో విలువైన ఔషధ మొక్కలు ఉన్నట్లు గుర్తించి క్షయ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యం చేకూరేందుకు టీబీ శానిటోరియం నిర్మించారు. ఈ ఆసుపత్రి ఉమ్మడి రాష్ట్రానికి చెందిన వారితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన క్షయ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యం చేకూర్చి వారికి పునర్జీవితం ప్రసాదించింది. ఆసియా ఖండంలోనే ఈ ఆసుపత్రికి ఓ ప్రత్యేకత కలిగి ఉంది. అనంతగిరికా హవా .. లాకో మరీజోంకా దవా అన్న నానుడి ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.
 
 

వీడియోస్

ADVT