ADVT
స్విచ్‌ మన చేతిలోనే ఉంది!
17-05-2018 22:48:01
ప్రతిచోటా ప్రజలు వారి ఫోన్లకు అతుక్కుపోయి ఉండడం నేను చూస్తున్నాను. సాంకేతికత అనేది మంచిదా లేక చెడ్డదా అనేది ఇక్కడ విషయం కాదు! మనం దానిని ఎలా ఉపయోగిస్తామన్నదే అసలు విషయం. ఈ రోజుల్లో ప్రజలకు వారి ఫోటోలను అందరికీ చూపించుకోవాలనీ, పోస్టు చేయాలనీ ఒక ‘నిర్బంధం’ ఏర్పడి పోయింది. వారికి ఎలాంటి భావాలు కలిగినా సరే, వాటిని వారు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటే ఆలోచనలకూ, భావాలకూ మించిన జీవితానుభవం వారిలో లేదు.
 
నిజానికి, ఇలాంటి చెత్తనంతా వేరేవారితో పంచుకోవడంలో ఎలాంటి ప్రాముఖ్యమూ లేదు. ఒకప్పుడు ప్రజలు వారి నిత్య జీవితంలో జరుగుతున్న విషయాల గురించి డైరీ రాసుకొనేవారు. ఎవరైనా ఆ డైరీ తెరిచి చదివితే, వారి మనసు విరిగిపోయేది. ‘‘నా జీవితం గురించి మీరెందుకు చదివారు..?’’ అన్నట్లుండేది వారి స్పందన. కానీ ఈ రోజుల్లో ప్రతీవారికీ కూడా, వారు పోస్టు చేసిన ఫేస్‌బుక్‌ పోస్టులను ఎవరూ చదవకపోతే గుండె పగిలిపోతుంది. ఎవరో ఒకరు వాటిని చదివి ఇష్టపడాలి. మీ జీవితంలో మీరే మి చేశారు..? మీరెక్కడికి వెళ్లారు..? ప్రతీ క్షణం మీ జీవితంలో మీరేమి చేస్తున్నారన్నది ప్రతి ఒక్కరికీ తెలియాలని అనుకుంటున్నారు. దేనికైతే ప్రాముఖ్యం లేదో దానికి ప్రాముఖ్యం ఇవ్వాలని అనుకుంటున్నారు.
 
ఈ రోజుల్లో మన దృష్టిని మళ్లించే సాధనాలెన్నో ఉన్నాయి- మొబైల్‌ ఫోన్లు, ఫేస్‌బుక్‌, వాట్స్‌యాప్‌... ఇటువంటి స్థితిలో ధ్యానం చేయడమెలా?
నిజానికి, సాంకేతికంగా మనకు సాధికారతను అందించి, మన కార్యకలాపాలను సులభం చేసి, మన జీవనాన్ని మెరుగుపరిచేది ఫోను. దాని సహాయంతో చేయవలసిన పని మీరు తొందరగా చేస్తే ధ్యానానికి ఎక్కువ సమయం లభిస్తుంది కదా!
 
మీకు జ్ఞాపకముందా? రెండు దశాబ్దాల కిందట భారత దేశంలో ఒక లాంగ్‌ డిస్టెన్స్‌ కాల్‌ చేయాలంటే ఎంత కష్టంగా ఉండేదో! తొంభయ్యవ దశకంలో మన ‘ఈశా ఫౌండేషన్‌’ నిర్మాణం ప్రారంభంలో ఉండగా, నేను ఎప్పుడూ ఒక పట్టణం నుండి మరో పట్టణానికి ప్రయాణిస్తూ రోడ్డు మీదే ఉండవలసి వచ్చేది. వారానికొకసారి నేను దేశంలోనూ, విదేశాలకూ యాభై నుండి వంద ఫోన్‌ కాల్స్‌ చేయవలసి వచ్చేది. ‘ఇవ్వాళ ఫోన్‌ కాల్స్‌ చేయాలి!’ అని నేను నిర్ణయించుకున్న తర్వాత ఒక చిన్న పట్టణంలోనో, గ్రామంలోనో ‘ఎస్‌టిడి’ అని రాసి ఉన్న ఫోన్‌ బూత్‌ దగ్గర ఆగేవాణ్ణి. ఆ బూత్‌ యజమానికి ముందే కొన్ని వేలరూపాయలు చేతిలో పెట్టి, తర్వాత ఫోన్‌కాల్స్‌ మొదలు పెట్టేవాణ్ణి. నా కాల్స్‌ పూర్తయ్యేటప్పటికి నా వేళ్లు నొప్పి పెట్టేవి. మరి ఈ రోజుల్లో, అసలు చేత్తో డయల్‌ చేయవలసిన అవసరం కూడా లేదు. పేరు చెప్తే చాలు, ఫోనే కాల్‌ చేసేస్తుంది.
 
ఇటువంటి సౌకర్యాన్ని ఆనందించడానికి బదులు, మీరు ఫిర్యాదు చేస్తున్నారు. అదొక సమస్యగా ఇప్పుడు పరిణమిస్తోందంటే, ఏదైనా చేయడం ప్రారంభించిన తరవాత దాన్ని ఎక్కడ ఆపాలో మీకు తెలియకపోవడం వల్లనే! అవి ఎంత చిన్న పనులైనా సరే! ఉదాహరణకు, మీరు తినడం మొదలుపెడితే ఎక్కడ ఆపాలో మీకు తెలియదు. అసలు సమస్య మనకున్న సౌకర్యాలతో కాదు -మనకు స్పృహ లేకపోవడమే! మన జీవితాలను మెరుగుపరిచే పరిష్కారాలుగా ఉండవలసిన విషయాలను మన అజ్ఞానం వల్ల సమస్యలుగా మార్చుకుంటున్నాం.
 
‘వాట్స్‌యాప్‌ నిరంతరం మోగుతూ ఉంటే కదలకుండా కూర్చోవడం సాధ్యమా?’ అన్నది మీ ప్రశ్న! ఇది సాధ్యమే. మీరు ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయవచ్చు. మీ జోక్యం లేకుండా ప్రపంచం ఎంతో చక్కగా నడుస్తుంది. మీరు మీ ఫోన్‌ ఆపివేస్తే ఈ విషయం మీకు ఇప్పుడే అర్థమవుతుంది. మీరిది అర్థం చేసుకుంటే మరింత అర్థవంతంగా చాలా పనులు చేస్తారు. మీరు ప్రపంచంతో ఎక్కువ జోక్యం చేసుకోకుండా ఉంటే, ప్రజలు మీరున్నందుకు సంతోషిస్తారు. మీరు అతిగా జోక్యం చేసుకుంటూ ఉంటే, మీరు మరణించినప్పుడు సంతోషిస్తారు. ప్రజలు పండుగ చేసుకునేందుకు మీరు చనిపోయే వరకూ ఎదురుచూడాలా? లేక ఇప్పుడే సంతోషాన్ని వ్యాపింపజేయాలా? దేన్ని ఎంచుకుంటారో మీ ఇష్టం!
 
 
 
-సద్గురు జగ్గీ వాసుదేవ్‌

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.