ADVT
బంధం నిలబడాలంటే...
17-05-2018 22:50:00
ఏ సంసారము పట్టుచీర కొసతో ఏనుంగు తోలు కలుపునో
ఏ సంసారము కోడెనాగులిడెనో హీరాంక హారాలుగా
ఏ సంసారమనుగ్రహించె మనకు ఈసార సంసారముల్‌
ఆ సంసారము పార్వతీశ్వరము మీకానందమున్‌ గూర్చుతన్‌
పట్టుచీర ఆవిడ కట్టుకున్నా, ఏనుగు తోలు ఈయన కట్టుకున్నా - ఇద్దరూ హాయిగా ఉన్నారు. మనల్ని ఆశీర్వదిస్తున్నారు. కోడెనాగును ఆయన ఆభరణంగా ధరించినా, రత్నగ్రేవేయ చింతాలోకముక్తాఫలహారాలు ఆవిడ ఆభరణాలుగా ధరించినా - ఇద్దరూ కలిసి ఆనందంగా ఉన్నారు. దేవతల్లో పరమశ్రేష్ఠులై అందరి గౌరవాలు పొందుతున్నారు. ఇప్పటికీ ఏదైనా వివాహ వేడుకలో 80 ఏళ్ల దంపతులు కనిపిస్తే పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు. ముందుగా మీరు ఆశీర్వదించండి అని అంటారు.
 
వివాహానికి ముందే శివుని గురించి పార్వతీ దేవి మాట్లాడుతూ ‘తను ఎలాగైనా ఉండగలడు. బంగారు ఆభరణాలు ధరించగలడు. అవి లేకపోతే పామును ఆభరణంగానైనా ధరిస్తాడు. ఐశ్వర్యం ఉందని కాదు, అందంగా ఉంటాడని కాదు. ఆయన మహాతత్త్వవేత్త. ఆయన ఏనుగు తోలు కట్టుకోనీ, లేక పట్టు వస్త్రాలే కట్టుకోనీ నాకు అభ్యంతరం లేదు. లోకం కోసం విషం కూడా తాగుతాడు. ఆయన త్యాగమూర్తి. ఆయన త్యాగాన్ని చూసి చేసుకుంటున్నా’ అని అంది. కానీ ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో గమనించండి. ఇవ్వాళ కుదుర్చుకుంటున్న సంబంధాల్లో ఐశ్వర్యం, అందం ప్రధానమవుతున్నాయా లేదా? ఇక ఎలా నిలబడతాయి వివాహబంధాలు? అందం, ఐశ్వర్యం కాకుండా సంస్కారం, మానవత్వం ప్రధానమైతే వివాహబంధం నిలబడుతుంది. కష్టాలను తట్టుకుని నిలబడే ధైర్యం అతనికి ఉందా అని ఏ కన్యాదాతైనా ఆలోచిస్తున్నాడా? వరుడు సంస్కారవంతుడా, కాదా? కుటుంబం ఏంటి? వీటన్నింటి గురించి ఆలోచించడం తప్పెలా అవుతుంది!
 
పూర్వం భర్త భార్యను ఆటపట్టించినా, భార్య భర్తను ఆటపట్టించినా చాలా తేలిగ్గా తీసుకునేవారు. పెద్దిభొట్లు అని ఒకాయన ఉండేవారు. ఆయనకు 50 ఏళ్లు. భార్యకు 45 ఏళ్లు. ఒకరోజు పెద్దిభొట్లు భోజనానికి కూర్చున్నారు. భార్య వంగి వడ్డిస్తోంది. పెద్దిభొట్లు ఒకసారి తేరిపార భార్యను చూసి, ‘ఏమోయ్‌! నీ మీద పద్యం చెప్పాలనిపిస్తోంది’ అని అన్నాడు. వెంటనే ఆమె ‘చెప్పండి. మీకు అంతకన్నా చేతనయింది ఏముంది’ అంది భార్య. పద్యం చెబుతాడంటే ఆవిడకీ సరదా!
 
‘తింత్రిణీ దళ విశాల లోచన
నింబ పల్లవ సమాన కుంతల
మేరు మందర సమాన మధ్యమ
పెద్దిభొట్లు గృహిణి విరాజతే’
‘నీ కళ్లు ఎంత విశాలంగా ఉన్నాయంటే చింతాకు అంత విశాలంగా ఉన్నాయి. ముఖం మీదకు పడుతున్న ముంగరులు వేప చిగుళ్ల మాదిరిగా ఉన్నాయి. నీ నడుం చూస్తే మేరుపర్వతాన్ని, మందర పర్వతాన్ని ప్రత్యేకంగా వెళ్లి దర్శించాల్సిన అవసరం లేదు. పెద్దిభొట్లు భార్య ఈ రకంగా ప్రకాశిస్తోంది’ అని అన్నాడు.
 
పెద్దిభొట్లు భార్యకు ఆ పద్యంలోని వ్యంగ్యం అర్థమయింది. వెంటనే మజ్జిగ పోస్తున్న గంటెతో ఒక్కటేసింది. మధ్యాహ్నం భోజనం తరువాత పెద్దిభొట్లు కాసేపు పడుకున్నాడు. సాయంత్రం టీ సమయానికి లేచి భార్యతో ‘అల్లం టీ పెట్టవోయ్‌’ అన్నాడు. భార్య టీ తయారుచేస్తూ మధ్యాహ్నం భర్త చేసిన దెప్పిపొడుపు మరిచిపోలేదు. మళ్లీ పద్యంతోనే సమాధానం చెప్పాలని అనుకుంది. పెద్దిభొట్లు నిలువుటద్దం ముందు నిలుచుని తయారవుతున్నాడు. తలలో తెల్లవెంట్రుకలు నుదురుపై పడుతున్నాయి. భార్య వంటింట్లో నుంచి చూస్తోంది. తెల్లవెంట్రుకలను చూస్తే భార్య ఏదో అనేస్తుందని అనుకుని, ‘ముందే నేనే ఒక మాట అంటే పోలా’ అనుకున్నాడు. వెంటనే...
ఫలితాని ముఖేందు మండలే
శకల నీవవిదొ విభామహే
‘ఏమోయ్‌! అవి తెల్ల వెంట్రుకలు కావు. నా ముఖం చంద్రబింబం. ఆ చంద్రబింబంపైన పడుతున్న వెన్నెల చారికలవి’ అన్నాడు. అప్పుడు భార్య నిజమేనండి అంది. ‘ఏంటి నిజం?’ అని అడిగాడు పెద్దిభొట్లు. ‘ఏంటో మిగిలిన సగం పద్యంలో నేను చెబుతాను’ అంది భార్య.
 
అథయేవ నిమీల్యతే తరాం
తరుణీలోచన పద్మసంతతిః
‘మీ ముఖం చంద్రబింబమే! చంద్రబింబాన్ని చూసి పద్మాలు ముడుచుకుంటాయి కదా! అందుకే మీరు వీధి వెంట వెళుతూ ఉంటే అందరూ మిమ్మల్ని చూడలేక కళ్లు మూసుకుంటున్నారు’ అంది. భార్యాభర్తల మధ్య హాస్యం, అర్థం చేసుకునే విధానం అలా ఉండేది. ఇప్పుడు చెప్పండి! ఆ ఆక్షేపణను ఆవిడ సరదాగా తీసుకుందా లేదా? వేప చిగుళ్లు అన్నాడని ఆవిడ బాధపడలేదే! అందరూ అలా ఉన్నప్పుడే బంధం కలకాలం గట్టిగా ఉంటుంది.
 
 
 
-డా. గరికిపాటి నరసింహారావు

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.