ADVT
హరి-హర భేదం ‘వినాశాస్త్రం’
25-05-2018 02:02:05
మాధవో మాధవీశౌద్వౌ సర్వసిద్ధి విధాయినౌ,
వందే పరస్పరాత్మానౌ పరస్పర నుతి ప్రియౌ
 
సంస్కృత భాగవత పురాణ భాష్య ప్రస్తావనలో వ్యాఖ్యాతృ చక్రవర్తి శ్రీధరాచార్యులు రచించిన శ్లోకమిది. ఒకరికొకరు ఆత్మగా ఉన్నవారు, ఒకరి ప్రశంసకు మరొకరు ప్రీతి వహించువారు, భక్తులకు సర్వవిధ సిద్ధులు ప్రసాదించు లోకనాథులైన ఉమానాథ రమానాథులకు నమస్కారమని శ్లోక తాత్పర్యం. ‘శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః’ అని శ్రుతి. శివకేశవులకు అభేదాన్ని చాటింది. హరిహరులు పరస్పర ఆసక్త హృదయులు. ఒకే పరతత్వం శివ, స్కాందాది పురాణాల్లో శివుడుగా, విష్ణుపురాణ, రామాయణ, భాగవతాల్లో విష్ణు, రామ, కృష్ణులుగా.. దేవీ భాగవతంలో ఆదిపరాశక్తిగాను అభివర్ణితమైంది. ‘భక్త చిత్తాను రోధేన ధత్తే నానా కృతీః స్వయం’ భక్తుల భావనకు తగినట్లు ఒకే తత్వం వివిధంగా వ్యక్తమవుతుంది. విశ్వనాథ, జగన్నాథ నామాలే శివ, కేశవులకు అభేదాన్ని చెప్పకనే చెబుతున్నాయి. మౌలికంగా హరిహరులు అభిన్నులైనా సత్వ గుణానికి స్వామి అయిన విష్ణువు సాత్వికుడని, తమో గుణ నియంత అయిన శివుడు తామసుడని చెప్పబడతారు. శివ భగవానుడు తమోగుణాన్ని నియంత్రించేవాడే కానీ తమస్సుకు లొంగేవాడు కాదు. శివకేశవులిద్దరూ స్వరూపతః త్రిగుణాలకు అతీతులే! కృష్ణ యజుర్వేదీయ రుద్ర హృదయోపనిషత్తులో ‘యా ఉమా సా స్వయం విష్ణుః’- ఉమాదేవే విష్ణువని చెప్పబడింది. ‘ఉమా శంకరయోర్యోగః సయోగో విష్ణురుచ్చతే’- శివపార్వతుల యోగమే (కూడిక) విష్ణువుగా వక్కాణింపబడింది. అంతేకాదు, శివకేశవులది అనితరసాధ్యమైన ఉపాస్య-ఉపాసక సంబంధం. ఈ అనుబంధం, ఆత్మీయత అనాది, అనంతమూను. శాస్త్రరీత్యా సత్వగుణం రంగు తెలుపు. తమోగుణం రంగు నలుపు. దీన్నిబట్టి సత్వగుణ విశిష్టుడు విష్ణుమూర్తి తెల్లగాను, తమోగుణ అధిపతి రుద్రుడు నల్లగాను ఉండాలి. అలానే ఉండేవారుట. మరి ఇప్పుడు? అలా లేరే! నళినాయతాక్షుడు నారాయణుడు నీలమేఘ శ్యాముడు. కరుణావతారుడు కపర్తి కర్పూరగౌరుడు. ఈ వర్ణవ్యత్యయానికి రంగుల మార్పునకు కారణమేమిటి? అంటే భాష్యకారులన్నారు.. పరస్పర ధ్యానం వల్ల కలిగిన తన్మయత్వం కారణంగా వారి శరీర ఛాయలు తారుమారైనవిట. ఈ విశ్లేషణ ఎంత స్వారస్యభరితమో అంతే శాస్త్రసమ్మతం కూడా. అలాగే వైష్ణవ తిలకం ఊర్థ్వపుండ్రం త్రిశూలానికి రూపాంతరం అనిపిస్తుందని.. శైవతిలకం త్రిపుండ్రం వైష్ణవ ధనువైన శార్జ్ఞ్గ రూపాన్ని తలపిస్తుందని ధర్మమర్మజ్ఞుల కథనం రసజ్ఞుల విజ్ఞతకు ఇది ఆలోచనామృతం.
 
శ్లో. ఉభయోః ప్రకృతిస్త్వేకా ప్రత్యయభేదేన భిన్నవద్భాతి, కలయతి కశ్చిన్మూఢో హరిహర భేదం ‘వినాశాస్త్రమ్‌’.
 
హరిహరుల ప్రకృతి అనగా తత్వం, ఆ రెండు శబ్దాల మూల ధాతువు (హృ-హరణే) ఒకటే. ప్రత్యయ భేదం (ఇ-అ) వల్ల భిన్నులుగా కనిపించినా అభేద స్వరూపులే. భక్తుల దుఃఖ కారణమైన అజ్ఞానాన్ని హరించువారు కనుక (హరతి ఇతి హరిః, హరతీతి హరః) హరి హరులు. కొందరు మూర్ఖులు మాత్రమే ఆత్మవినాశానికి ఆయుధంగా (వినాశ+అస్త్రం), శాస్త్రవిరుద్ధంగా (వినా+శాస్త్రం) హరిహర భేదం పాటిస్తారు. శాస్త్రాలు, పురాణాల్లో పైపైన విరుద్ధంగా కనిపించే అంశాలను పరిశీలించి, పరిష్కరించి ఏకవాక్యత (సమన్వయము)ను సాధించగలిగే ప్రజ్ఞ లేని వాని శాస్త్రాధ్యయనం వ్యర్థం. కళ్లు లేనివానికి అద్దం ఉన్నా లాభమేముంటుంది? కనుక శాస్త్ర రహస్యాలు, ధర్మసూక్ష్మాలు తెలుసుకుంటే సంకుచితత్వం తొలగి బుద్ధి విశదము, విశాలమూ అవుతుంది. పరమార్థం బోధపడి పరమానందం కలుగుతుంది. హరిహరులయందు అభేద బుద్ధి సకల శుభాలను, ఆయుర్వృద్ధిని కలిగిస్తుందని వేదమంత్రం.. ‘యథాన్తరం నపశ్యామి తథామే స్వస్తిరాయుషీ’
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ, 9866836006

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.