మంచి మాటలు వినకపోతే మారణహోమమే
28-05-2018 02:01:53
విద్యాస్వభి వినీతో యుః రాజారాజన్నయానుగః!
సశాస్తి చిరమైశ్వర్యం అరీంశ్చ కురుతేవశే!!
రావణుని భార్య మండోదరి. ఆమె తల్లి తాత మాల్యవంతుడు. రావణుడు చేసిన సీతాపహరణం అధర్మకార్యమని భావించి, రావణుని మంచికోరి హితవచనాలు పలుకుతూ ‘‘రావణా! విద్యలలో ఆరితేరిన రాజు సరియైున రాజనీతి ననుసరించినప్పుడే చిరకాలం విస్తృత ఐశ్వర్యాన్ని పొంది సుఖాలననుభవించి శత్రువులను తన వశం చేసుకొనగలడు’’ అన్నాడు. అంతటి జ్ఞాన వృద్ధుడు, శ్రేయోభిలాషి, అనుభవజ్ఞుడు అయిన ఆయన మాటలనే నిర్లక్ష్యంతో తిరస్కరించిన వ్యక్తి రావణాసురుడు. అటువంటి అధర్మపరుడు ఇతరులు చెప్పిన మాటలు వింటాడా? సీతాదేవిని రామునికి అప్పగిస్తాడా? తమ శ్రేయస్సును కాంక్షించి పెద్దలు మంచిని చెప్పినప్పుడు వినకపోతే అది మహా వినాశనానికి దారితీస్తుందన్న సత్యం రామ కథ చెప్పింది. సీతాపహరణం అధర్మం. ఆ విషయాన్నే హనుమంతుడు రావణునికి చెప్పాడు. రామచంద్రునికి సీతాదేవిని అప్పజెప్పాలని సుగ్రీవుని మాటగా హితవు పలికాడు. ఆ మాటను రావణుడు లెక్కపెట్టక యుద్ధానికే సిద్ధపడి వంశ నాశనానికి కారణమయ్యాడు. సీతాపహరణానికి తనకు తోడ్పడాలని రావణుడు మారీచుడిని అడిగినప్పుడు.. ‘రామునికి అపకారం చేస్తే రాముని బాణాగ్ని జ్వాలలు చుట్టుముట్టి కాలిపోయే లంకను చూస్తావు. ఇందులో సందేహమే లేదు’ అన్నాడు. విభీషణుడు సైతం.. సీతాపహరణం శ్రేయస్కరమైనది కాదని, సీతాదేవిని తిరిగి రాముని వద్దకు పంపాలని సూచించాడు.
‘‘సుఖాన్ని ధర్మాన్ని నాశనం చేసే కోపాన్ని త్యజించి తృప్తినీ, కీర్తినీ పెంచే ధర్మాన్ని పాటించు. బంధు మిత్రాదులతో సుఖంగా జీవిద్దాము’’ అంటున్న తమ్ముణ్ణి నిందించి రావణుడు రాక్షస రాజ్యానికి ముప్పు తెచ్చేపని చేశాడు. చివరకు కుంభకర్ణుడు కూడా సీతాపహరణం తప్పని రావణుడితో అన్నాడు. తన పక్షం వారు, శత్రుపక్షం వారు ఎన్ని చెప్పినా రావణుడు దుర్భుద్ధితో పెడచెవిన పెట్టిన కారణంగా సర్వ రాక్షస జాతి మహా మారణ హోమంలో బలి కావాల్సి వచ్చింది. మంచి చెప్పినప్పుడు వినకపోవడం ఎంతటి ప్రమాదకరమో వాల్మీకి మహర్షి రామాయణంలో ఇలా పలుచోట్ల చెప్పి సమాజానికి సన్మార్గం చూపించాడు.
- గన్నమరాజు గిరిజామనోహర బాబు, 9949013448
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.