ADVT
పార్లమెంటు గౌరవాన్ని కాపాడుదాం
10-02-2018 03:01:53
  • క్రమశిక్షణతో.. నాణ్యమైన చర్చలు చేద్దాం..
  • పార్టీల కుమ్ములాటకు వేదిక కాకూడదు
  • ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించండి
  •  పెద్దల సభలో సభ్యులకు పెద్దాయన హితవు
  • కొత్త అధ్యాయం ప్రారంభించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య పిలుపు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): నాణ్యత కలిగిన చర్చలు, నిర్మాణాత్మక విమర్శలు, క్రమశిక్షణతో కూడిన సమావేశాలు.. పార్లమెంటు ప్రమాణాలను నిర్దేశిస్తాయని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు అన్నారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంటును ఒక పటిష్టమైన వ్యవస్థగా మార్చేందుకు సభ్యులంతా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యసభలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న ఆందోళనలను ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ.. సమావేశాలు భగ్నం కావడం తనకెంతో బాధ కలిగించిందన్నారు. బడ్జెట్‌పై చర్చ అనంతరం తొలి విడత బడ్జెట్‌ సమావేశాల ముగింపు సందర్భంగా రాజ్యసభలో వెంకయ్య మాట్లాడారు. పార్లమెంటరీ విధానాలను సభ్యులు లెక్కచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా పార్లమెంటు తన ప్రమాణాలను నెలకొల్పగలుగుతుందా.. అని తనను తాను ప్రశ్నించుకున్నానని, రాజ్యసభ చైర్మన్‌గా చివరికి తానే ప్రజలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ‘పార్లమెంటేరియన్లుగా సమాజంలో ఉన్నత శ్రేణిలో ఉండాల్సిన మనమే సభ్యత పాటించకపోడం సరైంది కాదు. దేశంలో వేలాది మంది టెలివిజన్‌ తెరలపై మనల్ని చూసి ఏమనుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించుకోవాలి. పార్లమెంటు గౌరవాన్ని, పవిత్రతను పెద్దల సభ ద్వారా దాని ఆధిక్యతను మనమే కాపాడాలి’ అని వెంకయ్య అన్నారు. పార్లమెంటు 60వ వార్షికోత్సవం సందర్భంగా 2012లో చేసిన పనులను గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. ఇప్పటికైనా సంయమనం పాటించి హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. కొద్ది రోజులు మాత్రమే జరిగిన ఈ సమావేశాల్లోనూ 10 గంటల సభా సమయం వృధా కావడం విచారకరమన్నారు. ఐదు రోజులపాటు ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ జరగలేదని గుర్తు చేశారు. ఈ పరిస్థితి ఇంకెంతమాత్రమూ కొనసాగరాదని, 130 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. తాను ఏ పార్టీనీ ఉద్దేశించి చెప్పడంలేదని, సభను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నానని అన్నారు.
 
పార్లమెంటు అనేది జాతీయ అభివృద్ధికి దశ, దిశ అందించే వ్యవస్థ అన్న విషయాన్ని మరిచిపోరాదని, ప్రజలు తమను విశ్వసిస్తున్నందున.. ప్రజా సమస్యలపై చక్కగా చర్చించి పరిష్కారాలు కనుగొనాలని సూచించారు. పార్లమెంటు రాజకీయ పార్టీల మధ్య కుమ్ములాట జరిపే వేదిక కాకూడదని, అసభ్యకర భాషను, ప్రవర్తనను ప్రయోగించేందుకు పోటీ పడవద్దని అన్నారు. పార్లమెంటు చరిత్రలో కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. అయితే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కొంత నాణ్యమైన చర్చ జరిగిందన్నారు. ఎంపీల ప్రతిభ తక్కువేమీ కాదని, దానిని వారు చక్కటి ఉపన్యాసాల ద్వారా వ్యక్తీకరించారని చెప్పారు.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.