ADVT
క్రైస్తవం ఒక ఆత్మీయ విప్లవం
24-05-2018 22:39:22
దేవుడు ప్రసన్నుడైతే అడిగిన వరాలిస్తాడనీ, తాము ఆశించిన ఆశీర్వాదాలు వచ్చి ఒడిలో పడతాయనీ అంతా భావిస్తారు. కాని సర్వ సృష్టికర్త, పరమదాత అయిన దేవుని ప్రసన్నత ఒక సామాన్య విశ్వాసికి ఎలా లభిస్తుంది? మానవరూపియైున దేవునిగా యేసు క్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో అందుకు సంబంధించిన ఎన్నో మార్గదర్శకాలు కనిపిస్తాయి.
 
దీనులూ, దగాపడ్డవారూ, బలహీనులూ, ఆపదలో ఉన్నవారి ఆక్రందనలకు యేసు ప్రభువు వెంటనే ప్రతిస్పందించేవాడు. అది అర్ధరాత్రైనా, అరణ్యమైనా, ధర్మశాస్త్ర ప్రకారం తాను ప్రతిస్పందించడానికి వీలులేని విశ్రాంతి దినమైనా సరే, యేసు ప్రభువు లెక్క చేసేవాడు కాదు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తన ఏకైక జీవితాశయంగా ఆయన పరిచర్య చేశాడు. రోగిగా పడకకు 38 ఏళ్లు అంటుకుపోయి, స్వస్థత కోసం ఎదురు చూస్తున్న ఒక వ్యక్తిని బేతెస్థ కోనేటి వద్ద యేసు ఒక్క క్షణంలో బాగుచేసి ‘‘నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని వెళ్లు!’’ అని ఆదేశించాడు.
 
అతను స్వస్థత పొంది, లేచి తన పరుపు మోసుకొంటూ ఇంటికి వెళ్ళిపోతుంటే, ‘‘బరువులు మోయకూడని విశ్రాంతి దినం నాడు నీవు పరుపు మోయకూడదు కదా!!’’ అంటూ సనాతన ఛాందస యూదులు అతన్ని విమర్శించారు. (యోహాను 5:5-10).
రోగిగా 30 ఏళ్లుగా అతను మంచాన పడిఉంటే లోకం పట్టించుకోలేదు. కాని యేసు ప్రభువు కృపతో బాగుపడితే మాత్రం సంతోషించేది పోయి, ‘పరుపెత్తుకొని నడుస్తున్నా’వంటూ తప్పు పట్టారు. పైగా విశ్రాంతి దినం నాడు స్వస్థపరిచినందుకు యేసు ప్రభువును కూడా వాళ్లు తూలనాడారు. మనం బాగుపడితే లోకం సంతోషిస్తుందనుకోవడం పెద్ద భ్రమ. అలా చెయ్యడం లోకం డిఎన్‌ఏలోనే లేదు. పైకి సంతోషించినట్టు కనిపించేవాళ్ళు కూడా లోలోపల కుళ్ళుకొనే వాళ్ళే.
 
యూదుల విమర్శలకు ప్రభువు మాత్రం అద్భుతంగా ప్రతిస్పందించాడు. ‘‘నా తండ్రి ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు, ఆయన కుమారుడిగా నేను కూడా ఎప్పటికీ పనిచేస్తూనే ఉంటాను!’’ అన్నాడాయన. మన పరమ తండ్రి నిత్య శ్రామికుడుగా మన క్షేమం కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన పిల్లలైన విశ్వాసులంతా తమ పొరుగువారి మేలు కోసం కష్టపడి పనిచేయడమే దేవుణ్ణి ప్రసన్నం చేస్తుంది. గంటల కొద్దీ ఆరాధనలు, ప్రార్ధనలు చేస్తే, గొప్ప కానుకలిస్తే దేవుడు సంతోషిస్తాడనుకుంటారు చాలామంది. కొందరు పరిచారకులు కూడా ఈ భ్రమలు కల్పిస్తారు.
 
ఆరాధన, ప్రార్థన, కానుకలివ్వడం విశ్వాస జీవితంలో భాగమే అయినా, మన సహాయం అవసరమైన ఒక వ్యక్తి అక్కడ నిస్సహాయునిగా నిలబడి ఉంటే అతన్ని పట్టించుకోకుండా, దాటి వెళ్లి ఇవన్నీ చేస్తానంటే- ఈ ఆత్మీయ డొల్లతనాన్ని దేవుడు హర్షించడు! ఆకలితో అలమటించేవాణ్ణి లోకం పట్టించుకోదు. కాని చర్చి, విశ్వాసి అతన్ని పట్టించుకోని తీరాలి, ‘అదే క్రైస్తవం!’ అంటాడు ప్రభువు (మత్తయి 25:45). కేవలం పాటలు, ప్రసంగాలు, ప్రార్థనలు, మాటలకే పరిమితమైన ‘చేతలులేని క్రైస్తవం’ గాలికి చెదిరిపోయే పొట్టులాగా చేవలేనిది. కుల, మత వివక్ష లేకుండా కనీసం పదిమంది పేదలు, ఆశ్రితులనైనా ఆదుకున్నానన్న తృప్తి లేని జీవితం మనదైతే- స్వపరీక్ష చేసుకోవల్సిందే. కొన్ని చర్చిల్లో ప్రతి ఆదివారం ఆరాధన కాగానే విశ్వాసులందరికీ భోజనాలుంటాయి.
 
విశ్వాసులకు కాదు, చర్చి గేట్‌ బయట కూర్చున్న యాచకులకూ, ఇతర నిరుపేదలకూ భోజనాలు పెడితే అదీ నిజమైన ఆరాధన, బలమైన క్రైస్తవం (1 కొరి 11:22)). ఇంట్లో తినే స్థోమత ఉన్నవాళ్లు చర్చిలో, చర్చి డబ్బుతో ఇలా సుష్టుగా భోంచేయడం అన్యాయం కాదా? చర్చి డబ్బు మీద అధికారం పేదలదీ, సువార్త ఇంకా ఎరుగని వారిదీ కాదా? ఆలోచించండి, క్రైస్తవం మతం కాదు, దేవుడు సంకల్పించిన ఒక గొప్ప ఆత్మీయ విప్లవం!!
 
- సుశీల్‌ సందేశ్‌

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.