హఫీజ్ సయీద్‌‌పై ఉచ్చు బిగిస్తున్న పాక్
13-02-2018 14:39:43
ఇస్లామాబాద్ : అంతర్జాతీయ ఒత్తిళ్ళకు పాకిస్థాన్ తలొగ్గక తప్పడం లేదు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిషేధించిన వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకోవలసిన పరిస్థితులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో యాంటీ టెర్రరిజమ్ యాక్ట్‌‌ సవరణ ఆర్డినెన్స్‌కు పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేనీ ఆమోదం తెలిపారు.
 
ఈ ఆర్డినెన్స్ అమల్లోకి రావడంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిషేధం విధించిన పాకిస్థాన్‌ వ్యక్తులు, సంస్థలపై చర్యలు తీసుకునే అధికారం పాకిస్థానీ అధికారులకు లభించింది. బ్యాంకు ఖాతాల స్తంభన, కార్యాలయాల మూసివేత వంటి చర్యలు తీసుకోవచ్చు. 2008 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌తోపాటు అతని ఆధ్వర్యంలోని జమాత్ ఉద్ దవా, లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థలపై కూడా చర్య తీసుకునే అవకాశం ఉన్నట్లు పాక్ మీడియా తెలిపింది. అల్ ఖైదా, తాలిబాన్ వంటి ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ గడ్డపై ఉన్నాయన్న సంగతి ప్రపంచానికి తెలుసు.
 
పాకిస్థాన్ హోం మంత్రిత్వ శాఖ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సమన్వయంతో కృషి చేసి, ఉగ్రవాదంపై చర్యలకు ఉపక్రమిస్తున్నారని ఆ దేశ జాతీయ కౌంటర్ టెర్రరిజం అథారిటీ వర్గాలు తెలిపాయి.
 
మనీలాండరింగ్, ఉగ్రవాదులకు నిధులను సమకూర్చడం వంటి నేరాలను నియంత్రించేందుకు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పాటైంది. ఈ వ్యవస్థ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుండటంతో పాకిస్థాన్ ఈ ఆర్డినెన్స్‌ తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
Tags : Hafiz Saeed, Pakistan, Mumbai, MAMNOON HUSSAIN
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.