క్షమే సత్యం.. క్షమే ధర్మం
14-02-2018 01:10:53
సహించడం సహనం. అది మనసుకు సంబంధించింది. క్షమించడం ఔదార్యం. అది హృదయానికి సంబంధించిన విషయం. క్షమ మనసును శాంతిధామం చేస్తుంది. మహాభారతంలో ఒక ఘట్టం దీన్నే ఆవిష్కరిస్తుంది. ఆ సన్నివేశంలో ద్రౌపది క్షమాస్వరూపిణి. దుర్యోధనుడికి సంతోషం కలిగించడం కోసం.. అశ్వత్థామ నిదురపోతున్న ఉపపాండవులను సంహరిస్తాడు! అర్జునుడు అశ్వత్థామను బంధించి.. ద్రౌపది వద్దకు తీసుకొస్తాడు. అప్పుడామె.. ‘‘నీ హృదయంలో లేశమైనా కరుణ లేదే! మా మగవారంతా నీ తండ్రి ద్రోణుని వద్ద విద్య నేర్చుకున్నారు. శిష్య సంతతిని ఎట్లా వధించావు? అందునా వారు పసివారు. పగవారు కాదు. నిద్రలో ఉన్నారు. నిరాయుధులు. ఇప్పటికే నీ తండ్రిని యుద్ధంలో కోల్పోయి, నీ తల్లి తీవ్ర దుఃఖంలో ఉన్నదే! ఒక్కసారి ఆలోచించు.
 
ఈ క్షణంలో భీమార్జునులు నిన్ను చంపితే, నీ తల్లి పుత్ర శోకాన్ని భరించగలదా’’ అంటూ హితవు పలుకుతుంది. ఆవేశంతో రగిలిపోతున్న భీముడికి.. గురుపుత్రుణ్ని చంపడం తగదని ధర్మ ప్రభోధం చేస్తుంది. అతడిని చంపవద్దని అర్జునుణ్ని కోరుతుంది. పుత్రశోకాన్ని అధిగమించి, హంతకుడు తన ఎదురుగానే ఉన్నా ఇంతటి క్షమను ప్రదర్శించటం సాధ్యమా! సాధ్యమేనని ఈ వృత్తాంతం బోధిస్తున్నది. చరిత్రను తిరగేసి చూస్తే ఏ సమాజమూ మహాత్ములను ప్రశ్నించకుండా, పరీక్షించకుండా, అవమానించకుండా, దూషించకుండా, హింసించకుండా వదిలి పెట్టలేదు. అయినా వారి సహజసిద్ధమైన క్షమాగుణంతో, సహనశీలతతో అన్నిటినీ భరించారు. మానవ సమాజానికి దివ్య ప్రబోధం చేశారు. క్షమ సమాజానికి రక్ష. వ్యక్తికి సంరక్ష. అనుభవించ గలిగితే, క్షమే సత్యం! ఆచరించ గలిగితే, క్షమే ధర్మం!
 
- వి.యస్.ఆర్‌.మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.