ADVT
మహానగరంలో కోరికలు తీర్చే దివ్యక్షేత్రం..
25-05-2018 13:56:14
హైదరాబాద్: కొలిచిన వారి కోరికలు తీర్చే దివ్యక్షేత్రంగా కుత్బుల్లాపూర్‌ నియోజక వర్గంలోని పద్మానగర్‌ ఫేజ్‌-1లోని కల్యాణ తిరుపతి దేవాలయం(శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం) వెలుగొందుతోంది. సుందరధామంగా తీర్చిదిద్దిన ఈ దేవాలయంలో శ్రీవారు దివ్యమంగళ స్వరూపుడై నెలకొని భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నారు. మహిమాన్వితుడైన శ్రీవారిని భక్తులు నిత్యం దర్శించుకొని పూజలు, భజనలతో పరవశించి పోతున్నారు.
 
ఆలయ నిర్మాణం...
శ్రీ వేంకటేశ్వర టెంపుల్‌ సొసైటీ వారు 1998లో సుమారు 1000 చదరపు గజాల స్థలంలో భూమి పూజ చేసి 4 అంతస్థుల ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాటినుంచి పదేళ్లు శ్రమించి 2008 సంవత్సరంలో శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వేంకటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ గావించారు. నాటినుంచి శ్రీవారికి నిత్య పూజలు, అభిషేకాలతో నిరంతరంగా పూజలు జరుగుతున్నాయి. అదే విధంగా ఆ లయం అంచలంచలుగా భక్తుల భాగస్వామ్యంతో అభివృద్ధి చెందుతూ అదనపు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
 
ఆలయ పేరులో విశేషం..
కల్యాణ తిరుపతి అని నామకరణం చేయడానికి సుమారు 500 పేర్లను పరిశీలించామని నిర్వాహకులు తెలిపారు. కల్యాణ అంటే సంక్షేమం, శుభం, వివాహంతో పాటు పలు అర్థాలు వస్తాయి. తిరు అంటే లక్ష్మీదేవి, తిరుపతి (తిరుపతి) అంటే వేంకటేశ్వర స్వామి అనే అర్థాలు ఉం డడం వలన ఆ పేరును ఖరారు చేశశామని సూచించారు.
 
ఆలయ ప్రాంగణంలో బుక్‌స్టాల్‌..
ఆలయంలో ఉన్న బుక్‌స్టాల్‌లో హిందూ మతానికి సంబంధించిన మహా కావ్యాలైన రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీతతో పాటు వివిధ భగవంతుల దేవతా మూర్తుల పూజా విధానాలకు సంబందించిన పుస్తకాలను విక్రయిస్తారు.
 
ఆలయ కమిటీ ఆలోచన..
ఆలయ కమిటీ వారు ప్రతి శనివారం అన్నదానం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఆలయం తరుపున వైద్యశాలను ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకున్నారు.
 
ఆలయంలో నిర్వహించే పూజలు..
వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ధనుర్మాసంలో తిరుప్పావై (గోదాదేవికి ఇష్టమైన పూజ), కుంకుమార్చన, నివేదన, మంత్రపుష్పం, ధూపదీపోత్సవం ఘంటానాదోత్సవం వంటి పూజలు నిర్వహిస్తారు. అదే విధంగా వైకుంఠ ఏకాదశినాడు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశినాడు కుడరై నైవేద్యం ప్రత్యేకం. భోగి రోజు గోదా రంగనాథుల కల్యాణ మహోత్సవం జరుగుతుంది. కార్తీక మాసంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, కార్తీక దీపాలంకరణ, కార్తీక మాసంలో కల్యాణ మహోత్సవం, లక్ష పుష్పార్చన కనకాభిషేకం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు నక్షత్ర హారతి జరుగుతుంది. స్వామి వారి జన్మనక్షత్రమైన శ్రవణనక్షత్రం రోజు మూల విరాట్‌లకు శ్రవణా నక్షత్రాభిషేకం ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం ఉత్సవ మూర్తులకు అభిషేకం జరుగుతుంది. స్వామి వారి కల్యాణం, వినాయక చవితి, బ్రహ్మోత్సవాలు, దేవీ నవరాత్రులతోపాటు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి శనివారం స్వామి వారి సన్నిధిలో అన్నమాచార్య సంకీర్తనలు ధ్యానం చేయబడతాయి. ప్రతి బుధ, ఆదివారాలలో ప్రజలకు సంప్రదాయ సంగీతంపై ఆలయ ప్రాంగణంలో శిక్షణ ఇస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 6.30లకు మహాభారతం, రామాయణం, భాగవతం వంటి మహా కావ్యాల ప్రవచనాలు చెపుతారు.
 
