మంచి లగేజీనా? చెడ్డ లగేజీనా?
19-05-2018 02:53:10
మనం ఎక్కడికైనా నాలుగురోజులు ప్రయాణం పెట్టుకుంటే, వెంట తీసుకువెళ్లాల్సిన సామాన్లు ముందుగానే సర్దుకుంటాం. ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటాం. ఈ ప్రయాణంలో తోడుగా ఎవరైనా బంధుమిత్రులుండవచ్చు. లేకుంటే ట్రెయిన్‌ ఎక్కిన తర్వాత సహప్రయాణికులతో ముచ్చట్లు చెప్తాం. గంటకోసారి యింటికి ఫోన్‌చేసి విషయాలు తెల్సుకుంటాం. ‘‘ఈ చిన్న ప్రయాణానికి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రతివారూ తప్పక ఏదో ఒకరోజు చేయబోయే సుదీర్ఘ ఒంటరి ప్రయాణం గురించి ఆలోచించి ఏర్పాట్లు చేసుకోవద్దా?’’ అంటారు ఆధ్యాత్మిక చింతనాసక్తులు. ఆ ప్రయాణంలో ఎవరూ మనకు తోడుగారారు. ఎప్పుడు వెళ్లాల్సి వస్తుందో తెలియదు. ఆకస్మిక తప్పనిసరి సుదీర్ఘ ఒంటరి ప్రయాణమది. కానీ మనలో చాలామంది ఈ విషయం మనసులోకి వస్తేనే తెగ భయపడిపోతాం. అది మనకు సంబంధించని విషయంలా ప్రవర్తిస్తాం. ఈ ఒంటరి ప్రయాణినికి మన వెంట వచ్చే సామాన్లు రెండే. ఒకటి.. మనం చేసిన మంచిపనులు, పరోపకారం, సత్యధర్మాల అనుష్ఠానం, మనం పెంచుకున్న దైవప్రీతి, పాపభీతి, సంఘనీతి. రెండవది ఇందుకు పూర్తి విరుద్ధంగా అధర్మవర్తన, అన్యాయ అక్రమాలు, పరపీడనం మొదలైనవి. మనం మరల భూమిపై పడి కెవ్వున ఏడ్చేసరికి ఈ రెండు రకాల లగేజీలు మన ప్రక్కన పడి ఉంటాయి. ‘‘ఈ వస్తువు నాదికాదు. ప్రయాణంలో తారుమారు అయినట్టున్నది’’ అంటే కుదరదు. భగవంతుని లెక్క అన్ని వివరాలతో, తేదీలతో సహా వివరంగా ఉంటుంది. అనుభవించక తప్పదు. తప్పించుకొనే అవకాశమే ఉండదు.
 
ఎన్ని చేసిన అవి యన్ని ఎంచి ఎంచి
మంచియైునను చెడుయైున త్రుంచకుండ
బ్రహ్మ మనకిచ్చి పంపెడు బరువు మాల
కర్మలన్నియు చేర్చిన కంఠమాల
అందరం ఈ కంఠమాల ధరించే పుడతాం. మనకు తెలియదంతే. జనన మరణాలు అతి సహజమని.. మంచి, చెడుల ఫలితాల గురించి.. అందరికీ తెలుసు. కానీ ఆచరణలో పెట్టేవారు కొద్దిమందే. ఈ సృష్టిలో మానవజాతికి మాత్రమే జననమరణాల గురించి వివేకం యిచ్చాడు భగవంతుడు. కనుక మనం మంచి లగేజి మనవెంట వచ్చేలా చూసుకోవాలి. చెడ్డ లగేజి రాకుండా జాగ్రత్తపడాలి.
మాదిరాజు రామచంద్రరావు
9393324940
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.