ADVT
తలుపులు లేని అమ్మ గుడి!
24-05-2018 22:43:00
ఆ ఆలయానికి తలుపులే ఉండవు.. అర్థరాత్రి, అపరాత్రి తేడా లేకుండా ఎవరైనా ఆ అమ్మవారిని దర్శించుకోవచ్చు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఉన్న చెంగాళమ్మ ఆలయ విశిష్టత అది. ఈ నెల 31 నుంచి అమ్మవారి తిరునాళ్ళకు సూళ్లూరుపేట సంసిద్ధమవుతోంది.
 
గర్భాలయంలో అష్టభుజాలతో మహిషాసురమర్దిని రూపంలో దర్శనమిచ్చే చెంగాళమ్మ పరమేశ్వరి అంటే తెలుగు, తమిళ రాష్ట్రాల ప్రజలకు అపారమైన భక్తి, విశ్వాసాలు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా ఆమెను కొలుస్తుంటారు.
 
ఆలయ చరిత్ర: సుమారు 400 ఏళ్ల క్రితం కలకత్తా- చెన్నపట్నం (ప్రస్తుత చెన్నై) మధ్య ఓ బండిబాట ఉండేది. ఈ దారిలో కాళంగి నది తీరాన శుభగిరి (నేటి సూళ్లూరుపేట) అనే చిన్న గ్రామం ఉండేది. ఒక రోజు పశువుల కాపరులు నదిలో స్నానాలు చేస్తూండగా, ఒక విగ్రహం వారికి లభించింది. అందరూ కలసి ఆ విగ్రహాన్ని గట్టుకు చేర్చేసరికి చీకట్లు ముసురుకున్నాయి. దాంతో ఆ విగ్రహాన్ని అక్కడ నేలపై పడుకోబెట్టి ఇళ్లకు వెళ్లిపోయారు. నదిలో విగ్రహం దొరికిందని గ్రామ పెద్దకు తెలియజేశారు. తెల్లవారిన తర్వాత గ్రామస్తులు నది వద్దకు చేరుకున్నారు గట్టున కాపరులు పడుకోబెట్టిన విగ్రహం దక్షణదిశ వైపుగా నిలబెట్టి ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆ విగ్రహాన్ని గ్రామంలోకి తరలించేందుకు విశ్వప్రయత్నం చేశారు. అది కదలకపోవడంతో అక్కడే దడులు కట్టి నీడ కల్పించారు. కలకత్తా - చెన్నై మార్గంలో సరుకుల బండ్లతో వెళ్లే వ్యాపారులు అక్కడ సేద తీరేవారు. అమ్మవారిని దర్శించుకొని తిరిగి ప్రయాణమయ్యేవారు. కొంత కాలానికి ఆ విగ్రహం చుట్టూ చిన్న గుడి కట్టారు. ఆ గుడికి తలుపులు పెట్టాలని గ్రామస్తులు సంకల్పించారు.
 
వడ్రంగులు తలుపుల కోసం కొయ్యలు చెక్కారు సాయంత్రం కావడంతో ఆలయ ఆవరణలోని ఓ చెట్టుకు ఆసరాగా వాటిని నిలబెట్టి ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ రాత్రి పసుపు ముఖానికి రాసుకొని పెద్ద బొట్టుతో ఓ నిండు ముదుసలి గ్రామపెద్ద కలలోకి వచ్చింది. బండ్లబాట పక్కన ఉన్న తన ఆలయానికి తలుపులు పెట్టవద్దనీ, ఎల్లవేళలా బాటసారులు దర్శించుకొనే వీలు కల్పించాలనీ చెప్పి మాయమైపోయింది. ఏదో కల వచ్చిందనుకొని గ్రామ పెద్ద పట్టించుకోలేదు. తెల్లవారిన తరువాన వడ్రంగులతో కలసి ఆయన ఆలయానికి వెళ్లగా, చెట్టుకు ఆనించి ఉన్న చెక్కలు చిగురులు తొడగడంతోపాటు ఆ చెట్టు మొదల్లో కలసిపోయి ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. రాత్రి వచ్చిన కలను గ్రామపెద్ద తెలపడంతో గ్రామస్తులు ఇది అమ్మవారి ఆదేశమనీ, గుడికి తలుపులు వద్దనీ తీర్మానించారు. ఇప్పటికీ ఈ ఆలయానికి తలుపులు లేవు. నాడు తలుపు చెక్కలు చిగురులు తొడిగిన వృక్షం నేడు మహా వృక్షమైంది. భక్తులతో చెంగాళమ్మ చెట్టుగా పూజలందుకుంటోంది.. సంతానం లేనివారు తమకు పండంటి బిడ్డ కలగాలని వేడుకొంటూ ఈ చెట్టుకు ఊయలలు కడుతుంటారు.
 
