గంగమ్మకు అంత శక్తి ఎలా వచ్చింది?
11-02-2018 03:06:05
మన సనాతన ధర్మంలో నదులు ప్రముఖమైన విశేషాన్ని పొంది ఉన్నాయి. మనమేదైనా పూజ చేయాలంటే మొదట కలశారాధన పేరుతో నదులను నీటిలోకి ఆవాహన చేస్తాం. పవిత్రమైన వస్తువు గురించి చెప్పవలసి వస్తే.. గంగ అంత పవిత్రం అంటారు. గంగ సంబంధం, స్పర్శ లేకుండా ఏ పురాణం, కావ్యం కనపడవు. గంగ స్నానం, సంప్రోక్షణ, దర్శనం, గంగనామం, స్మరణం అంత గొప్పవిగా కీర్తించబడ్డాయి. అంత శక్తి గంగకు ఎలా వచ్చింది? పాపాలెందుకు పోగొట్టగలిగింది? వాల్మీకి మహర్షి ఈ రహస్యాన్ని చెప్పారు. గంగ త్రిపథగామ్‌.. అంటే మూడు లోకాలలో ప్రవహించగలిగిన శక్తి కలది. ఆమె హిమవంతుని పెద్ద కూతురు.
 
పార్వతీదేవి అక్క. దేవతల కోరిక మేరకు స్వర్గానికి వెళ్లిన గంగను.. సగర పుత్రులకు ఉత్తమ గతి కలిగించేందుకు భువికి తీసుకొచ్చేందుకు భగీరథుడు పరమశివుని కోసం ఘోర తపస్సు చేశాడు. గంగను జటాజూటంలో ఒడిసిపట్టిన పరమశివుడు.. భగీరథుని అనుగ్రహించి గంగను విడిచిపెట్టగా ఏడు పాయలుగా ప్రవహించింది. శివుడి పాదాలు కడుగుతూ దిగిన పాయ.. భగీరథుని వెంట వెళ్లి భాగీరథి పేరుతో హిమవత్పర్వత ప్రాంతం నుంచి ప్రవహించింది. పరమశివుడి శరీరాన్ని తాకి వచ్చింది కనుక గంగకు అంత శక్తి అని వాల్మీకి మహర్షి చెప్పారు. శివశరీరాన్ని తాకి కింద పడింది కాబట్టి ఆ గంగకు జనుల సమస్త పాపాలనూ తొలగించగలిగిన శక్తి కలిగిందన్నారు. గంగ స్వర్గలోకంలో మందాకినిగా, భూలోకంలో భాగీరథిగా, పాతాళంలో భోగవతిగా ప్రవహిస్తుంది కాబట్టి త్రిపథగ సార్థకం అయ్యింది.
 
-చాగంటి కోటేశ్వరరావు శర్మ
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.