మంగళగిరి: టీడీపీ చేనేత విభాగం రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశం ఈ నెల 15వ తేదీ ఉదయం మంగళగిరి తెనాలి రోడ్డులోని మార్కండేయ కల్యాణ మండపంలో జరుగుతుందని చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నాగేశ్వరరావు తెలిపారు. మంగళగిరిలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ నిమ్మల కిష్టప్ప అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో టీడీపీ ప్రభుత్వం అమలు పరుస్తున్న చేనేత సంక్షేమ పథకాలు, రుణమాఫీ, క్లస్టర్లు, చేనేత పింఛన్లు, సహకార సంఘాల ఆర్థిక స్థితిగతులపై అభిప్రాయ సేకరణ ఉంటుందని చెప్పారు.
చేనేత మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, ఆప్కో చైర్మన్ గుజ్జల శ్రీనివాస్, ఎమ్మెల్సీ పోతుల సునీత, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పంచుమర్తి అనురాధ, మాజీమంత్రి మురుగుడు హనుమంతరావులతోపాటు 13 జిల్లాల నుంచి చేనేత ముఖ్య ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. సమావేశంలో నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గంజి చిరంజీవి, చేనేత విభాగం రాష్ట్ర ప్రచార కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు, చేనేత విభాగం నాయకులు కొల్లి మాణిక్యాలరావు, వానపల్లి త్రిమూర్తులు, నందం అబద్ధయ్య, మునగపాటి వెంకట మారుతీరావు, జంజనం వెంకట సుబ్బారావు, తిరువీధుల బాపనయ్య తదితరులు పాల్గొన్నారు.