ప్రభుత్వ కాలేజీలకు మొండిచేయి
10-02-2018 03:19:06
  • పీజీ సీట్ల పెంపులో రాష్ట్రానికి నిరాశ 
అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల పెంపు విషయంలో ఏపీకి కేంద్రం తీవ్ర నిరాశ మిగిల్చింది. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో రాష్ట్రానికి పీజీ సీట్లు పెంచుతుందని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు భావించారు. కానీ, మెడికల్‌ పీజీ సీట్ల పెంపు విషయంలో కేంద్రం మొండి చెయ్యి చూపించింది. కేవలం నాలుగు ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని వివిధ విభాగాల్లో 32 పీజీ సీట్లు మాత్రమే పెంచింది. రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఏ కాలేజీకీ ఒక్క సీటు కూడా పెంచలేదు. మరోవైపు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ఈ ఏడాది సుమారు 150 నుంచి 200 సీట్లు కావాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. వీటికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.122 కోట్ల నిధులు కూడా కేటాయించింది. గత ఏడాది 11 మెడికల్‌ కాలేజీలకు కలిపి 137 పీజీ సీట్లను ఎంసీఐ పెంచింది. ఈసారి కనీసం 50 నుంచి 60 సీట్లు పెరుగుతాయని అధికారులు భావించారు.
 
అవకాశం ఉంది..!
ఎంసీఐ తీసుకున్న నిర్ణయం వల్ల ఆరోగ్యశాఖ ఆశ చావలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీతో, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను పొల్చాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. అయితే, ఉన్నతాధికారులు చెబుతున్న స్థాయిలో కేంద్రం రాష్ట్రంపై సానుకూలంగా లేదని తెలుస్తోంది. గత నెల 15న రాష్ట్రంలోని ఆన్ని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లతో ఎంసీఐ ఉన్నతాఽధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కూడా రాష్ట్రం పట్ల సానుకూలత కనిపించలేదు. మరోవైపు సమావేశం ముగిసి 25 రోజుల తర్వాత ఎంసీఐ ప్రైవేటు కాలేజీలకు సీట్లు పెంచింది.
సీట్లు పెరిగిన కాలేజీలు ఇవే..
ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో 4, నెల్లూరు నారాయణ మెడికల్‌ కాలేజీలో రెస్పిరేటరీ మెడిసిన్‌లో 2, గైనిక్‌ విభాగాలో 6, అనస్థీషియా 4. కోనసీమ మెడికల్‌ కాలేజీలో గైనకాలజీ విభాగంలో 2, అనస్థీషియాలో 5, సైకియాట్రిలో 2, రాజమండ్రి జీఎ్‌సఎల్‌ మెడికల్‌ కాలేజీలో జనరల్‌ సర్జరీలో 7 సీట్లు పెరిగాయి.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.