పుట్టిన తేదీ : 11-11-1953
పుట్టిన స్థలం : గండుగులపల్లి స్వగ్రామం, దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
తల్లిదండ్రులు : తుమ్మల లక్ష్మయ్య, మానిక్యమ్మ(లేటు)
పిల్లలు : కూతుళ్లు: మోహిని, చంద్రిక; కుమారుడు: యుగంధర్‌
విద్యార్హతలు : బీకాం
బంధువులు : వరంగల్‌కు చెందిన రాజ్యసభ సభ్యులు గరికపాటి రాంమోహన్‌రావు (తుమ్మల వియ్యంకులు). ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు.
రాజ‌కీయ ప్ర‌స్థానం >
ఖమ్మం జిల్లా రాజకీయాలలో తుమ్మల నాగేశ్వరరావుకు విశిష్ఠ స్థానం ఉంది. రైతుబిడ్డైన తుమ్మల ఎన్టీఆర్‌ పిలుపుతో తెలుగుదేశంలో చేరి దివంగత ముఖ్యమంత్రి జలగం వెంగళరావు రాజకీయ కోటను ఢీకొన్నారు. వెంగళరావు కుమారుడు జలగం ప్రసాదరావును ఓడించడంతో టీడీపీలో ఆయన కీలక నేతగా ఎదిగారు. మూడు దశాబ్దాలుగా తుమ్మల రాజకీయాల్లో  కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. తెలుగురాష్ట్రాల్లో అత్యధికకాలం మంత్రిగా పనిచేసి ఈయన అరుదైన ఘనత సాధించారు. టీడీపీ స్థాపించిన నాటినుంచి 2015 వరకు ఈయన పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. ఈయన తన అనుచరులను ఎందరినో నాయకులుగా తయారు చేశారు.
 
1982లో భద్రాచలం సమీపంలోని ఎటపాక గ్రామంలో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ సమక్షంలో తుమ్మల సభ్యత్వం తీసుకున్నారు. 1983తొలి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి పోటీ చేసి ఆయన ఓటమి చెందారు. 1985లో మధ్యంతర ఎన్నికలలో గెలుపొందారు. ఎన్టీఆర్ క్యాబినెట్‌లో చిన్నతరహా నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేశారు. తర్వాత 1994, 1999 ఎన్నికలల్లో గెలిచిన తుమ్మల ఎక్జైజ్‌, భారీనీటిపారుదల, ఆర్‌అండ్‌బీ శాఖమంత్రిగా పనిచేశారు.
 
2004 ఎన్నికలలో సత్తుపల్లి నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఖమ్మంజిల్లా టీడీపీ అధ్యక్షునిగా రెండు పర్యాయాలు పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో తనకంటూ మంచిపేరు సంపాదించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఆయన అభిమానులను కూడగట్టుకున్నారు. 2009 ఎన్నికలలో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు.
 
2014 ఎన్నికలలో కూడా ఖమ్మం నుంచే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం చోటుచేసుకున్న రాజకీయ సమీకరణలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. 2014 డిసెంబరు 16న ఆర్‌అండ్‌బీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
 
2016 పాలేరు ఉప ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీచేసి సుమారు 48వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
 
 అభివృద్ధి కార్యక్రమాల్లో పాత్ర
తుమ్మల స్వతహాగా రైతుకావడం, గ్రామీణ రైతు సమస్యలపై, కూలీల సమస్యలపై మంచి అవగాహన ఉండడంతో.. అభివృద్ధి విషయంలో ఇంజనీరింగ్‌ అధికారులకు సైతం తట్టని ఆలోచనలనలతో ప్రతిపాదనలు చేయించి పనులు వేగంగా నిర్వహించడం, అభివృద్ధిని పరుగులు పెట్టించడం ఆయనకే సొంతం. తుమ్మల విజన్‌ను చూసిన ఐఏఎస్‌ అధికారులు, ఉన్నతాధికారులు సైతం ఆయనను మెచ్చుకోక తప్పదు.
 
ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు సరిహద్దున గల చత్తీస్‌ఘడ్‌, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లోనూ అభివృద్ధి వెలుగులు నింపిన ఘనత ఆయనది. మారుమూల గిరిజన గ్రామాల్లో సైతం రహాదారులు, పాఠశాలలు, డ్రెయిన్లు, మంచినీటి పథకాలు, ఇంటింటీకీ పంపులు వంటివి తుమ్మల చొరవతోనే నిర్మించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం అభివృద్ధికి మంత్రిగా తుమ్మల ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మంత్రి తుమ్మల తనదైన శైలిలో నిర్వర్తించిన అభివృద్ధిపనుల వల్ల.. నాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు చేసిన అభివృద్ధిని, వెంగళరావు అనే పేరును కూడా మరిపించారు.
 
