ADVT
రాఫెల్‌పై రాహుల్‌ మరో దాడి
10-02-2018 02:29:11
  • జైట్లీని.. జైట్‌ లై అని సంబోధించిన వైనం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై కాంగ్రెస్‌ మరో అస్త్రం సంధించింది. దేశ భద్రతకు సంబంధించిన ఈ యుద్ధవిమానాల కొనుగోలు ఖర్చు వివరాలను వెల్లడించడం కుదరదని, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ విషయంలో నాటి రక్షణ మంత్రులు - ప్రణబ్‌ ముఖర్జీ, ఏకే ఆంటోనీల నుంచి నేర్చుకోవాలని, వారు 15 సార్లు ఇందుకు సంబంధించిన అభ్యర్థనలను తిరస్కరించారని గురువారం పార్లమెంట్‌లో అరుణ్‌ జైట్లీ అన్న మాటలకు దీటుగా ప్రతిస్పందించింది. 2013లో మిరేజ్‌-2000 తరహా యుద్ధవిమానాలు, గోర్షకొవ్‌ యుద్ధనౌకల కొనుగోలుకు సంబంధించి- నాటి రక్షణమంత్రి ఏకే ఆంటోనీ- పార్లమెంట్‌లో వచ్చిన మూడు ప్రశ్నలకు ఇచ్చిన మూడు సమాధానాల్ని కాంగ్రెస్‌ బయటపెట్టింది. అందులో వాటికి ఎంతెంత ఖర్చయ్యిందీ, ప్రభుత్వం ఎలా బేరసారాలు జరిపినదీ వివరంగా ఉంది.
 
‘యూపీఏ ఎన్నడూ ఈ వివరాలను బయటపెట్టలేదని మీరు అన్నారు. మీరు చెప్పినది అబద్ధం అని తెలియజెప్పే సాక్ష్యాలివిగో.. ఇకనైనా మీ రక్షణ మంత్రిని చెప్పమనండి. రాఫెల్‌ యుద్ధవిమానం ఒక్కోదానికీ ఎంత ఖర్చయ్యిందో!’’ అని రాహుల్‌ నిలదీశారు. ‘‘వీటిపై ఏం సమాధానమిస్తారు మిస్టర్‌ అరుణ్‌ జైట్‌లై?’’ అని ప్రశ్నించారు. ఈ సంబోధనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు భూపేందర్‌ యాదవ్‌ రాహుల్‌పై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టారు. దీనికి రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు ‘ప్రాథమికంగా చూస్తే ఇది కరెక్టేనని అనిపిస్తోంద’ని నోట్‌ రాసి - లోక్‌సభ స్పీకర్‌కు పంపారు. డిసెంబరు 27న కూడా రాహుల్‌- జైట్లీని.. ‘జైట్‌ లై’ అన్న విషయం తెలిసిందే.

Advertisement

Advertisement

Advertisement

Advertisement

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.