యాదాద్రికి స్వర్ణ కళ
10-02-2018 02:22:10
  • విమాన గోపురం, ధ్వజ స్తంభం, శయనశాలకు బంగారు తాపడం..
  • ప్రధాన ద్వారాలకు వెండి తొడుగు
  • భక్తులు సమర్పించిన బంగారం..వినియోగానికి ప్రభుత్వం అనుమతి
యాదాద్రి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ ఆధ్యాత్మిక క్షేత్రంగా తిరుమల స్థాయిలో అభివృద్ధి పనులు సాగుతున్న స్వయంభూ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం బంగారు శోభను సంతరించుకోనుంది. ప్రాచీన శిల్పకళా సౌరభం ఉట్టిపడే విధంగా నిర్మితమవుతున్న ఆలయ విమాన గోపురంతో పాటు ధ్వజస్తంభం, స్వామివారి శయనశాలకు బంగారం తాపడం చేయాలని నిర్ణయించారు. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా కొత్తగా నిర్మిస్తున్న ఏడు గోపురాల లో విమాన గోపురానికి స్వర్ణతాపడం చేయాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించం తెలిసిందే. భక్తులు స్వామివారికి సమర్పించి న బంగారం, వెండిని వినియోగించాలన్న ప్రతిపాదనకు దేవాదాయశాఖ కమిషనర్‌ శివశంకర్‌ పరిపాలనాపరమైన అనుమతులు జారీ చేసినట్టు తెలిసింది. ఎంత బంగారం అవసరమవుతుంది, అందుబాటులో ఎంత ఉందనే దానిపై ఆలయ అధికారులను నివేదిక కోరినట్టు తెలిసింది. అలాగే ప్రధాన ద్వారాలకు, గడపలకు వెండి తొడుగులను అమర్చనున్నారు.
 
స్వామివారి ఖజానాలో 45 కేజీల బంగారం
లక్ష్మీనరసింహస్వామికి భక్తులు బంగారం, వెండిని కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇలా స్వామివారి ఖజానాలో దాదాపు 45 కిలోల బంగారం, 2వేల కిలోలకుపైగా వెండి ఉన్నట్టు అంచనా. వీటిలో 20 కిలోల బంగారం స్వామివారికి ప్రత్యేక ఉత్సవాల్లో, రోజువారీ అలంకరణకు వినియోగించే ఆభరణాలు, పూజా సామగ్రి రూపంలోను, మరో 25 కిలోలు ముడి బంగారంగా ఆలయ ఖజనాలో ఉందని ఆలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. దాదాపు 1500 కిలోల ముడి వెండి అందుబాటులో ఉందని సమాచారం.
 
త్వరలో టెండర్లు
బంగారు, వెండి తొడుగుల పనులను నిపుణులకు అప్పగించడానికి వైటీడీఏ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. నిపుణుల ఎంపిక కోసం వైటీడీఏ వైస్‌ చైర్మన్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌, మైనింగ్‌ సాంకేతిక నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ ఆలయాలకు బంగారు, వెండి తొడుగు పనులు చేసిన చెన్నై చెందిన నిపుణులను సంప్రదించారు. అంచనా వ్యయంతో పాటు చార్జీలపై ప్రాథమికంగా పరిశీలన జరిపారు. త్వరలోనే టెండర్లు పిలవనున్నట్టు తెలిసింది.
 
47 అడుగులవిమాన గోపురం
యాదాద్రి ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2014లో అక్టోబరు 17న తొలి పర్యటనలోనే ప్రకటించారు. స్వామివారు కొలువైన కొండగుహ గర్భాలయంపై 47 అడుగుల విమాన గోపుర నిర్మాణ పనులు ప్రారంభించారు. సుదర్శన చక్రం ప్రతిష్ఠించే ఈ గోపురానికి మొదట 32 పొరలతో వెండి రేకులతో తాపడం అమరుస్తారు. దానిపై బంగారు తాపడం చేయనున్నారు. దీనికి దేవస్థానం వద్ద గల భక్తులు సమర్పించిన ముడి బంగారం వినియోగించడానికి ప్రభుత్వం అంగీకరించింది. గర్భాలయం ఎదుటగల ధ్వజ స్తంభం, ముఖ మండపంలోని స్వామివారి శయనశాలను కూడా స్వర్ణతాపడం చేయనున్నారు.
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
digitalsales@andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.