ADVT
యూజీసీ ప్రతిపాదనలు
13-02-2018 00:56:10
ఉన్నత విద్యారంగాన్ని ప్రక్షాళించే దిశగా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) చేస్తున్న ప్రయత్నం అభినందించదగినది. వర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థల్లో బోధన సిబ్బంది నియామకాలకు సంబంధించి యూజీసీ మార్గదర్శకాలు రూపొందించింది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు పీహెచ్‌డీని తప్పనిసరి చేయడంనుంచి వివిధ ఉద్యోగాల భర్తీలోనూ, పదోన్నతుల్లోనూ పాటించాల్సిన నియమాలను, పరిగణనలోకి తీసుకోవాల్సిన అర్హతలను యూజీసీ ఈ ముసాయిదాలో సూచించింది. ముసాయిదాను తన వెబ్‌సైట్‌లో ఉంచిన యూజీసీ, ఈ నెల 28లోగా వర్సీటీలు, కాలేజీలనుంచి అందిన సూచనలు, అభిప్రాయాలమేరకు మార్పు చేర్పులు చేసి తుదిమార్గదర్శకాలను విడుదల చేస్తానని చెబుతున్నది.
 
‘యూజీసీ డ్రాఫ్ట్‌ రెగ్యులేషన్స్‌ ఆన్‌ మినిమమ్‌ క్వాలిఫికేషన్స్‌ ఫర్‌ అపాయింట్‌మెంట్‌ ఆఫ్‌ టీచర్స్‌ అండ్‌ అదర్‌ ఎకడమిక్‌స్టాఫ్‌ ఇన్‌ యూనివర్సిటీస్‌ అండ్‌ కాలేజెస్‌, అండ్‌ మెజర్స్‌ ఫర్‌ ది మెయింటెనెన్స్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్‌ ఇన్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌–2018’ అనే సుదీర్ఘమైన శీర్షికతో ఈ ముసాయిదా అందుబాటులో ఉన్నది. ఉన్నత విద్యారంగంలో బోధనా ప్రమాణాలు దిగజారిపోతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, వాటిని నిలబెట్టడమే లక్ష్యంగా మార్గదర్శకాలను రూపొందించినట్టు యూజీసీ చెబుతున్నది. ఇప్పటివరకూ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులో నియామకం కోసం అభ్యర్థికి నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) లేదా స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సెట్‌) లేదా పీహెచ్‌డీ ఉంటే సరిపోయేది. 2021జులై  తరువాత చేపట్టబోయే నియామకాలకు నెట్‌ లేదా సెట్‌తో పాటు పీహెచ్‌డీ కూడా తప్పనిసరిగా ఉండాలని యూజీసీ అంటున్నది. జ్ఞాపకశక్తికి ప్రాధాన్యం ఇచ్చే అర్హత పరీక్షలతో పాటు పరిశోధన జ్ఞానానికి కూడా పెద్ద పీట వేయాలన్నది యూజీసీ ఆలోచన కావచ్చు. ఈ అర్హత పరీక్షల్లో ఏదో ఒకదానిని దాటుకొచ్చేవారి సంఖ్యతో పోలిస్తే, పీహెచ్‌డీలు పూర్తిచేసిన వారి సంఖ్య స్వల్పంగా ఉన్నది కనుక నియామకాలపై ఈ ప్రతిపాదన ప్రభావం అధికంగానే ఉంటుందని విద్యారంగ నిపుణులు అంటున్నారు. సీనియర్‌ ప్రొఫెసర్‌, ప్రొఫెసర్‌, అసోసియేట్‌, ప్రిన్సిపాల్‌ ఇత్యాది పోస్టుల భర్తీలో, పదోన్నతిలో పరిగణనలోకి తీసుకోవాల్సిన అర్హతలు, పాటించాల్సిన నియమాల విషయంలోనూ యూజీసీ కొన్ని ఆంక్షలు ముందుకు తెచ్చింది. కనీస పనిదినాలు, రోజువారీ పనిగంటలు, సెలవులు, అకడిమిక్‌ అంశాలకు సంబంధించిన యూజీసీ ఆలోచనలను అటుంచితే, ఒక విద్యాసంస్థలో మంజూరైన మొత్తం పోస్టుల్లో తాత్కాలిక అధ్యాపకులు పదిశాతానికి మించకూడదన్న నియమం విశేషమైనది. అలాగే, ఏ పేరుతో పిలుస్తున్నప్పటికీ ఈ తాత్కాలిక అధ్యాపకులకు రెగ్యులర్‌ అధ్యాపకులతో సమానంగా వేతనాలు ఇవ్వాల్సిందేనన్న నియమం ప్రశంసించదగినది.
 
యూనివర్సిటీల్లోనూ, కాలేజీల్లోనూ కాంట్రాక్టు ఫ్యాకల్టీయే అత్యధికశాతం ఉన్న వాతావరణంలో యూజీసీ నిబంధనలు వాటికి పెద్ద పరీక్షే. ప్రభుత్వాల పుణ్యమాని 60నుంచి 70శాతం వివిధస్థాయి అధ్యాపక పోస్టులు భర్తీకాకుండా ఖాళీగా మిగిలిన స్థితిలో, వేర్వేరు పేర్లతో కాంట్రాక్టు ప్రాతిపదికన దశాబ్దాలుగా పనిచేస్తున్న అధ్యాపకులే అధికం. రెగ్యులర్‌ సిబ్బందితో సమానంగా పనిచేస్తున్నా, పేరు కారణంగా తాము నామమాత్రపు వేతనాలతో దినసరి కూలీలుగా మిగిలిపోతున్నామన్నది వారి వేదన. ఇకపై వీరి సంఖ్య 10శాతానికి మించకూడదన్న నియమం, సమానవేతనాలన్న యూజీసీ ప్రతిపాదన కచ్చితంగా వీరికి న్యాయం చేకూరుస్తుంది. అయితే, భవిష్యత్‌ నియామకాలకు హేతుబద్ధతనూ, న్యాయాన్నీ చేకూర్చే ఆలోచన చేస్తున్న యూజీసీ, దశాబ్దాలుగా కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వారి విషయంలో దృష్టిపెట్టినట్టు లేదు. బోధనానుభవం విస్తృతంగా ఉన్న తమను రెగ్యులర్‌ చేయాలంటూ కాంట్రాక్టు అధ్యాపకులు ప్రభుత్వాలకు మొరబెట్టుకోవడం, వేర్వేరు కారణాల రీత్యా వారి కోరిక నెరవేరకపోవడం చూస్తున్నదే. కొన్ని రాష్ట్రాలు రెగ్యులర్‌ నియామకాలు చేపట్టే ప్రయత్నం చేసినప్పుడల్లా కాంట్రాక్టు అధ్యాపకులు న్యాయస్థానాలను ఆశ్రయించడం, ఆ ప్రక్రియ తాత్కాలికంగానైనా నిలిచిపోతుండటం జరుగుతున్నదే. ఉన్నత విద్యారంగాన్ని ప్రక్షాళించాలన్న సంకల్పం ప్రశంసించవలసిందే కానీ, దశాబ్దాలుగా దానిని అధ్వాన్నస్థితిలోకి నెట్టివేసిన నేపథ్యంలో, అది మరింత లోతుగా జరిగినప్పుడే అసలు లక్ష్యం నెరవేరుతుంది.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.