పిల్లలు : కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల కవిత
పుట్టిన తేదీ : 17-2-1954
విద్యార్హతలు : లిటరేచర్ ఇన్ మాస్టర్స్ డిగ్రీ
తల్లిదండ్రులు : రాఘవరావు, వెంకటమ్మ
పుట్టిన స్థలం : సిద్దిపేటలోని చింతమడక గ్రామం
రాజ‌కీయ ప్ర‌స్థానం >
కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ స్ఫూర్తితో టీడీపీలో చేరారు. 1983లో టీడీపీ తరపున సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలి ప్రయత్నంలో ఓడిపోయారు. ఆఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌పై కేవలం 879 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన చోటే విజయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్.. అసెంబ్లీని రద్దు చేయడంతో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ టీడీపీ అభ్యర్తిగా అదే సిద్ధిపేటలో కేసీఆర్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మహేందర్ రెడ్డిపై 16,156 ఓట్ల మెజారిటీతో కేసీఆర్ గెలుపొందారు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకపోయింది.
 
1989, 1994, 1999, 2001, 2004 ఇలా వరుసగా ఆరుసార్లు సిద్దిపేట నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ హయాంలో 1987,88 లో కరువుశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1996లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో రవాణా మంత్రిగా, 2000,01 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ శాసన సభా ఉప సభాపతిగా పనిచేశారు.
 
1999 ఎన్నికల వరకు టీడీపీ తరపున పోటీ చేయగా.. 2001 ఏప్రిల్ 27 న హైదరాబాదులోని ‘జలదృశ్యం’ లో టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించారు. 2001లో వచ్చిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి... టీడీపీ అభ్యర్థి మారెడ్డి శ్రీనివాసరెడ్డిపై 23,920 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాతి నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం పలు మార్లు పదవీ త్యాగం చేయడం.. ఉపఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడం కేసీఆర్‌కే చెల్లింది. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎంపీగా, సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా కేసీఆర్ గెలిచారు. దీంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. ఆ స్థానంలో తన మేనల్లుడు హరీశ్‌రావును నిలబెట్టి గెలిపించారు. కరీంనగర్ ఎంపీగా అప్పటి యూపీఏ ప్రభుత్వ హయాంలో టీఆర్ఎస్ భాగస్వామి కావడంతో కార్మికశాఖ మంత్రిగా పదవి చేపట్టారు.
 
అప్పుడు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకపోవడంతో మంత్రి పదవికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మళ్లీ 2006, 08 ఉప ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డిపై తీవ్ర వ్యతిరేకతతో కేసీఆర్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. కానీ ‘టీడీపీ-టీఆర్ఎస్’ కూటమి మాత్రం ఆశించిన ఫలితం రాబట్టలేకపోయింది. ఆ ఎన్నికల్లో వైఎస్ రెండోసారి విజయఢంకా మోగించారు.
 
అయితే అనూహ్య రీతిలో 2009 సెప్టెంబర్ నెలలో హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించారు. ఆ తర్వాత రెండు నెలలకు కేసీఆర్ రాజకీయంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి ‘ఆమరణ నిరాహార దీక్ష’కు దిగారు. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు మద్ధతుగా రోడ్లెక్కారు. తెలంగాణలో ప్రభుత్వ కార్యకలాపాలు కూడా స్థంభించాయి. అప్పటి ముఖ్యమంత్రి కె.రోశయ్య కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో ఎట్టకేలకు కేంద్రం దిగిరాక తప్పలేదు.
 
తెలంగాణ ఏర్పాటులో భాగంగా ‘శ్రీ కృష్ణ కమిటీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో నిరాహార దీక్షను విరమించిన కేసీఆర్.. రాజకీయంగా దేశంలోని ఇతర పార్టీల మద్ధతును సాధించడంలో సఫలమయ్యారు. శ్రీకృష్ణ కమిటీ ‘తెలంగాణ’ వ్యతిరేక నివేదికను ఇవ్వడంతో మరోసారి మలిఉద్యమానికి కేసీఆర్ పావులు కదిపారు. ఈ సారి ‘సకలజనుల సమ్మె’తో రాష్ట్ర ప్రభుత్వాన్ని అతలాకుతలం చేశారు. 42రోజుల పాటు జరిగిన ఆ సమ్మె... తెలంగాణ చరిత్రలో ఓ కీలక మలుపు.. చివరకు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి.. రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
 
ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 సాధారణ ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లాలోని గజ్వేల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఒంటేరు ప్రతాపరెడ్డిపై 19వేల 391 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తద్వారా తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2018 సెప్టెంబరు 6న ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రచారాన్ని నిర్వహించారు. చిట్టచివరిగా తన సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో ప్రచారాన్ని ముగించారు. 2014 ఎన్నికల్లో కేవలం 19,391 ఓట్ల మెజారిటీతో గెలిచిన కేసీఆర్ ఈసారి జరిగిన ఎన్నికల్లో 58,290 ఓట్ల భారీ మెజారిటీని సొంతం చేసుకుని మరోమారు శాసనసభకు ఎన్నికై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 
 