ఏడేళ్ళ తరువాత సూళ్లూరుపేట చెంగాళమ్మ తిరునాళ్లు
తిరునాళ్లల్లో సుళ్లు ఉత్సవాలు : అమ్మవారు నది సుడిగుండాలలో ఆవిర్భవించిన నేపథ్యంలో, ఈ ఆలయంలో వీలునుబట్టి 3 లేక 5 లేక 7 సంవత్సరాలకు ఒకసారి తిరునాళ్లు నిర్వహిస్తుంటారు. ‘సుళ్లు’ ఉత్సవాలతో ఈ తిరునాళ్లకు శ్రీకారం చుడుతారు. అమ్మవారికి పసుపు, కుంకుమలతో ఒడిబాలను సమర్పించి సుడిమానుకు కట్టి 9 సార్లు తిప్పుతారు. పూలమాల, రోలు, మేకపిల్ల, చివరగా నిలువెత్తు మనిషి బొమ్మను ఒక్కొక్కటిగా కట్టి సుళ్లు తిప్పుతారు. మూడు రోజులపాటు గొల్లల వీరతాళ్లు, కిలారింపులతో ఈ సుళ్లు ఉత్సవం కోలాహలంగా జరుగుతుంది. రెండోరోజున మహిషాసురునితో అమ్మవారు యుద్ధం చేసి వధించే ఘట్టం ప్రదర్శిస్తారు. నాలుగో రోజు కాళంగినదిలో తెప్పోత్సవం, 5వ రోజు శయనసేవ, 6వ రోజు పుష్పపల్లకీ సేవతో తిరునాళ్లు ముగుస్తాయి. ప్రతి రోజూ రాత్రి అమ్మవారిని ఒక్కోక్క వాహనంపై గ్రామంలో ఊరేగిస్తారు. ఇలా తిరునాళ్లల్లో సుళ్లు ఉత్సవాలు జరుగుతుండటంతో పూర్వం శుభగిరిగా ఉన్న ఈ ఊరును ప్రజలు ‘సుళ్లు ఊరు’గా పిలిచేవారు. సుళ్లు ఊరు సూళ్లూరుగా, ఊరు విస్తరించడంతో సూళ్లూరుపేటగా మారిపోయింది.
 
31 నుంచి తిరునాళ్లు : ఏడేళ్ళ తరువాత ఈ ఏడాది చెంగాళమ్మ తిరునాళ్లు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31న ఇవి మొదలై, జూన్‌ 6వ తేదీ వరకూ జరుగుతాయి.
 
ఎలా వెళ్ళాలి?: నెల్లూరు నుండి 93 కి.మీ., చెన్నై నుండి 80 కిలోమీటర్ల దూరంలో సూళ్లూరుపేట ఉంది. ఇక్కడికి బస్సు, రైలు సౌకర్యాలు విస్తారంగా ఉన్నాయి.
 
 
ఉత్సవ వివరాలు
మే 31వ తేదీ- సుడిమాను ప్రతిష్ఠ, బలిహరణలతో ఉత్సవాలు ప్రారంభం
జూన్‌ 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు - సాయంత్రం నాలుగు గంటలకు సుళ్లు ఉత్సవాలు
జూన్‌ 2వ తేదీ రాత్రి - మహిషాసురమర్దిని ప్రదర్శన
జూన్‌ 4వ తేదీ - తెప్పోత్సవం
జూన్‌ 5వ తేదీ - శయన సేవ
జూన్‌6వ తేదీ - పుష్పపల్లకీ సేవ
 
 
- ఆంధ్రజ్యోతి, సూళ్లూరుపేట

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.