మంత్రిగా, రాజకీయ నేతగా ఎంతగా బిజీగా ఉన్నా.. తన వ్యవసాయ క్షేత్రాన్ని నిత్యం సందర్శించడం, వ్యవసాయ పనులను స్వయంగా చూసుకుంటూ ఆదర్శ రైతుగా కూడా తుమ్మల నిలుస్తున్నారు.
 
రాష్ట్రరోడ్లు భవనాలశాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు నియోజకవర్గం ప్రజలపాలిట ఆపరభగీరధుడుగా నిలిచారు. అత్యంత కరువుపీడితప్రాంతమైన పాలేరులో గెలిచిన నాటినుంచి అభివృద్ధిని పరుగులు పెట్టించారు. సుమారు 350 కోట్ల వ్యయంతో భక్తరామదాసు ప్రాజెక్టు నిర్మాంచారు. నియోజకవర్గంలో అన్నిగ్రామాలలో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా భక్తరామదాసు నీరు పారించి చెరువులు నింపడం ద్వారా సాగునీటి సమస్యను తీర్చారు.
 
సుమారు 70వేల ఎకరాలకు నీరందుతుంది. అదేవిధంగా గ్రామాలను, తండాలను కలుపుతు బీటీ రహదారులు మంజూరీ చేయించి నిర్మాంచారు. పాలేరు లాశయం వద్ద మిషన్‌ భగీరధ ప్రాజెక్టు నిర్మాణం పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇదిపూర్తయితే ఎన్నో ఏళ్లుగా ఉన్న తాగునీటి సమస్య తీరనుంది. సుమారు రు.వెయ్యికోట్ల విలువైన ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 
వ్యాపారాలు, ఆస్తులు >
2014 ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారం: గండుగులపల్లిలో ఇల్లు, హైదరాబాద్‌లో ఇల్లు, దమ్మపేట మండలం లింగాలపల్లిలో 30ఎకరాలపొలం, బ్యాంకులో సుమారు రూ.10 లక్షల అప్పు, రెండు లక్షల నిల్వ, భార్య పేరు మీద సుమారు రూ.5లక్షల విలువైన బంగారం, కార్లు ఉన్నాయి. మొత్తంగా రూ. 2కోట్ల 92లక్షల 50వేల విలువైన ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో ధాఖలు చేశారు.
ఆసక్తికర విషయాలు >
రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా రాబట్టగల సమర్ధుడిగా తుమ్మలకు పేరుంది. పాలనాపరంగా ఆయన ఎంత బిజీగా ఉన్నా.. వ్యవసాయంపై దృష్టి సారిస్తునే ఉంటారు. నిత్యం తన వ్యవసాయక్షేత్రాలకు వెళ్తుంటారు.
 
ఆయన కోయబాషను కూడా అనర్గళంగా మాట్లాడుతూ గిరిజనులను సైతం ఆశ్చర్యపరుస్తుంటారు. 60ఏళ్లకోసారి భద్రాచలంలో జరిగే  శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమాన్ని నాడు మంత్రిగా తుమ్మల నిర్వహించారు. అలాగే 12ఏళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు కూడా తుమ్మల మంత్రిగా ఉన్నప్పుడే రావడంతో వాటిని కూడా ఆయన భద్రాచలంలో ఘనంగా నిర్వహించారు.
 
మంత్రి తుమ్మలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న వేలాది మంది నాయకులు, కార్యకర్తలను సైతం పేరుపెట్టి పిలిచేంత జ్ఞాపక శక్తి ఆయన సొంతం.
 
సరదాగా ఉన్నప్పుడు పరిచయస్తులు, స్నేహితులతో  గ్రామాల్లో తిట్టుకునే బూతులను జోకులుగా పేలుస్తారు. అలాగే ఏదైనా విషయం ఉన్నప్పుడు నాయకులు, కార్యకర్తలకు సైతం కన్నుకొట్టి మరీ ఛలోక్తులు విసురుతారు. పక్కన ఉన్న వ్యక్తుల భుజంపై చేయి వేసి మాట్లాడడం ఆయనకు హాబీ.
 
తన గ్రామానికి ఎవరైనా ముఖ్యులు వస్తే వారికి ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేయించి, తానే స్వయంగా వడ్డించే విలక్షణమైన వ్యక్తిత్వం గల వ్యక్తి తుమ్మల.

వీడియోస్

ADVT