అదే అసలైన యోగం
15-02-2018 00:24:22
‘షిర్డీ సాయిబాబా స్వయంగా గొప్ప యోగి అయినా.. తన భక్తులకు యోగమార్గాన్ని అనుసరించమని ఎందుకు చెప్పలేదు?’ అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. దీనికి సమాధానం కూడా సాయి జీవితంలోనే ఉంది. శ్రీ సాయి సచ్చరిత్రను చదివితే.. బాబాకు అన్ని రకాల యోగాల గురించి తెలుసని, ఆయన హఠయోగి అని అర్థమవుతుంది. కఠినమైన ఈ హఠయోగాన్ని సాధన చేయాల్సిందిగా బాబా ఎప్పుడూ తన భక్తులకు చెప్పలేదు సరికదా.. కఠినమైన యోగ పద్ధతులను వ్యతిరేకించారు కూడా. తనతో మమేకం అయిపోవడమే అసలైన యోగమని బాబా చెబుతుండేవారు. ఇలా మమేకం కావడానికి బాబా రెండు మార్గాలను సూచించారు.
 
వాటిలో మొదటిది.. ఆయన భౌతిక రూపంతో మమేకం కావడం. ఇది ఒకస్థాయిలో ఉన్న భక్తుల కోసం. ఇక రెండోది.. అనిర్వచనీయమైన బాబా రూపాన్ని ఊహించుకుని ఆరాధించడం. ఇది ఏకాగ్రత ఎక్కువగా ఉన్న భక్తుల కోసం. తేనే పట్టు నుంచి తేనెను తీయడం ఒక ప్రక్రియ. ముందుగా కట్టెలను తీసుకువచ్చి.. తేనె పట్టు కింద పొగ పెట్టాలి. అప్పుడు దానిలో ఉన్న తేనెటీగలు పారిపోతాయి. ఆ తర్వాతే మనంతేనెను తీసుకుని ఆస్వాదించగలుగుతాం. మన జీవితాలూ తేనె తుట్టెలాంటివే. మన పూర్వకర్మలు, అజ్ఞానం, అహంకారం, ప్రతికూల ఆలోచనలు ఇవన్నీ తేనెటీగల్లాంటివి. వీటిని తరిమివేయడం అంత సులభం కాదు. వీటిని తరిమినప్పుడే మోక్షమార్గం ప్రత్యక్షమవుతుంది. అందువల్ల మనం ముందుగా జ్ఞానమనే అగ్నితో మనని మనం పునీతులను చేసుకోవాలి. ఈ జ్ఞానాగ్నితో పరిశుద్ధుడైన వ్యక్తి మోక్షమార్గానికి అర్హుడు. ఈ ప్రక్రియల్లో భగవంతుడితో మమేకమైతే మోక్షం చాలా సులభమవుతుందని బాబా చెప్పేవారు. అందుకే బాబా కఠినమైన యోగ ప్రక్రియలను ఎపుడూ భక్తులకు భోధించలేదు.
 
- డాక్టర్‌ భానుప్రకాష్‌ సత్పతి
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.