సెలవుకు మోదీ సెలవు
10-02-2018 02:31:18
  • యోగాసనం, శాకాహారం, మంచి నిద్ర...ఇవే రొటీన్‌!
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఏళ్ల తరబడి సెలవనేదే ఎరుగని వ్యక్తి ఎవరు? అలాంటి వారు జపాన్‌లోనే ఉంటారా?....... ఈ ప్రశ్నలకు ప్రధాని మోదీ సమాధానం ఇచ్చారు... ‘‘గత కొన్ని సంవత్సరాలుగా- అంటే సుమారు ఇరవయ్యేళ్లుగా ఆయన సెలవనేదే పెట్టలేదట. ‘‘సెలవు అంటే నాకు తెలియదు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా పనిచేసినపుడు లేదా ప్రధాని అయ్యాక నేనెన్నడూ హాలీ డే అన్నదే తీసుకోలేదు. పండగైనా పబ్బమైనా, ఆప్తులు పిలిచినా, ఆరోగ్యం బాగులేకపోయినా.. నేను సెలవు పెట్టలేదు. పని మానలేదు. పని చేసుకోవడం నాకు ఇష్టం..’’ అని మోదీ వెల్లడించారు. గల్ఫ్‌ దేశాల్లో పర్యటనకు వెళ్లే ముందు ఆయన గల్ఫ్‌ న్యూస్‌ ఎక్స్‌ప్రె్‌సకు ఈమెయిల్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘పనిలో భాగంగా నేను విస్తృతంగా ప్రయాణం చేయాల్సి వచ్చేది.
 
గుజరాత్‌లో అయితే దాదాపు ప్రతీ జిల్లా, పట్టణం, అణువణువూ తిరిగాను. ఎంతో మం దితో మంచీ చెడ్డా మాట్లాడేవాణ్ణి. అలాగే ప్రధాని కాకమునుపూ, అయ్యాక కూడా దేశమంతా పర్యటించాను. ప్రజల ఆశలు, బాధలు, ఆకాంక్షలు..అన్నీ తెలుసుకుంటూ వచ్చాను. స్థానికంగా పాప్యులరైన వంటకాలూ రుచి చూసేవాణ్ణి.. ఇవన్నీ నాకు కొత్త ఉత్సాహాన్నిచ్చేవి.. సెలవు తీసుకోవాలన్న ధ్యాసే లేకుండా చేశాయి’’ అని ఆయన ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లినపుడు వంటవారు ఎవరూ వెళ్లరు. ‘‘తీసికెళ్లడం నాకు ఇష్టం ఉండదు. నేను ఆ యా దేశాల్లో చేసే వంటకాలనే రుచి చూస్తాను’’ అని వివరించారు. ఎలాంటి ఆహారం ఇష్ట పడతారన్న ప్రశ్నకు- నేను మరీ అంత భోజనప్రియుణ్ణి కాదు.. చాలా మామూలు శాకాహార భోజనాన్ని ఇష్టపడతాను...కూరగాయలు, పళ్లు ముఖ్యంగా ఉండాలి.. అని మోదీ బదులిచ్చారు. మోదీ ఉదయాన్నే యోగా చేస్తారని అందరికీ తెలిసిన విషయం.. ‘‘యోగా చేయడం, ఆసనాలు వేయడం మాత్రమే కాదు.
 
నేను ఉదయం లేవగానే పేపర్లు చూస్తాను. నా ఈమెయిల్‌ చెక్‌ చేస్తాను. కొన్ని ముఖ్యమైన వాటికి సమాధానాలు పంపుతాను. కొందరు ముఖ్యులతో ఫోన్లో మాట్లాడతాను. మోదీ మొబైల్‌ యాప్‌ను చెక్‌ చేసి అందులో పౌరుల సూచనలు, సలహాలు నోట్‌ చేసుకుంటాను...’’ అని వెల్లడించారు. మరి రాత్రి పడుకునేముందు ఏం చేస్తారన్న ప్రశ్నకు- ‘ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఫైళ్లు తిరగేస్తాను.. వీలైనవి క్లియర్‌ చేస్తాను. మరుసటి రోజు ఎంగేజ్‌మెంట్స్‌, చేయాల్సిన పనులనూ సిద్ధం చేసుకుంటాను. నాకు నాలుగు నుంచి ఆరుగంటల నిద్ర అవసరం. ఆ నిద్ర సంపూర్ణంగా ఉంటుంది... డీప్‌ స్లీప్‌ అనమాట’’ అని ఆయన చెప్పుకొచ్చారు. వారంలో ఏ రోజు ముఖ్యమైనదన్న ప్రశ్నకు- ‘వారంలో ఈరోజు నాకు ముఖ్యమైనది అని ప్రతీరోజూ అనుకుంటాను’ అని బదులిచ్చారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.