ADVT
ఇక బీజేపీ ‘లంచ్‌ పే చర్చా’
10-02-2018 02:34:16
  •  ప్రజల్లోకి వెళ్లి వాస్తవాల్ని వివరించండి
  •  ఎంపీలకు మోదీ, అమిత్‌ షా ఉద్బోధ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి ): గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘‘చాయ్‌ పే చర్చా’’ పేరిట తన ఆలోచనలు, చేపట్టబోయే పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసికెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ సారి లంచ్‌కు మారారు. గ్రామాల్లో, పట్టణాల్లో ‘లంచ్‌ పే చర్చా’ పేరిట బడ్జెట్‌లో పేర్కొన్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ తొలి విడత సమావేశాలు ముగిశాక.. శుక్రవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మోదీ- ఎంపీల ప్రచారం మీదే 2019లో పార్టీ విజయం ఆధారపడి ఉంటుందన్నారు.
 
‘వారణాసిలో నేను ప్రజలతో లంచ్‌ సమయంలో పార్టీ కార్యకర్తలతో వివిధ అంశాలపై చర్చించాను. అక్కడికి నా టిఫిన్‌ బాక్స్‌ నేనే తెచ్చుకున్నాను. అంచేత మీరు కూడా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో మధ్యాహ్న భోజన సమయంలో సమావేశాలు నిర్వహించాలి.. మీ భోజనం మీరే తీసుకెళ్లాలి... అది సహజంగా జరిగేట్లుండాలి.. మనమేదో భోజనం పెట్టి పథకాల గురించి ప్రచారం చేసినట్లుండకూడదు’ అని సూచించారు.
 
బీజేపీపై వస్తున్న ఆరోపణలకు అంశాల వారీగా గట్టిగా సమాధానం ఇవ్వాలని మోదీ కోరారు. కేంద్ర బడ్జెట్‌ మధ్యతరగతి వర్గాలకు, రైతులకు ఎంతో అనుకూలంగా ఉన్నదని.. ప్రజలకు వివరించి చెప్పాలని మోదీ సూచించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసికెళ్లాలన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రఽధానమంత్రి ప్రసంగిస్తున్నపుడు- కాంగ్రెస్‌ సభ్యులు అడ్డుకోవడం సరికాదని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అప్రజాస్వామిక వైఖరికి ఇది నిదర్శనమన్నారు. రాఫెల్‌ యుద్ద విమానాల ఒప్పందం గురించి రాహుల్‌ చేస్తున్న విమర్శలను తిప్పిగొట్టాలని ఆయన ఎంపీలను కోరారు. దేశ భద్రతా కారణాల రీత్యా అన్ని వివరాలూ బయటపెట్టలేమన్నారు.

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.