తలనీలాలు..
ఈ ఆలయంలో తిరుపతిలో స్వామి వారికి సమర్పించే విధంగా తల నీలాలను కూడా సమర్పిస్తారు. వీలుకాని, స్తో మత లేని, తిరుపతి వెళ్లలేని భక్తులు మొక్కులను తీర్చుకునేందుకు ఈ ఆలయంలో ముడుపులుగా చెల్లిస్తుంటారు. వృద్ధులు చిన్నపిల్లలు దివ్యాంగుల కోసం ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇటీవల లిఫ్టు సౌకర్యాన్ని కూడా చేపట్టి నిర్మిస్తున్నారు.
 
ఆలయ విశేషాలు..
హైందవ సంప్రదాయం ఉట్టిపడే విధంగా వాస్తుకు అనుగుణంగా ప్రత్యేక ప్రాకారాలతో ఆలయ నిర్మాణం చేశారు. దేవతా మూర్తుల విగ్రహాలను అలిపిరిలో తయారు చేయించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారు అందజేయడం విశేషం. ఈ విగ్రహం సాక్షాత్తు తిరుమల శ్రీవారిని మైమరిపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఆలయ లోగోను ప్రముఖ చిత్రకారులు బాపు రూపొందించి ఆయన సంతకాన్ని కూడా చేశారు.
 
పాద పీఠముల నుంచి కిరీటం వరకు మూలకుబేరుల ఎత్తు వివరాలు...
  • వేంకటేశ్వర స్వామివారు- 9 అడుగుల 3 అంగుళాలు.
  • శ్రీదేవి అమ్మవారు- 7 అడుగుల 8 అంగుళాలు
  • భూదేవి అమ్మవారు- 7 అడుగుల 10 అంగుళాలుగా రూపొందించారు.
కల్యాణ మండప ప్రత్యేకత..
దేవాలయంలో విశాలమైన కల్యాణ మండపం ఉంది. ఈ కల్యాణ మండపం ఒకేసారి సుమారు 4,000 మంది వరకు పట్టే సామర్థ్యం కలదు. దివ్యాంగులకు, పేదవారికి ఈ కల్యాణ మండపాన్ని ఉచితంగా ఇస్తారు. ఇతరులు కల్యాణ మండపానికి ఒక రోజుకు రూ.10000 చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణ మండపం తీసుకొన్న వారు శుభకార్యాలకు కింది, మొదటి అంతస్తులను ఉపయోగించుకోవచ్చు. ఈ కల్యాణ మండపంలో వివాహాలు, నిశ్చితార్థాలు, సత్యనారాయణ వ్రతాలు, అయ్యప్ప స్వామి పడిపూజలతోపాటు హిందూ సంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యానైనా నిర్వహించుకోవచ్చు. అలాగే జన్మదిన వేడుకలను కూడా చేసుకోవచ్చును. కానీ కేక్‌లను మాత్రం కట్‌ చేయకూడదు.
 
శ్రీవారికి సేవలు చేయడం మా పూర్వ జన్మ సుకృతం
శ్రీవారి ఆలయ నిర్మాణ సమయంలో అనేక ఇబ్బందులను, ఆటుపోట్లను ఎదుర్కొన్నాం. సమస్యలన్నింటిని అధిగమించి శ్రీవారి దయతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాం. శ్రీవారి ఆలయం నిర్మించి సేవలు చేయడం మా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాం. భగవంతుని కృప ఉన్నంత వరకు స్వామి వారికి మా శక్తి కొలది సేవలు చేస్తాం. చుట్టు పక్కల ప్రజలతోపాటు ప్రతి వారికి శ్రీవారి కృప కటాంక్ష ఉండాలని ఆశిస్తున్నాము. ఆలయ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతగానో సహకరిస్తుంది.
- వినోద్‌కుమార్‌, ఆలయ కమిటీ అధ్యక్షుడు
Tags : Temple, Hyderabad

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.