మోహ క్షయమే మోక్షం
10-02-2018 02:31:17
ఒకసారి.. అగస్త్య మహర్షి అనుగ్రహ దృష్టి ఒక సామాన్య రైతుపై పడింది. రోజంతా ఆ రైతు ఎండనకా, వాననకా పడుతున్న కష్టాన్ని, అందుకు తగిన ప్రతిఫలం లేక అనుభవిస్తున్న దారిద్ర్యాన్ని చూసిన మహర్షి మనస్సు ద్రవించింది. దీంతో అతడి వద్దకు వెళ్లి.. ‘నాయనా, ఈ సంసార సాగరంలో చిక్కుకుని ఎందుకు కష్టపడతావు? నీకు మోక్షం ప్రసాదిస్తాను’ అన్నాడు. దానికా రైతు.. ‘స్వామీ నా కుమారులు చిన్నవాళ్లు, వ్యవసాయం చేసే స్థితిలో లేరు.
 
కాబట్టి నాకు 10 సంవత్సరాల తర్వాత మోక్షం ప్రసాదించండి’ అన్నాడు. సరేనన్న అగస్త్యుడు.. పదేళ్ల తర్వాత వెళ్లగా, కొడుకు పెళ్లి చేశానని, మనవడితో ఆడుకోవాలని ఉందని చెప్పి మళ్లీ పదేళ్లకు రమ్మన్నాడు. అలాగేనన్న అగస్త్య మహర్షి పదేళ్ల తర్వాత వెళ్లగా.. రైతు లేడుగానీ.. ఇంటి గడప దగ్గర ఒక కుక్క పడుకొని ఉంది. ఆ కుక్కే గత జన్మలో రైతు అని అగస్త్యుడు గ్రహించాడు. చనిపోయినా కుటుంబంపై మమకారాన్ని వీడలేక కుక్క జన్మ ఎత్తి కాపలాకాస్తున్నాడని అర్థమైంది. దీంతో ఆ కుక్కకు జ్ఞానం ప్రసాదించి.. ఇప్పటికైనా మోక్షానికి సిద్ధమా అని అడిగాడు.
 
దానికా కుక్క రూపంలో ఉన్న రైతు.. తాను డబ్బు దాచిన స్థలం పిల్లలకు తెలియదని అది దొంగలపాలు కాకుండా కాపలా కాస్తున్నానని, పదేళ్ల తర్వాత రావాలని కోరాడు. పదేళ్ల తర్వాత మళ్లీ అగస్త్యుడు వెళ్తే.. ఆ రైతు పాముగా పుట్టి ఉన్నాడు. దీంతో అగస్త్యుడు ఆ ఇంటివారిని పిలిచి ‘మీ పెరట్లోని పుట్టలో నిధి ఉంది’ అని చెప్పాడు. అప్పుడు వారు నిధి కోసం ఆ పుట్టను తవ్వి అందులోని పామును చంపేశారు. ఎవరికోసం తాను తపనపడుతున్నాడో వారే క్రూరంగా కొట్టి చంపడంతో పాము రూపంలోని రైతుకు మోహబంధం తెగిపోయింది. మోహక్షయమే మోక్షం గనక రైతుకు మహర్షి దయవల్ల పునర్జన్మ లేకుండా పోయింది. మనిషిన మోహబంధమే మోక్షానికి దూరం చేస్తుందని అగస్త్య మహర్షి ఈ వృత్తాంతం ద్వారా తెలిపారు.
- మాదిరాజు రామచంద్రరావు
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.