ADVT
కబ్జా చెరలో రెండు ఊర్లు
10-02-2018 03:07:55
  • వందల ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం.. ఎక్కడికక్కడ ప్లాట్లు
  •  బహదూర్‌గూడ, ఘన్సీమియాగూడలో భూ సర్వేకు బ్రేక్‌
  •  రైతులకు కొత్త పట్టాదారు పాసుబుక్‌లు లేవు..
  •  పంట రుణాలు, సబ్సిడీ విత్తనాలు రావని రైతుల ఆందోళన
శంషాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 9: దాదాపు నెలరోజుల్లో రాష్ట్రంలోని రైతులందరికీ కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు రానున్నాయి! ఆ రెండు గ్రామాల్లో మాత్రం ఈ పంపిణీ ఉండదు. ఆ మాటకొస్తే ఆ గ్రామాల్లో అధికారులు భూ సమగ్ర సర్వేనే జరపలేదు. ఎందుకంటే.. ఆ ఊర్లలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఎప్పుడో కబ్జా కోరల్లోకి వెళ్లిపోయింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పరిధిలోని బహదూర్‌గూడ, ఘన్సీమియాగూడలో నెలకొన్న పరిస్థితి ఇది. బహదూర్‌గూడలో సర్వే నంబర్లు 28, 62లో దాదాపు 1,250 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 650 ఎకరాలను అక్రమార్కులు కబ్జా చేశారు. ఎక్కడికక్కడ ప్లాట్లు చేసి విక్రయించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు ఆ భూములను తమ ఆధీనంలోకి తీసుకుని బోర్డు పెట్టారు. ఘన్సీమియాగూడలో సర్వే నంబరు 3, 4లో వంద ఎకరాల ప్రభుత్వ భూమిని గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ కొనుగోలు చేశారని రైతులు ఆందోళన చేశారు. దీంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆ రెండు గ్రామాల్లో సమగ్ర భూ సర్వేను అధికారులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో తమకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు రావని తెలిసి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టా పాస్‌ పుస్తకాలు లేకపోతే.. బ్యాంకు రుణాలు, సబ్సిడీ విత్తనాలు తమకు అందవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘన్సీమియాగూడలో గోల్డ్‌స్టోన్‌ ప్రసాద్‌ రైతుల భూములను ఎలా కొనుగోలు చేస్తారంటూ అప్పట్లో టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ నాయకులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావు కూడా అక్కడ ప్రభుత్వ భూములను కొనుగోలు చేశారు. సీఎం కేసీఆర్‌కు విషయం తెలియడంతో తిరిగి ఆ భూములను రైతులకు అందజేశారు. ఇటీవల శంషాబాద్‌ మండలంలోనే కొత్వాల్‌గూడ ఊరును తాకట్టు పెట్టి రూ.332 కోట్ల రుణం తీసుకున్న ఘటన బయటపడింది. అలాగే గొల్లపల్లిలో 261 సర్వే నంబరును సృష్టించి కొందరు అక్రమార్కులు ఏకంగా కోట్లు విలువ చేసే ప్రభుత్వభూమిని అమ్మేందుకు సిద్ధపడ్డారు. విమానాశ్రయం పుణ్యమాని భూముల ధరలకు రెక్కలు రావడంతో అక్రమార్కులు ప్రభుత్వ భూములపై కన్నేశారని పలువురు ఆరోపిస్తున్నారు.
 
పాస్‌ పుస్తకాలు లేక తిప్పలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూసర్వే మా గ్రామంలో నిర్వహించలేదు. మాకు పట్టా పాస్‌పుస్తకాలు కూడా లేవు. దీంతో బ్యాంకు రుణాలు, సబ్సిడీ విత్తనాలు తీసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నాం.
 
జీళ్ల జంగయ్య, రైతు, ఘన్సీమియాగూడ
భూసర్వే చేస్తే బాగుండేది
జిల్లావ్యాప్తంగా జరిగినట్లు మా గ్రామ పంచాయతీలోనూ భూసర్వే చేయిస్తే బాగుండేది. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుండేది.
 
పాముల బిక్షపతి, రైతు, ఘన్సీమియాగూడ
కలెక్టర్‌ ఆదేశాలతో నిలిపివేశాం
ఘన్సీమియాగూడ, బహదూర్‌గూడలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే సమగ్ర భూసర్వే, పట్టా పాస్‌పుస్తకాలు ఆపేశాం. మార్చి తరువాత ఆ రెండు గ్రామాలలో కోర్టు కేసులు మగిశాక సర్వే చేయించి కొత్త పట్టా పాస్‌పుస్తకాలు ఇస్తాం. ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం.
తహసీల్దార్‌ సురేశ్‌ కుమార్‌
 
 

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.