పబ్‌ల బాంధవుడు పోలీసులకు సైంధవుడు
10-02-2018 02:57:32
  • ఐపీఎస్‌ తనయుడి అక్రమ దందా.. 
  • తన కనుసన్నల్లోనే పబ్‌లు, హుక్కాలు
హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఆయన నగరంలో సీనియర్‌ పోలీసు అధికారి. నీతి, నిజాయితీలకు మారుపేరని డిపార్ట్‌మెంట్‌లో చెప్పుకుంటారు. ఆయన తనయుడి తీరు అందుకు భిన్నం. తండ్రి హోదా చెప్పి దందాలు చేస్తుంటాడు. ఒక పబ్‌లో భాగస్వామ్యం ఉందంటాడు. నిజానికి నగరంలోని పబ్బులు.. హుక్కా కేంద్రాలకు తనే బిగ్‌బాస్‌ అని ఈ దందా గురించి తెలిసిన వారు చెబుతుంటారు. నగరంలో పబ్‌లు వారాంతంలో సమయానికి మించి ఎక్కువ సమయం తెరిచి ఉంచాలంటే చిన్నసార్‌ పర్మిషన్‌ తీసుకుంటే చాలు, పనైపోతుందంటారు. చిన్నసార్‌ ఓకే చెప్పాలంటే తను చెప్పినంత చెల్లించాల్సిందే. చిన్నసార్‌కు కోపం తెప్పిస్తే మూల్యం భారీగా ఉంటుందంటారు. పబ్బు యజమాని అయినా పోలీసు అధికారైనా, ఇబ్బంది ఎలాంటిదైనా చిన్నసారు దర్బారుకి వెళ్తే చాలు చటుక్కున స్పందిస్తాడు. కాకుంటే ఉత్త చేతులతో వెళ్లకూడదు. ఎలాంటి పనినైనా చిటికెలో చేస్తాడన్న పేరుంది. చిన్నబాస్‌ కనుసన్నల్లోనే బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, మాదాపూర్‌, గచ్చిబౌలి పబ్బులు నడుస్తాయని చెబుతారు. ఇతగాడి దెబ్బకు పోలీసు అధికారులు సైతం హడలిపోతున్నారు. ధైర్యంచేసి చట్టప్రకారం నడిచే ప్రయత్నం చేస్తే బదిలీ వేటు వేయిస్తాడు. మొదట హెచ్చరించటం.. అప్పటికీ వినకపోతే బదిలీ వేటు వేయించటం అలవాటు. ఇటీవల ఒక ఇన్‌స్పెక్టర్‌ బదిలీయే ఇందుకు నిదర్శనం. తండ్రి పేరు చెప్పుకొని హవా నడిపించే చిన్నబా్‌సకు ఈ మధ్యన రాజకీయ అండ తోడైందని చెబుతున్నారు. దీంతో అతగాడి హడావుడి మరింత పెరిగింది. దీంతో పబ్‌ల వైపు చూసేందుకు అధికారులు జంకుతున్నారు. పెద్దోళ్ల విషయంలో తలదూర్చి తల నొప్పులు తెచ్చుకోవడం ఎందుకని, తమకేమీ తెలీనట్లు ఉండిపోతున్నారు. కొడుకు భాగోతం పోలీస్‌ తండ్రికి తెలీదని అధికారులు అంటున్నారు.
 
గంటకు ఎంతైనా పర్వాలేదట
పబ్‌ల వ్యాపారం రాత్రి 10 నుంచి జోరు అందుకుంటుంది. 12కు కొత్త సందడి షురూ అవుతుంది. నగరం నిద్రలో జారుకుంటూ ఉంటే.. నైట్‌ లైఫ్‌లో కొత్త హడావుడి మొదలవుతుంది. ఎంత ఆలస్యంగా పార్టీ ముగిస్తే అంత వ్యాపారం. ఆలస్యంగా మూసే పబ్‌కు వెళ్లేందుకు నైట్‌లైఫ్‌ ప్రియులు మక్కువ చూపుతుంటారు. అందుకే లేటుగా పబ్బు మూసేందుకు సాయంచేస్తే.. ఎంత కావాలంటే అంత ఇచ్చేందుకు నిర్వాహకులు సిద్ధపడుతున్నారు. రెండు గంటల అదనపు వ్యాపారానికి రూ.లక్ష చెల్లించడానికి ముందుకొస్తున్నారు. చిన్నసార్‌ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తానే డీల్‌ చేయటం మొదలెట్టాడు. వీకెండ్‌ మూడు రోజులూ పరిమితికి మించి పబ్‌ను తెరిచి ఉంచేందుకు ఒక ధరను ఫిక్స్‌ చేసినట్లు చెబుతారు. తానే స్వయంగా వసూలు చేస్తాడని సమాచారం. తన హవాకు అడ్డు చెప్పని వారిని జాగ్రత్తగా చూసుకునే చిన్నసార్‌కు సీమాంధ్రకు చెందిన ఓ రాజకీయ నేత అండదండలు ఉన్నట్లు చెబుతారు. మొదట్లో గంటకు ఇంత అంటూ అదనపు సమయానికి వసూలు చేసే స్థాయి నుంచి ఇప్పుడు కొత్తగా ఎవరు పబ్‌ పెట్టాలన్నా.. అందులో భాగస్వామ్యం కోసం డిమాండ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
 
విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు..
పబ్‌లను చట్టప్రకారం మూయిస్తున్న ఒక సీఐ వ్యవహారం చిన్నసార్‌కు తెగ కోపం తెప్పించింది. పశ్చిమ మండలం పరిధిలోని ఆ సీఐ ఎంతకూ దారికి రాకపోవడంతో తానేంటో చూపిస్తానని చెప్పాడు. అయినా వినలేదు. దాంతో సదరు సీఐను స్థల వివాదంలో ఇరికించాడు. ఒక వ్యాపారి చేత ఫోన్‌ చేయించి మీకు ఇవ్వాల్సిన అమౌంట్‌ ఎక్కడ ఇవ్వాలంటూ ఎర వేశాడు. సీఐ ఆ ఉచ్చులో పడనప్పటికీతనకున్న పరిచయాలతో అవినీతిపరుడిగా చిత్రీకరించి బదిలీ వేటు వేయించాడు. స్టేషన్‌లో చార్జ్‌ తీసుకున్న మూడు నెలలకే సదరు అధికారి బదిలీ కావటం పోలీస్‌ వర్గాల్లో చర్చకు తెర తీసింది. స్వల్ప కాలంలో బదిలీ ఎందుకు జరిగిందన్న విషయం కీలక అధికారి దృష్టికి వెళ్లింది. ఆయన సీరియ్‌సగా తీసుకుని అంతర్గత విచారణకు ఆదేశించారు. చిన్నసార్‌ విషయాలు తండ్రి అయిన ఐపీఎస్‌ దగ్గరకు వచ్చాయి. దీంతో కొడుకును కాపాడుకునేందుకు ఆయన ప్రయత్నాలు మొదలెట్టారు. కొడుకును కొంతకాలం విదేశాలకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
 
చిన్నసార్‌ గురించి కథలు.. కథలు
జూబ్లీహిల్స్‌.. సైబరాబాద్‌ పబ్‌ల జోరు వారాంతాల్లో తార స్థాయికి చేరుతుంది. వ్యాపారులు.. ఉద్యోగులు.. సంపన్నులు.. వివిధ వర్గాలకు చెందిన వారికి అవి సేదతీరే ప్రాంతాలుగా మారాయి. రాత్రి పది దాటాక పబ్‌ల జోరు పెరుగుతుంది. శుక్రవారం రాత్రి మొదలయ్యే సందడి శనివారానికి తారస్థాయికి చేరుతుంది. ఆదివారం తక్కువ. చట్టం ప్రకారం పబ్‌లు అర్ధరాత్రి 12 గంటలకు మూసివేయాలి. 12 వరకే మద్యం, ఆహారం వడ్డించాలి. వినియోగదారులు 12.30కు బయటకు వచ్చేయాలి. పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఫుల్‌గా వ్యాపారం జరిగే సమయంలో మూసివేయడం ఇష్టంలేక యాజమాన్యాలు సమయాన్ని పొడిగించాలని కోరినా అధికారులు అనుమతివ్వలేదు. కొంతకాలం క్రితం అధికారి పుత్రరత్నం రంగంలోకి దిగాడు. పబ్‌లో భాగస్వామ్యం ఉన్న అతను తండ్రి పేరుతో కొందరు అధికారుల్ని పరిచయం చేసుకున్నాడు. సీనియర్‌ అధికారి కొడుకు విషయం కావటంతో చూసీచూడనట్లుగా కొందరు వ్యవహరించారు. దాంతో చిన్నసారు హవా షురూ అయ్యింది.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.