ADVT
ఉపవాసాలు ఎందుకు?
24-05-2018 22:38:16
అరబిక్‌ భాషలో ‘రమ్జ్‌’ అంటే కాలడం అని అర్థం. ఈ మాసంలోని నెలరోజుల ఉపవాస దీక్షలో శరీరాన్ని శుష్కింపచేయడం ద్వారా ఆత్మ ప్రక్షాళన అవుతుంది. తద్వారా సర్వపాపాలు సమసిపోతాయి. అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అదుపులో ఉండి మనిషిలో మనో నిగ్రహం ఏర్పడుతుంది. మానవుల్లో ప్రేమాభిమానాలు, క్రమశిక్షణ, కర్తవ్య పరాయణత్వం, సర్వ మానవ సౌభాతృత్వం తదితర ఉత్తమ గుణాలు అలవాటు చేసినందుకు మానవ జాతికి రమ్‌జాన్‌ మాసాన్ని ప్రసాదించాడు.
 
ఉపవాస ఆధ్యాత్మిక లాభాలు:
స్వీయనియంత్రణ: ఉపవాసం వల్ల మనిషి ముఖ్యంగా తనకు తాను నియంత్రణ చేసుకోవాలో, తన కోరికలకు బానిస కాకుండా, మనోవాంఛలకు లొంగకుండా ఉండటమే ప్రఽథమ లక్ష్యం. ఇదే ఉపవాసం చెప్పేపాఠం. తన ఆలోచనలలో ఉండే సారాన్ని గ్రహించి, ఆచరణలో వాటి ఫలాలను అందుకోవడంలో పట్టు సాధించడంలో స్వీయనియంత్రణ చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. శరీరంలోని జ్ఞానేంద్రియాలను మనిషి తన అదుపులో ఉంచుకొనే విధంగా చేయడమే ఉపవాస లక్ష్యం.
 
ఆత్మ నిగ్రహం:
ఉపవాసాల వల్ల మనిషిలో ప్రముఖంగా ఆత్మనిగ్రహం జనిస్తుంది. సాధారణంగా మనిషి తన కోరికలకు బానిసైపోతుంటాడు. అలా వాటికి దాసుడైన వ్యక్తిని, నిజమైన దైవదాసుడిగా మలచడానికి ఉపవాసాలు ఎంతో దోహదపడతాయి. ఈ సమయంలో మనిషి ఎన్నో రకాల ఆశలకు లోనవుతాడు. అయినా సరే, వాటిపై నైతికమైన పట్టు సాధిస్తాడు. తన కోరికలను అదుపులో ఉంచుకోవడం అతనికి అలవాటవుతుంది. మనసు చెడు వ్యసనాల వైపు మళ్లకుండా సునాయసంగా బయటపడగలుగుతాడు. అవసరం ఉన్న చోట సత్పురుషునిలా, మహాత్మునిలా ఉపవాసాలు అతణ్ణి మలుస్తాయి. ఇదే ఉపవాసాల గొప్పదనం.
 
ఆకలి ఎరుకవుతుంది:
‘ఉపవాసం వల్ల ఆకలిదప్పులు ఎలా ఉంటాయో?’ ప్రతి ముస్లింలకు అర్థమవుతుంది. ఆహారం విలువేంటో తెలుస్తుంది. మనం రోజుకు మూడు పూటలా పుష్టిగా భోజనం చేస్తున్నాం, ఎక్కువైతే చెత్తకుప్పల్లో పారేస్తున్నాం కదా! అదే అన్నం దొరకక బీదవాడు ఎలా పస్తులు ఉంటున్నాడో, ఆ ఆకలి బాధేంటో అర్థమవుతుంది. తద్వారా అతనికి సమాజం పట్ల తన బాధ్యత ఏంటో గుర్తిస్తాడు. ఇతరుల పట్ల సహాయగుణం అలవాటుపడుతుంది. దీంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. క్రమశిక్షణ, సమయపాలన, ఉపవాసాలు, దైవధ్యానంవల్ల మనిషిలో సహనం, సమయపాలన ఏర్పడతాయి. సమాజశ్రేయస్సుకు పాటుపడతాడు. ఉపవాసంలో నిష్ఠగా ఉండటం వల్ల ఆత్మపరిశీలన చేసుకుంటాడు. తను చేసే ప్రతి పనికి అల్లాహ్‌ ముందు హాజరైనప్పుడు జవాబు చెప్పవలసి ఉంటుందని గ్రహిస్తాడు.
 
దైవంతో అనుబంధం: ఈ ఉపవాసాలను పాటించడం వల్ల మనిషికి దైవంతో అనుబంధం చాలా పటిష్టమవుతుంది. ‘ఇంత కఠోర ఉపవాస దీక్షను పాటించడం కేవలం దైవం కోసమే కదా! ఆయన ఆజ్ఞ మేరకే కదా! తప్పుడు కోరిక పుట్టిన ప్రతి క్షణం ‘నన్ను దైవం గమనిస్తున్నాడు’ అనే భావన మనిషిని ఆ దైవానికి అతి సమీపంగా చేరుస్తుంది. ఇస్లాంలో సూచించిన ఆరాధనల్లో, మరి ఏ ఆరాధనలో కూడా ఈ విధంగా దైవంతో అనుబంధం బలపర్చుకోవడానికి ఇంతగా దోహదపడదు.
 
- మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.