ADVT
ఎవరికని చెప్పను?
10-02-2018 02:46:31
  • టీడీపీ నమ్మకమైన మిత్రపక్షం
  • ఆంధ్రకు హామీలు నెరవేర్చాలి
  • మీ పోరాటంలో తప్పు లేదు
  • కానీ సభ గౌరవమూ ముఖ్యమే
  • టీడీపీ ఎంపీలతో ఆడ్వాణీ
 
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ నమ్మకమైన మిత్రపక్షమని బీజేపీ అగ్ర నేత లాల్‌కృష్ణ ఆడ్వాణీ పేర్కొన్నారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పార్టీపై మరింత శ్రద్ధ ఉంచాలని అభిప్రాయపడ్డారు. పొత్తులో ఉన్న పార్టీలు ఒకరినొకరు గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అయినా ఎవరికని చెప్పనని తన ఆవేదన, నిస్సహాయతను వ్యక్తం చేశారు. రాష్ట్రానికిచ్చిన హామీల అమలు కోరుతూ టీడీపీ ఎంపీలు వరుసగా నాలుగోరోజూ కార్యకలాపాలను అడ్డుకోవడంతో.. లోక్‌సభను మార్చి 5కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ శుక్రవారం ప్రకటించారు. సభ్యులంతా నిష్క్రమిస్తున్న తరుణంలో ఆడ్వాణీ తన సీటులోనే ఉండడాన్ని గమనించిన టీడీపీ ఎంపీలు కె.రామ్మోహన్‌నాయుడు, రవీంద్రబాబు, మురళీమోహన్‌, మాల్యాద్రి, అవంతి శ్రీనివాస్‌ ఆయన వద్దకు వెళ్లారు. పది నిమిషాలు మాట్లాడారు.
 
‘నాడు మీరూ పార్లమెంటులో ఉన్నారు. పార్టీలన్నీ కలిసి విభజన చట్టాన్ని ఆమోదించాయి. రాజధాని లేదు. పరిశ్రమలు, ఉద్యోగాల్లేవు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. తర్వాత ప్రత్యేక ప్యాకేజీ అన్నారు. ఏడాదిన్నర దాటినా అతీగతీ లేదు. ప్రజలకు మేం జవాబు చెప్పుకోవాలి కదా! చివరి బడ్జెట్‌లోనూ ఏమీ ఇవ్వనందునే గొంతెత్తి మాట్లాడాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే మిత్రపక్షంగా ఉన్నప్పటికీ పార్లమెంటులో ఆందోళనకు దిగాల్సి వచ్చింది’ అని తెలిపారు. వారి పోరాటంలో తప్పులేదని ఆడ్వాణీ అన్నట్లు తెలిసింది. ‘అన్యాయం జరిగినప్పుడు గొంతెత్తే హక్కు మీకు ఉంది. అయితే సభాగౌరవం, పార్లమెంటు సంప్రదాయాలను కూడా గమనించాలి.
 
మీ ఆవేదనలో అర్థముంది. అర్థం చేసుకోవాలని జైట్లీకి చెబుతాను. గత మూడ్రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఇప్పటికే ఆయనతో మాట్లాడాను. ఆంధ్రకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పాను. త్వరలోనే పూర్తిచేస్తామని ఆయన అన్నారు’ అని తెలిపారు. ‘పార్లమెంటరీ సంప్రదాయాల గురించి మీరు బాధపడడంలో అర్థముంది. కానీ ఇలా చేస్తున్నందుకు మాకు అంతకంటే బాధ ఉంది. మీరంటే గౌరవం ఉంది. మీలాంటి పెద్దలు నైతిక మద్దతు ఇవ్వాలి. తొందరపడితే మమ్మల్ని మందలించండి. కానీ మాకు మద్దతివ్వండి’ అని ఎంపీలు కోరారు. మీరు జోక్యం చేసుకోవాలని అడుగగా.. ఎవరికని చెప్పను అని ఆడ్వాణీ నిట్టూర్చినట్లు తెలిసింది.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.