ADVT
చివరి రోజూ నిరసనలే!
10-02-2018 03:04:59
  • పోతురాజు వేషంలో శివప్రసాద్‌ శివాలు...
  • టీడీపీ ఎంపీల ఆందోళన
  • మార్చి 5కు వాయిదా పడిన సభలు
  • తొలిసారి వెల్‌లోకి బుట్టా రేణుక
  • నిరసనలకు దూరంగా కొత్తపల్లి గీత
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు తొలి విడత బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు కూడా ఉభయసభలు టీడీపీ ఎంపీల నిరసనలతో హోరెత్తాయి. శుక్రవారం ఉదయం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని ఏపీకి న్యాయం చేయాలని నినదించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ వినూత్నంగా పోతురాజు వేషంలో వచ్చి అందరినీ ఆకర్షించారు. తిరుపతి వేంకటేశ్వరుడు తనను ఆవహించాడని చెబుతూ ప్రధాని మోదీని ఉద్దేశించి ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నువ్వు నా సన్నిధిలోనే ఏపీ ప్రజలకు మాట ఇచ్చావు గుర్తు పెట్టుకో.. ఎవరైనా నా దగ్గరకే వస్తారు.. నువ్వు నీ దగ్గరకు రప్పించుకున్నావు.. దీని ఫలితం అనుభవిస్తావు’ అంటూ ఊగిపోయారు.
 
వెంటనే విజయవాడ కనకదుర్గమ్మ కూడా ఆవహించి మోదీని ప్రశ్నించినట్లు మాట్లాడారు. జాతీయ మీడియా సైతం ఈ వినూత్న నిరసనపై ఆసక్తి చూపడం గమనార్హం. లోక్‌సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ ఎంపీలు వెల్‌లోకి వచ్చిన నిరసన వ్యక్తం చేశారు. పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. అదే సమయంలో శివప్రసాద్‌.. పోతురాజు వేషధారణతో వెల్‌లోకి వస్తుండగా స్పీకర్‌ జోక్యం చేసుకుని ప్రతి రోజూ ఇలా నిరసన వ్యక్తం చేయడం పద్ధతి కాదని, మీ సీట్లల్లో కూర్చోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా నినాదాలు చేస్తుండటంతో స్పీకర్‌ గంటసేపు సభను వాయిదా వేశారు.
 
12 గంటలకు తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నిరసన కొనసాగడంతో స్పీకర్‌ సభను మార్చి 5 వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 4రోజులుగా ఏపీ ఎంపీలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నా బుట్టా రేణుక, కొత్తపల్లి గీత పాలుపంచుకోలేదు. శుక్రవారం మాత్రం రేణుక వెల్‌లోకి వచ్చి నిల్చున్నారు. ఆ సమయంలో ఆమె టీడీపీ ఎంపీలు ఉన్న వైపు వెళతారా లేక వైసీపీ ఎంపీల పక్కన నిలబడతారా అని అందరూ ఆసక్తిగా గమనించారు. రెండు వర్గాలకు మధ్యలో ఆమె నిలుచొన్నారు. చేతిలో ప్లకార్డు లేకపోవడంతో తెల్లకాగితంపై పెన్నుతో డిమాండ్‌ రాసి పట్టుకున్నారు. ఆమె వెల్‌లోకి వచ్చిన మూడు నిమిషాలకే సభ వాయిదా పడింది. కొత్తపల్లి గీత మాత్రం నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలేదు.
 
రాజ్యసభలోనూ నిరసనల జోరు
రాజ్యసభలోనూ టీడీపీ ఎంపీలు తమ నిరసనల జోరు కొనసాగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా ఎంపీలు వెల్‌లోనే ప్లకార్డులు పట్టుకొని నిల్చున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సభ్యులు వెల్‌లోకి వస్తే తాను సభను నడపలేనని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు నిస్సహాయత వ్యక్తం చేశారు. సభను వాయిదా వేయడం లేదా సభ్యులపై చర్యలు తీసుకోవడం.. ఈ రెండే తన ముందున్న మార్గాలని హెచ్చరించారు. సభ వాయిదా వేయడం అనగానే విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. అయినా టీడీపీ ఎంపీలు వెనక్కి తగ్గలేదు. దీంతో వెంకయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘దేశ ప్రజలు ఈ దృశ్యాలు చూడాలని నేను అనుకోవడం లేదు. ఇది పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధం. ఇది సభ ప్రతిష్ఠను తగ్గించినట్లే.’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీలు సాయంత్రం వరకు వెల్‌లోనే నిరసన తెలిపారు. మధ్యాహ్నం సభలో ఉన్న అమిత్‌ షాతో సుజనా చౌదరి చర్చలు జరిపారు.
 
 
 
 

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.