అభివృద్ధి కార్యక్రమాలు:
గజ్వేల్ సీఎం సొంత నియోజకవర్గం కావడంతో అభివృద్ధి పరుగులు పెడుతోంది. మిషన్ భగీరథ కింద 77 వేల కుటుంబాలకు పైపు కనెక్షన్లు రానున్నాయి. దీంతో పాటు 22 కి.మీ మేర రింగ్ రోడ్డు కూడా నియోజకవర్గ ప్రజలకు రానుంది. హార్టికల్చర్ యూనివర్శిటీ, ఫారెస్ట్ కాలేజ్, కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య కొరకు రూ.150 కోట్లతో ఎడ్యుకేషన్ హబ్‌ను ఏర్పాటుచేశారు. 15 టీఎంసీల సామర్థ్యం కలిగిన కొండ పోచమ్మ సాగర్ నిర్మాణం కూడా జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. మేనిఫెస్టోలో పెట్టకుండానే.. ‘రైతుబంధు’ పథకానికి శ్రీకారం చుట్టారు. కల్యాణ లక్ష్మి, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, మిషన్ భగీరథ, పింఛన్లను వెయ్యి రూపాయలకు చేయడం వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. భారీ సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
వ్యాపారాలు, ఆస్తులు >
వ్యాపారాలు: వ్యవసాయంతో పాటు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. క్యాప్సికంను పండించి ఎకరానికి కోటి రూపాయల ఆదాయాన్ని సాధించానంటూ ఆయన అప్పట్లో చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది.
 
ఆస్తులు, అప్పులు: 2014లో ఎన్నికల అఫిడవిట్‌కు సమర్పించిన లెక్కల ప్రకారం కేసీఆర్ ఆస్తులు రూ.17 కోట్లు, అప్పులు రూ.7 కోట్లు.
 
కేసులు: ఉద్యమ సమయంలో కేసీఆర్‌పై చాలా కేసులు నమోదయ్యాయి. 
ఆసక్తికర విషయాలు >
ఇంకా పదవీ కాలం ఉన్నా.. 9 నెలలు ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ప్రత్యర్థులను ఖంగు తినిపించారు.
 
ఎంఏ(తెలుగు) పూర్తికాగానే.. వ్యాపార రంగంలోకి కేసీఆర్ అడుగుపెట్టారు. కార్మికులను గల్ఫ్ దేశాలకు పంపేందుకు హైదరాబాద్‌లో ఓ కన్సల్టెన్సీని ఏర్పాటు చేశారు. అప్పట్లో కేసీఆర్‌కు ‘దుబాయి శేఖర్’ అనే పేరు కూడా ఉంది.
 
కేసీఆర్‌కు సంజయ్ గాంధీ అంటే ఇష్టం. ఎన్టీ రామారావు అంటే చాలా అభిమానం. అందుకే తన తనయుడికి ‘తారక రామారావు’ అని పేరుపెట్టుకున్నానని ఓ ఇంటర్వ్యూలో కేసీఆర్ చెప్పుకొచ్చారు.
 
ప్రత్యర్థులను తికమకటపెట్టే వ్యూహాలు పన్నడంలో సిద్ధహస్తుడు. వ్యూహానికి తగినట్లుగా, పరిస్థితులకు అనుగుణంగా తన గొంతులో గాంభీర్యాన్ని, వెటకారాన్నీ మేళవించి ఎదుటి వారికి చెమటలు పట్టించే విలక్షణ నేత కేసీఆర్.
 
తెలంగాణా మాండలికాన్ని పూర్తిగా ఔపోసన పట్టిన సమర్థుడు. అంతేకాకుండా తన ఉపన్యాసంలో సామెతలు, జాతీయాలను, పద్యాలను మేళవించి ప్రజలను ఉర్రూతలూగించే లక్షణం కేసీఆర్‌లో పుష్కలంగా ఉంది.
 
వీటన్నింటికి మూలం కేసీఆర్‌కి తెలుగు సాహిత్యంపై ఉన్న అభినివేషమే అని అంటుంటారు. కేవలం తెలుగు భాషపై మాత్రమే కాదు, ఏకంగా ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషలపై మాంచి పట్టున్న నాయకుడు. జాతీయ స్థాయిలో రాజకీయాల్లో ఉంటూ సాహిత్య అభిరుచి కలిగిన వారిలో నెహ్రూ, అటల్ బిహారీ వాజ్‌పాయి లాంటి వారైతే, ప్రాంతీయ పార్టీల్లో కేసీఆర్, కరుణానిధిలు కనిపిస్తారు.
 
కేసీఆర్‌కి దైవ భక్తి కూడా మెండుగానే ఉంటుంది. మామూలుగా అయితే రాజకీయ నాయకులు తన మత విశ్వాసాలను బహిరంగ పరచడానికి సాహసించరు. కానీ కేసీఆర్ మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు.
 
యాగాలు చేయడం, గురువులను సేవించడం, గుళ్లకు, గోపురాలకు తిరగడం లాంటివి బహిరంగంగానే చేస్తుంటారు.
 
కేసీఆర్ లో మరో పార్శ్వం కూడా దాగుంది. అదే వ్యవసాయం చేయడం. దీనికి ఏకంగా ఒక ఫామ్ హౌజ్ నే ఏర్పర్చుకున్నారు. రకరకాల రంగుల్లో క్యాప్సికమ్, కీర దోసలను పండిస్తుంటారు. కేవలం పండించడమే కాదు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తుంటారు. మార్కెట్లలో ‘కేసీఆర్ కీర’ అని ఏకంగా పేరే స్థిరపడిపోయింది.
ADVT