ఆత్మజ్ఞానమే అంతిమం!
24-05-2018 22:44:27
ఎన్ని భోగాలు అనుభవించినా సరే... ‘నిజంగా అనుభవించిన భోగం ఎంత? ఏమిటి? నిజంగా అందులో ఆత్మకు అందింది ఎంత?’ అని కాస్త నిశితంగా ఆలోచిస్తే ఆ భోగం పట్ల విరక్తి వస్తుంది. మనందరికీ భోగాల పట్ల విరక్తి కలిగితే లోకానికి ప్రయోజనం ఏమిటంటే లోకంలో స్వార్థం తగ్గిపోతుంది. ఏదో ఒక చాపల్యానికో, వ్యామోహానికో లోనవడం, ఎవరి ప్రయోజనాలు వాళ్లు చూసుకుంటూ దాన్ని పెంచుకుంటూ పోవడం చేస్తారు.
 
ఆ వ్యామోహాలు తీరిన తరువాత అక్కడి నుంచి గొడవలు మొదలవుతాయి. ఒకరు దాన్ని శాశ్వతం చేసే ప్రయత్నం చేయడం, మరొకరు వ్యతిరేకించడం. ఎందుకంటే మోజు తీరిపోయింది కాబట్టి. ఇక అక్కడి నుంచి హత్యలు, కిరాయి హత్యలు. ఉన్న పదవి కోల్పోయి జైలు పాలు కావడం... అన్నీ చూస్తూనే ఉన్నాం. ‘‘నిజంగా ఈ భోగం ఏమిటి? దీనివల్ల పొందేదేమిటి? ఈ మాత్రం సౌఖ్యం ఇప్పుడున్న వ్యవహారంతో పొందలేమా? ఈ కుటుంబం, ఈ బంధాలు సరిపోవా? అదనంగా అవసరమా?’’ అని ఒక్క క్షణం మనిషి ఆలోచిస్తే, పదవీ భోగాల గురించి ఆలోచిస్తే రాజకీయాల్లో ఇంత దారుణాలు ఉండవు.
 
ఈ అరముష్టి భోగములకింతగ
కొట్టుకపోవుకంటే నీ ఆయతనంబు కనుగొనగ
హాయిగ ప్రాణము వీడుటైన మేలేయనిపించు నమ్మరో
చలింతు, సుఖింతు, ద్రవింతుగానీ
దేవాయ నమఃశివాయ అను భావముతో సరిరావివేవియున్‌!
ఒక వయసులో ఒక భోగమనీ, ఇంకో వయసులో ఇంకో భోగమనీ, డబ్బనీ, కార్లనీ, వస్తువులనీ, అధికారమనీ, పదవులనీ.. ఎప్పటికీ సరిపోవు. ఎన్నటికీ తీరవు. వీటికోసం కొట్టుకుపోవడం కంటే బ్రహ్మజ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది! ఆ ప్రయత్నంలో ప్రాణం పోయినా ఫరవాలేదు. ఏదో చలించిపోవడం, ఏదో సుఖం కోసం వెంపర్లాడటం, అందులో ఏమీ లేకపోయినా అద్బుతం అనడం. అలా ఎన్ని మాటలు చెప్పినా ‘దేవాయ నమఃశివాయ’ అన్న దివ్యనామస్మరణలో మనస్సును ముంచేసి, ఆ ధ్యానంలో మునిగిపోవడమంత గొప్పతనం మరొకటి లేదు. దంపతులు కూడా అంతిమంగా పొందవలసింది ‘ఆత్మజ్ఞానం’ అన్న స్థిరనిశ్చయంతో ఉండి సంసారజీవితం కొనసాగించాలి.
 
 
 
 
- డా. గరికిపాటి నరసింహారావు
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.